venkateswar rao
-
పది నిమిషాల ఆలస్యంతో ఫ్లైట్ మిస్ అయి..
గంగాధర: జీవనోపాధి కోసం అఫ్గానిస్తాన్‌లో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన పెంచాల వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకన్న విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఆ దేశంలో చిక్కుకుపోయాడు. అఫ్గానిస్తాన్ దేశంలోని కసబ్‌లో ఏసీసీఎల్ కంపెనీలో వెంకటేశ్వరరావు తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆరు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చివెళ్లేవాడు. ఈ నెల 15న స్వదేశానికి రావడానికి విమాన టికెట్ కూడా తీసుకున్నాడు. అయితే పది నిమిషాలు ఆలస్యం కావడంతో విమానం వెళ్లిపోయింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాను అమెరికా సైనికుల వద్దనే ఉన్నానని.. త్వరలోనే వస్తానని ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు అతని కుటుంబసభ్యులు చెప్పారు. -
లోకేష్‌కు ఫోన్ చేస్తే వాట్సాప్ చేయమంటారు
జూబ్లీహిల్స్: మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసినా ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర్రావు ఆరోపించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆయన బైఠాయించి తన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ... చంద్రబాబుకి సింగిల్ గన్‌మెన్ ఉన్నప్పటి నుంచి ఆయనతో తిరిగానని అయినా తనను పట్టించుకోవడం లేదన్నారు. ఆరు నెలలుగా ప్రయత్నిస్తుంటే కలవడానికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. పార్టీకి పని చేసి తాను సర్వస్వం కోల్పోయానని వాపోయారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయానని గుర్తుచేశారు. (బాబు ఇంటి ముందు టీడీపీ నేత ఆందోళన) చంద్రబాబు నివాసం వద్ద బైఠాయించిన ఆకుల వెంకటేశ్వర్రావు కార్పొరేటర్‌గా ఓడిపోయిన తర్వాత వైజాగ్‌కు వెళ్లిపోయానని అప్పటి నుంచి కూడా టీడీపీతోనే ఉన్నానని కానీ ఇప్పుడు తనకు కష్టమొచ్చిందంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబును కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని లోకేష్‌బాబుకు ఫోన్ చేస్తే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టమంటాడని, వాట్సాప్‌లో మెసేజ్ పెడితే తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ రాజగోపాల్ తనను చంద్రబాబును కలవనివ్వడం లేదని ఆరోపించారు. నెల రోజులుగా అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవాళ రమ్మన్నారని... ప్రస్తుతం మూడు నెలల తర్వాత రావాలంటూ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. -
గుండె గూటిలో నిండు ప్రేమ!
వేకువజామునే పిట్టలకిలకిలారావాలు. కోకిలమ్మల కుహుకుహూ గానాలు. ఊర పిచ్చుకల కిచకిచలు ఆ ఇంట్లో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తాయి. అతిథి గృహాల్లాంటి గూళ్లలో ఒదిగిపోతాయి.ఆ ఇంటి ఆతిథ్యాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాయి. వివిధ రకాల పక్షులు కాలానుగుణంగా ఆ ఇంటికి వచ్చి వెళ్తాయి. హస్మత్‌పేట్ అబ్రార్‌నగర్‌లో నివాసం ఉండే వెంకటేశ్వరరావు, హైమవతి దంపతులు తమ ఇంటి ఆవరణలో పక్షుల కోసం 22 గూళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో గింజలు, నీరు నిరంతరం అందుబాటులో ఉంచుతారు. ఏ పక్షి ఎప్పుడైనా రావచ్చు. కావాల్సినన్ని గింజలుతిని వెళ్లవచ్చు. ఇలా రకరకాల పక్షుల రాకతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. 20 ఏళ్లుగా పక్షుల సంరక్షణే లక్ష్యంగా ఆ దంపతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తమ ఇంటిని బుల్లి పిట్టలకు నిలయంగా మార్చారు. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం. ’మాది వరంగల్. మావారు వెంకటేశ్వరరావు విశ్రాంత ఉద్యోగి. మా చిన్న కూతురు షర్మిలతో కలిసి ఇక్కడ ఉంటున్నాం. అప్పట్లో ఆకాశంలోకి చూస్తే రకరకాల పక్షుల గుంపులు కనిపించేవి. కొన్ని ఒంటరిగా వెళ్లేవి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. చెట్ల కొమ్మలపై వాలి సందడి చేసేవి. ఇప్పుడు ఆ పక్షుల గుంపులు అరుదైన దృశ్యాలే. ఆవులు, కోళ్లు, మేకలు, కాకులు, పిచ్చుకలు, కోయిలలతో కూడిన సహజమైన వాతావరణంలో పుట్టి పెరిగిన మేము ముప్పై ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడ్డాం. హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్దీ పక్షుల జాడ కనిపించకుండా పోతోంది. వాటిని కాపాడుకొనేందుకు ఒక సహజమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనిపించింది. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన మా ప్రయత్నానికి క్రమంగా ఆదరణ లభించింద’ని చెబుతున్నారు హైమవతి. ఇక్కడికి ఎక్కువగా పిచ్చుకలు వస్తుంటాయి. చిన్ని కొంగలు, తోకపిట్టలు, ఏడాదికి ఒకసారి వచ్చి వెళ్లే వడ్రంగి పిట్టలు, మైనాలు, బుల్లిపిట్టలు, కాకులు, గువ్వలు ఈ ఇంట్లో సందడి చేస్తాయి. వేసవి తాపం నుంచి రక్షణ.. నిప్పులు చెరుగుతున్న ఎండల తాకిడికి పక్షులు విలవిల్లాడుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం తపిస్తున్నాయి. కొద్దిగా నీడ కోసం పరుగులు పెడుతున్నాయి. ఆహారం, నీళ్లు లభించక ఎన్నో పక్షులు విగతజీవులవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటి చుట్టూ 22 గూళ్లను, నీటి తొట్టీలను ఏర్పాటు చేసి పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు హైమవతి. పక్షుల కోసం కిలోల కొద్దీ నూకలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు సిద్ధంగా ఉంచుతారు. ప్రతి నిత్యం వచ్చి వెళ్లే పక్షులతో ఆ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ఆవరణలోని గూటి వద్ద పిచ్చుక అమ్మ స్ఫూర్తితో.. తల్లి హైమవతి స్ఫూర్తితో ఆమె కూతురు డాక్టర్ శశికళ సైతం కొంపల్లిలోని తమ ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా పక్షుల కోసం బాక్సులను ఏర్పాటు చేశారు. ‘వడ్రంగి పిట్టలు, మేఘదూత్ వంటి పక్షులు చాలా తరచూ వస్తుంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పక్షులు ఆకస్మాత్తుగా గూళ్లలోకి వచ్చినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి’ అని ఆనందం వ్యక్తం చేశారామె. పక్షులు, పర్యావరణాన్ని సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని, అప్పుడే జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలమని చెప్పారు. -
అవినీతి పోవాలి.. మార్పు రావాలి
సాక్షి, అమరావతి : ‘ఐవీ’గా ఉపాధ్యాయ, ఉద్యోగ లోకానికి సుపరిచితులైన ఇళ్ల వెంకటేశ్వరరావు సాధారణ బడి పంతులు. యూటీఎఫ్ అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. సచివాలయానికి సైతం ఆయన మోటర్ సైకిల్ మీదే వచ్చేవారు. యూటీఎఫ్ అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తయిన వెంటనే.. మళ్లీ స్కూల్లో టీచర్‌గా చేరారు. తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి మండలం సిరిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై వెంకటేశ్వరరావు విశ్లేషణ ఆయన మాటల్లోనే.. అవినీతి రాజకీయాలు అంతం కావాలి ఎన్నికల సంస్కరణల వల్ల మార్పు వస్తుందనుకోవడం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంపాదించిన అవినీతి సొమ్ము వెదజల్లి ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నించడమే అసలు సమస్య. ఓటర్లు తమకు సొమ్ము కావాలని కోరుకోవడం లేదు. ఇస్తే వద్దనడం లేదు. అధికారం కావాలనే తాపత్రయంతో రాజకీయ పార్టీలే ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నాయి. రాజకీయ పార్టీలు నడుం బిగించి.. డబ్బులు నియంత్రిస్తే తప్ప ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గదు. ప్రభుత్వంలోనే కార్పొరేట్ శక్తులున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి. కానీ ప్రభుత్వంలోనే కార్పోరేట్ శక్తులు భాగమై ఉన్నప్పుడు.. నియంత్రణ ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా ఉన్నారు. మరికొంత మంది కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు పలు పదవుల్లో ఉన్నారు. ప్రభుత్వంలో నేరుగా భాగం కాకపోయినా, కార్పోరేట్ విద్యాసంస్థల యజమానులు పరోక్షంగా ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతున్నారు. ఇక నియంత్రించేది ఎవరు? అధికారుల స్థాయిలో నియంత్రణ సాధ్యం కాదు. