గుండె గూటిలో నిండు ప్రేమ! | Couple Save Birds in Hyderabad | Sakshi
Sakshi News home page

గుండె గూటిలో నిండు ప్రేమ!

Published Fri, Apr 26 2019 6:59 AM | Last Updated on Mon, Apr 29 2019 11:02 AM

Couople Save Birds in Hyderabad - Sakshi

వేకువజామునే పిట్టలకిలకిలారావాలు. కోకిలమ్మల కుహుకుహూ గానాలు. ఊర పిచ్చుకల కిచకిచలు ఆ ఇంట్లో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తాయి. అతిథి గృహాల్లాంటి గూళ్లలో ఒదిగిపోతాయి.ఆ ఇంటి ఆతిథ్యాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాయి. వివిధ రకాల పక్షులు కాలానుగుణంగా ఆ ఇంటికి వచ్చి వెళ్తాయి. హస్మత్‌పేట్‌ అబ్రార్‌నగర్‌లో నివాసం ఉండే వెంకటేశ్వరరావు, హైమవతి దంపతులు తమ ఇంటి ఆవరణలో పక్షుల కోసం 22 గూళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో గింజలు, నీరు నిరంతరం అందుబాటులో ఉంచుతారు. ఏ పక్షి ఎప్పుడైనా రావచ్చు. కావాల్సినన్ని గింజలుతిని వెళ్లవచ్చు.  ఇలా రకరకాల పక్షుల రాకతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. 20 ఏళ్లుగా పక్షుల సంరక్షణే లక్ష్యంగా ఆ దంపతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తమ ఇంటిని బుల్లి పిట్టలకు నిలయంగా మార్చారు. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం.

’మాది వరంగల్‌. మావారు వెంకటేశ్వరరావు విశ్రాంత ఉద్యోగి. మా చిన్న కూతురు షర్మిలతో కలిసి ఇక్కడ ఉంటున్నాం. అప్పట్లో ఆకాశంలోకి చూస్తే  రకరకాల పక్షుల గుంపులు కనిపించేవి. కొన్ని ఒంటరిగా వెళ్లేవి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో  తెలియదు. చెట్ల కొమ్మలపై వాలి సందడి చేసేవి. ఇప్పుడు ఆ పక్షుల గుంపులు అరుదైన దృశ్యాలే. ఆవులు, కోళ్లు, మేకలు, కాకులు, పిచ్చుకలు, కోయిలలతో కూడిన సహజమైన వాతావరణంలో పుట్టి పెరిగిన మేము ముప్పై ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడ్డాం. హైదరాబాద్‌ విస్తరిస్తున్న కొద్దీ  పక్షుల జాడ కనిపించకుండా పోతోంది. వాటిని కాపాడుకొనేందుకు ఒక సహజమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనిపించింది. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన మా ప్రయత్నానికి క్రమంగా ఆదరణ లభించింద’ని చెబుతున్నారు హైమవతి. ఇక్కడికి ఎక్కువగా పిచ్చుకలు వస్తుంటాయి. చిన్ని కొంగలు, తోకపిట్టలు, ఏడాదికి ఒకసారి వచ్చి వెళ్లే వడ్రంగి పిట్టలు, మైనాలు, బుల్లిపిట్టలు, కాకులు, గువ్వలు ఈ ఇంట్లో సందడి చేస్తాయి.   

వేసవి తాపం నుంచి రక్షణ..  
నిప్పులు చెరుగుతున్న ఎండల తాకిడికి పక్షులు విలవిల్లాడుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం తపిస్తున్నాయి. కొద్దిగా నీడ కోసం పరుగులు పెడుతున్నాయి. ఆహారం, నీళ్లు లభించక ఎన్నో పక్షులు  విగతజీవులవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో  ఇంటి చుట్టూ  22 గూళ్లను, నీటి తొట్టీలను ఏర్పాటు చేసి  పక్షుల సంరక్షణ కోసం  ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు హైమవతి. పక్షుల కోసం కిలోల కొద్దీ  నూకలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు సిద్ధంగా ఉంచుతారు. ప్రతి నిత్యం వచ్చి వెళ్లే పక్షులతో ఆ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. 

ఇంటి ఆవరణలోని గూటి వద్ద పిచ్చుక
అమ్మ స్ఫూర్తితో..  
తల్లి హైమవతి స్ఫూర్తితో  ఆమె కూతురు డాక్టర్‌ శశికళ సైతం కొంపల్లిలోని తమ ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా పక్షుల కోసం బాక్సులను ఏర్పాటు చేశారు. ‘వడ్రంగి పిట్టలు, మేఘదూత్‌ వంటి పక్షులు చాలా తరచూ వస్తుంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పక్షులు ఆకస్మాత్తుగా గూళ్లలోకి వచ్చినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి’ అని ఆనందం వ్యక్తం చేశారామె. పక్షులు, పర్యావరణాన్ని సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని, అప్పుడే జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలమని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement