అల్ప‘పీడ’నం
జిల్లాలో రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నను దెబ్బతీశాయి. పంట చేతికొచ్చే సమయంలో అన్నదాత ఆశలను నీట ముంచాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం అంతా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వరి, మిరప పంట ఉత్పత్తులు తడిచిపోయాయి. మరోవైపు నిన్నటి వరకు ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరిపీల్చుకుంటున్నారు.
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: వర్షం కారణంగా కోవెలకుంట్ల - నంద్యాల ఆర్‌అండ్‌బీ రహదారిలో శుక్రవారం వాహనాల రాకపోకలు స్తంభించి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నంద్యాల, ఆళ్లగడ్డ రహదారుల్లో పట్టణ శివారులో, జోళదరాశి, రేవనూరు, భీమునిపాడు సమీపాల్లో కల్వర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో పక్కనే ఉన్న పొలాల్లో వాహనాలు రాకపోకలు సాగించేవి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కోవెలకుంట్ల మండలంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. పొలాల్లోని దారి మొత్తం బురదమయంగా మారడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. నంద్యాల రహదారి స్తంభించిపోవడంతో ఆర్టీసీ అధికారులు లింగాల మీదుగా బస్సులను మళ్లించారు. ఆళ్లగడ్డ రహదారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. తర్వాత పొలాల రస్తాలో బురద ఆరిపోవడంతో రాకపోకలను పునరుద్ధరించారు.
మిరపరైతు కన్నీరు
పెద్దకడబూరు, న్యూస్‌లైన్: గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలు మిరప రైతుకు కన్నీటిని మిగిల్చాయి. మండలంలో మిరప సాగు చేసిన రైతులు దిగుబడులను ఆర బెట్టుకున్నారు. ఆ సమయంలో వర్షం రావడంతో దిగుబడులు తడిసిపోయాయి. అసలే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఇది శాపంగా మారింది. వర్షంలో తడవడంతో క్వాలిటీ దెబ్బతింటోందని, దీంతో రేటు మరింత పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోసిగిలో భారీ వర్షం
కోసిగి,న్యూస్‌లైన్: కోసిగిలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లాయి. కోసిగిలోని చింతలగేరి వీధి, కడపాళెం ఎస్సీ కాలనీ, ఆంజనేయ స్వామి, బీరప్ప దేవాలయాల ప్రాంతాల్లో కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారాయి. ఇళ్ల ఎదుట చెత్తా చెదారం పేరుకుపోయింది. బస్టాండ్ పరిసరాలు నీటిని నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వర్షంతోపాటు గాలులు వీయడంతో దుద్ది గ్రామంలో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో చిర్తనకల్లు, మూగలదొడ్డి గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిచిపోయింది. గ్రామ ప్రజలు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలగించారు.
పొంగిపొర్లిన వాగులు
కోసిగిరూరల్, న్యూస్‌లైన్: గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో వాహన దారులు, రైతులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డి.బెళగల్- పల్లెపాడుకు వెళ్లే వంక, కోసిగి నుంచి సజ్జలగుడ్డం వైపు వెళ్లే సజ్జలగుడ్డం వంక, కోసిగి నుంచి ఎల్లెల్సీ మెయిన్ కాలువకు వెళ్లే ప్రాంతంలోని ఈత వంకలు నీటి ప్రవాహంతో నిండిపోయాయి. కల్వర్టులపైన అడుగున్నర మేర నీళ్లు పారాయి. డి.బెళగల్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణం నీటి కుంటగా మారింది. చిన్నభూంపల్లి గ్రామంలోని నారాయణప్పతాత మఠం సమీపంలోని బీసీ కాలనీ వాసులు తమ ఇళ్లకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మునిగిన వరి రైతు
మంత్రాలయం, న్యూస్‌లైన్: మండలంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో వరి పొలాలు నీట మునిగాయి. అప్పటికే కుప్పలుగా పోసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయ్యింది. పట్టణంలోని బస్టాండ్, తహశీల్దార్ కార్యాలయ పరిసరాలు నీటితో నిండిపోయాయి. వాన రాకతో మాధవరం, చెట్నెహళ్లి గ్రామాల్లో వరి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. మాధవ రానికి చెందిన రైతు నారాయణ వరికోతలు కోసి ధాన్యపు గడ్డిని పొలంలోనే ఉంచాడు. వర్షపునీటితో ఆ ధాన్యం తడిసిపోవడంతో దాదాపు రూ.40 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోతున్నాడు. మాధవరం, కల్లుదేవకుంట, చెట్నెహళ్లి, రచ్చుమర్రి వాగులు పొంగిపొర్లాయి.