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో అధికారులు ఫీజుల నియంత్రణ గురించి హడావుడి చేస్తారు. తర్వాత పట్టించుకోరు. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. వాళ్లు వెలగబెడుతుందేమీ లేదు వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లేమీ గొప్పగా లేవు. వాళ్లు వెలగబెడుతుందేమీ లేదు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం పెట్టారు. కార్పొరేట్ వ్యవస్థను బద్దలు కొట్టాలంటే.. ప్రభుత్వ స్కూళ్లలోనూ మంచి విద్య అందుబాటులో ఉండే విధంగా విద్యావ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలి. ప్రైవేటు రంగంలో చిన్నపాటి విద్యాసంస్థల యాజమాన్యాలూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. లంచాల రూపంలో అధికారులు వసూళ్లు చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు భరించలేకపోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి. సిబ్బంది జీతాల గురించి మాట్లాడేవారు లేరు. కనీస వేతన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం ఉంటే కనీస వేతనాలు ఇస్తారని కాదు... చట్టం అంటూ ఉంటే అడగడానికి అవకాశమైనా ఉంటుంది. విద్యాహక్కు చట్టం వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యాహక్కు చట్టం తెచ్చినా ప్రభుత్వ విద్యారంగంలో పెద్దగా మార్పు రాలేదు. బడ్జెట్లో విద్యకు కేటాయింపులు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్య అందుబాటులో ఉందనే నమ్మకం ప్రజల్లో పెరగాలి. ఆ నమ్మకం కలిగితేనే.. సర్కారీ స్కూళ్లు బాగుపడినట్టు లెక్క. ప్రైవేటు స్కూళ్లను మింగేస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లు మింగేశాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. తర్వాత కార్పొరేట్ స్కూళ్లు వచ్చాయి. నగరాల్లో ప్రైవేటు స్కూళ్లను మింగేశాయి. తర్వాత చిన్న పట్టణాలకూ విస్తరించి అక్కడి చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లను మింగేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లే విద్యా వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకున్నాయి. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వెంకటేశ్వరరావు
-
‘మీ సేవ’ నుంచి డబ్బులు!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని మీసేవ రాష్ట్ర కమిషనర్ జీటీ వెంకటేశ్వర్రావు తెలిపారు. జూలై 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో కొత్తగా మనీ విత్‌డ్రా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ బేస్డ్ పెమెంట్ సిస్టమ్ ద్వారా విత్‌డ్రా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4,500 మీసేవ కేంద్రాలు ఉన్నాయని.. బ్యాంకు ఏటీఎంలు అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఈ తరహా విధానం అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశముందని.. త్వరలోనే రోజుకు రూ.10 వేలు విత్‌డ్రాకు పెంచుతామని తెలిపారు. ఇందుకు కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమన్నారు. 30వ తేదీన నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 60 మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం ప్రారంభించనున్నట్లు వివరించారు. నెల తర్వాత రాష్ట్రంలోని మిగతా మీసేవ కేంద్రాల్లో క్యాష్ విత్‌డ్రా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. -
వెంకటేశా.. కుర్చీ వీడవేమయ్యా..?
జీవీఎంసీలో ఒక కీలక ఉన్నతాధికారిని బదిలీ చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి.. ఆయన స్థానంలో వేరే అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆయన వచ్చి జాయినింగ్ ఆర్డర్‌ను ఇన్చార్జి కమిషనర్‌కు సమర్పించారు కూడా..కానీ బాధ్యతలు స్వీకరించడానికి కూర్చీయే ఖాళీగా లేదు.. ఎందుకంటే.. ఇప్పటివరకు ఆ కుర్చీలో ఉన్న అధికారి దాన్ని ఖాళీ చేయకపోవడమే.. అసలు ఖాళీ చేయడం ఆయనకు ఇష్టం లేదు..కుర్చీ ఖాళీ చేయడానికి ఇష్టపడని ఆ అధికారి జీవీఎంసీ ప్రాజెక్ట్స్ ఎస్ఈ వెంకటేశ్వరరావు.. ఇప్పుడే కాదు.. గత మే 14న.. అంతకుముందు మరో రెండుసార్లు కూడా బదిలీ ఉత్తర్వులు వచ్చినా.. ప్రజాప్రతినిధులతో రాయ‘బేరాలు’ నడిపించి వాటిని బుట్టదాఖలు చేయించిన ఘనుడు ఈ ఎస్ఈ.. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు..తొమ్మిదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసి.. ఎస్ఈ స్థాయికి ఎదిగి.. వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో చక్రం తిప్పుతున్న ఈయనగారు కుర్చీని వీడటానికి ఇష్టపడకపోవడంలోని పరమార్థం ఏమిటో?!.. దానికి ఈయన చెబుతున్న సాకు మాత్రం.. తను వెళ్లిపోతే స్మార్‌సిటీ పనులు నిలిచిపోతాయట! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహావిశాఖ నగరపాలక సంస్థ. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వేలాదిమంది పని చేస్తున్న కార్పొరేషనూ ఇదే. ఏటా రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అనకాపల్లి, భీమిలి సహా ఎనిమిది జోన్లుగా విస్తరించి.. స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత నిధుల మంజూరు, ఖర్చు మరింత పెరిగింది. బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన చందంగా వందల కోట్ల పనులు జరుగుతున్న జీవీఎంసీ నుంచి వేరే కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లాలన్నా, పనిచేస్తున్న జోన్ నుంచి వేరే జోన్‌కు వెళ్లాలన్నా అధికారులు ఇష్టపడటం లేదు. ఫలితంగా వీరున్న చోట అవకతవకలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా కార్పొరేషన్లో ఒక చోట మూడు నుంచి మూడున్నరేళ్లు మాత్రమే పనిచేయాలి. కానీ ప్రాజెక్టŠస్ ఎస్ఈ వెంకటేశ్వరరావు తొమ్మిదేళ్లుగా ఇంజినీరింగ్ విభాగంలోనే పనిచేస్తూ.. పదోన్నతులు పొందుతూ చివరికి సర్కారు ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు. ఈఈగా జీవీఎంసీలో అడుగు కాకినాడలో మున్సిపల్ ఇంజినీర్‌గా పనిచేసిన అనంతరం జీవీఎంసీలో ఈఈగా ప్రస్థానం మొదలెట్టిన వెంకటేశ్వరరావు తొమ్మిదేళ్లలో పలు పదోన్నతులతో ఇక్కడే ఎస్ఈ (ప్రాజెక్టŠస్) స్థాయికి ఎదిగారు. మధ్యలో పలుమార్లు బదిలీ అయినా.. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలనూ, పలుకుబడిని ఆయుధాలుగా ప్రయోగించి బదిలీని ఆపించుకునేవారు. అలా పాతుకుపోయిన ఆయన గత నాలుగున్నరేళ్లుగా ప్రాజెక్టŠస్ ఎస్‌ఈగానే కొనసాగుతుండటం గమనార్హం. తొమ్మిదేళ్లలో తాజా ట్రాన్స్ఫర్లతో కలిపి నాలుగుసార్లు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. అయితే.. అప్పటి ఈఎన్సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్) చంద్రశేఖర్ కొమ్ముకాయడంతో రెండుసార్లు బదిలీ నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యే గణబాబు అండదండలతో తాజా బదిలీని ఆపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కేసు కాగా వెంకటేశ్వరరావుపై తప్పుడు సమాచారం అందించారనే కేసు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైంది. తన సర్వీస్ రిజిస్టర్లో డేట్ ఆఫ్ బర్త్ తక్కువ చూపించారని కేసు నమోదు చేశారు. అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ప్రమోషన్లు ఇవ్వకూడదు. కానీ వెంకటేశ్వరరావు పదోన్నతులు సైతం పొందడం గమనార్హం. ఇంకా ఎన్నేళ్లు చేస్తావయ్యా..? ఈ నెల 20న స్మార్ట్‌సిటీ పనులపై పురపాలక శాఖ మంత్రి నారాయణ జీవీఎంసీలో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల పురోగతి లోపభూయిష్టంగా ఉందంటూ ఎస్ఈ వెంకటేశ్వరరావుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ.511 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం రూ.113 కోట్ల పనులే ఎందుకు జరిగాయి.. నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ఓవైపు.. తాను లేకపోతే.. ప్రాజెక్టులు ఆగిపోతాయన్నట్లుగా ఉన్నతాధికారులకు నివేదికలు చూపించి బదిలీ నిలిపివేయించుకుంటున్న ఎస్ఈ పనితీరు.. సమీక్షలో తేటతెల్లమైంది. సమావేశం అనంతరం.. మంత్రి నారాయణతో బదిలీ అంశంపై ఎస్ఈ మాట్లాడగా.. తొమ్మిదేళ్లుగా జీవీఎంసీలో చేస్తున్నావ్ కదా.. ఇంకా ఎన్నేళ్లు చేస్తావయ్యా అని మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ పనులు ఆగిపోతాయంట..? ప్రస్తుతం నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో రూ.1542 కోట్ల పనులతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు రూ.350 కోట్లు, అమృత్ పథకం కింద రూ.250 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ప్రాజెక్టు కింద రూ.750 కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటికి డీపీఆర్‌ల తయారీ నుంచి డిజైన్లు, డ్రాఫ్ట్సు రూపొందించడం, టెండర్లు.. తదితర అన్ని పనులూ వెంకటేశ్వరరావు చేతుల మీదుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది మే 14న అనంతపురం ఎస్ఈగా అతన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాను వెళ్లిపోతే స్మార్ట్ సిటీ పనులు ఆగిపోతాయని స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుని బదిలీ ఆపించుకున్నారు. తాజాగా ఈ నెల 16న వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో మరియన్నను నియమిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరియన్న వచ్చి జాయినింగ్ ఆర్డర్ కాపీని జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ బసంత్‌కుమార్‌కు ఇప్పటికే అందించారు. అయినా వెంకటేశ్వరరావు మాత్రం కుర్చీ వదలడం లేదు. రిలీవ్ కావడం లేదు. అనంతపురం వెళ్లాల్సిందే రెండు నెలల క్రితం ఎస్ఈ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ జీవో జారీ చేసిన మాట వాస్తవమే. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని అమలు చేయలేకపోయాం. ఈసారి మాత్రం జీవీఎంసీలో రిలీవ్ అయ్యి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈగా వెళ్లాల్సిందే. కమిషనర్ హరినారాయణన్ సెలవు నుంచి రాగానే ఎస్ఈని రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తాను. – కరికల వలవన్,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి -
సీనియర్ పాత్రికేయుడు ఆదిరాజు కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ పోరాట యోధుడు, సీనియర్ పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వర్రావు(78) ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలోని స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 60 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. ఆంధ్రభూమి, గోల కొండ, ఆంధ్రజ్యోతి, ఉదయం, దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర దినపత్రికల్లో హైదరాబాద్, ఢిల్లీలో వివిధ హోదాల్లో పని చేశారు. జనతా, రాజధాని పత్రికలను నడిపారు. ఇటీవల రాష్ట్ర అవతరణ వేడుకల్లో కేసీఆర్ నుంచి ఆదిరాజు ఉత్తమ పాత్రికేయునిగా అవార్డు అందుకున్నారు. ఆదిరాజు భౌతిక కాయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సాక్షి దినపత్రిక ఈడీ రామచంద్రమూర్తి, పలువురు రాజకీయనేతలు, పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు. షేక్‌పేట్ మహాప్రస్థానంలో ఆదిరాజు వెంకటేశ్వర్రావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదిరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆదిరాజు ఎంతగానో కృషి చేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. -
నాన్న లేడు...
అమ్మ–నాన్న..ఈ సృష్టికి మూలం వీరిద్దరే..!వీరిద్దరూ లేకపోతే..మనమెవరమూ లేము.కన్నీళ్లు.. కష్టాలు దిగమింగి..బిడ్డల కోసమే జీవితాన్ని ధారపోసి..అంత్య దశకు చేరిన ఆ ఇద్దరూ..ఇప్పడు మనకు ‘బిడ్డలు’..‘చంటి పిల్లల్లాంటి’ వాళ్లు..!!పిల్లలు.. ‘దేవుళ్ల’తో సమానం..‘పిల్లల్లా’ మారిన వీరిద్దరూ..నిజంగానే మనకు దేవుళ్లు..!!!ఆ ‘దేవుడి’ని ఊరవతలకువిసిరేశాడు.. ఆకలిదప్పులతోప్రాణం పోయేలా చేశాడు.. మధిర: అతడి పేరు యలమందల వెంకటేశ్వరరావు(70). మధిర పట్టణంలోని ముస్లిం కాలనీలో నివాసముంటున్న యలమందల లక్ష్మీనారాయణను కని పెంచిన తండ్రి. ♦ వెంకటేశ్వరరావుకు ఈ కొడుకుతోపాటు కూతురు విజయలక్ష్మి కూడా ఉంది. వీరిద్దరూ వివాహితులే. కోడలి పేరు సుధారాణి. అల్లుడి పేరు లంకెమళ్ల శ్రీనివాసరావు. ♦ కొడుకు–కోడలు (లక్ష్మీనారాయణ–సుధారాణి), మధిర పట్టణంలోని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కూతురు–అల్లుడు (విజయలక్ష్మి–శ్రీనివాసరావు), బిడుగుపాడు గ్రామంలో ఉంటున్నారు. ♦ వృద్ధుడైన వెంకటేశ్వరరావు, సుమారు ఏడేళ్ల నుంచి తన కుమార్తె–అల్లుడి వద్దనే ఉంటున్నాడు. ♦ ఇతడు ఇటీవల తీవ్రంగా అస్వస్థుడయ్యా డు. కూతురు–అల్లుడి ఇంటి పక్కన ఉంటున్న కుటుంబంలో కొద్ది రోజుల్లో శుభకార్యం జరగాల్సుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వరరావుకు ఏదైనా జరిగితే...? శుభకార్యం ఆగిపోతుందేమో..! ఆ పక్కనున్న కుటుంబం లోని వచ్చిన సందేహమిది. వారు తమ సందేహాన్ని, భయాన్ని విజయలక్ష్మి చెవిన పడేశారు. ♦ విజయలక్ష్మికి కూడా ‘అవును కదా..’ అనిపించింది. ‘‘ఆ ఇంట శుభకార్యం పూర్తయ్యేంత వరకు మా నాన్నను నా సోదరుడి ఇంటికి పంపించు. ఆ తరువాత తీసుకొద్దాం’’ అని, భర్త శ్రీనివాసరావుతో చెప్పింది. ఆమె భర్త సరేనన్నాడు. ♦ ఆదివారం ఉదయం. తన మామను వెంటబెట్టుకుని బావమరిది లక్ష్మీనారాయణ ఇంటికి శ్రీనివాసరావు వెళ్లాడు. విషయమంతా వివరించి చెప్పాడు. వెంకటేశ్వరరావును అక్కడ అప్పగించి తిరుగు ప్రయాణమవుతున్నాడు. ♦ ఇంతలోనే... ‘‘ఇన్నేళ్లపాటు ఉంచుకున్నావు. అనారోగ్యంతో బాధపడుతున్న ‘ముసలోడిని’ నా దగ్గర వదిలేసి వెళ్తావా..?’’ అంటూ, బావ శ్రీనివాసరావును లక్ష్మీనారాయణ దూషిం చాడట. ♦ అదే రోజు (ఆదివారం) సాయంత్రం, తాను నివసిస్తున్న ముస్లిం కాలనీ సమీపంలోగల తన సొంత ఖాళీ స్థలంలోగల చెట్టు కిందకు తండ్రి వెంకటేశ్వరరావును కొడుకు లక్ష్మీనారాయణ తీసుకెళ్లాడు. అక్కడే వదిలేసి వచ్చాడు. ♦ తింటానికి తిండి లేదు. తాగేందుకు నీళ్లు లేవు. లేచేందుకు శక్తి లేదు. ఆ రోజంతా ఆ వృద్ధుడు అక్కడే ఒంటరిగా పడుకున్నాడు. ♦ దీనిపై ‘అయ్యో నాన్న..’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఇది కలెక్టర్ లోకేష్‌కుమార్ దృష్టికి వెళ్లింది. ఆయన తీవ్రంగా స్పందించారు. మధిర తహసీల్దార్ మంగీలాల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ మంగీలాల్, టౌన్ ఎస్సై బెంద్రం తిరుపతిరెడ్డి కలిసి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లారు. ♦ ప్చ్.. ఆ వృద్ధుడు ‘లేడు’.. సజీవంగా లేడు..! తీవ్ర అనారోగ్యం.. మండుటెండ.. కలిదప్పులు.. వడదెబ్బతో ప్రాణాలొదిలాడు. ఆకలిదప్పులు తీర్చి ఆదుకుందామని అధికారులు వెళ్లేసరికి.. విగతుడిగా కనిపించాడు. ♦ కన్న తండ్రన్న కనికరం కూడా లేకుండా ఆ వృద్ధుడిని చెట్టు కింద వదిలేసి, ప్రాణాలు పోవడానికి కారణమైన కొడుకు లక్ష్మీనారాయణపై, కోడలు సుధారాణిపై కేసును ఎస్సై నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. ♦ ‘అయ్యో పాపం’.. ఈ దీన గాథను తెలుసు కున్న పట్టణ వాసులంతా ఇలా అనుకోకుండా ఉండలేకపోయారు. ‘మానవత్వం మంటగలిసింది. అనుబంధం అపహాస్యంగా మారింది. ఆప్యాయతానురాగం అదృశ్యమైంది’... ఇలా, ప్రతి ఒక్కరి మది మూగగా రోదించింది. -
శిరీషది ముమ్మాటికీ హత్యే
- కుటుంబసభ్యుల ఆరోపణ - ఆమె శరీరంపై ఉన్న గాయాలే ఇందుకు సాక్ష్యం ఆచంట: బ్యూటీషియన్ ఆరుమల్లి విజయలక్ష్మి (శిరీష) మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఆత్మహ త్యకు పాల్పడిందని పోలీస్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో ఉంటు న్న ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం మీడి యా ముందుకు వచ్చారు. శిరీష తల్లి రామ లక్ష్మి మాట్లాడుతూ.. తన కుమార్తె మృతి కేసును పోలీసులు నీరు గారుస్తున్నారన్నారు. ‘నా కూతురు ఒకరికి భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది మాత్రం కాదు..’ అని రామలక్ష్మి అన్నారు. తేజస్వినిని ఎందుకు విచారించలేదు? స్టూడియో యజమాని రాజీవ్‌ను వివాహం చేసుకోవాల్సిన తేజస్వినిని ఇప్పటివరకు ఎం దుకు విచారించలేదని రామలక్ష్మి ప్రశ్నిం చారు. ప్లాస్టిక్ తాడును మెడకు బిగించినట్టు శిరీష మృతదేహంపై గుర్తులున్నాయన్నారు. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. ఆమె ఫ్యాన్‌కు ఉరివేసు కుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదని ప్రశ్నించారు. రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకా రమే శిరీషను స్టూడియోకు తీసుకెళ్లి మెడకు వైరు బిగించి చంపేసి ఆత్మహత్యగా చిత్రీ కరిస్తున్నారని రామలక్ష్మి ఆరోపించారు. కట్టు కథలు చెబుతున్నారు రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకారం శిరీషను చంపేశారు. ఆమె తలపై, చెంపలు, పెదవులమీ దున్న గాయాలే ఇందుకు సాక్ష్యం. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్క దారి పట్టిస్తున్నారు. వారి మాటలన్నీ కట్టుక థల్లా ఉన్నాయి. – శిరీష అత్త శారద, మామ వెంకటేశ్వర రావు -
ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్ ఇంటిపై సీబీఐ దాడులు
-
విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యాసమస్యలపై సమగ్ర చర్చ జరగాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఏపీటీఎఫ్(1938) జిల్లా విద్యా వైజ్ఞానిక సభలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 23 వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలకు జిల్లా నుంచి విద్యారంగ నిపుణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, నూతన విద్యావిధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సీపీఎస్, తదితర అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. డాక్టర్ సీవీ సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హదయరాజు, నాయకులు తిరుపతిరెడ్డి, శివరామిరెడ్డి, జుల్ఫీకర్ అలీ, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో ఆరోగ్య ర్యాలీ
గుంటూరు టౌన్: ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో ఆరోగ్య ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, డీఈవో శ్రీనివాసరెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగరంలో ర్యాలీ నిర్వహించారు. -
పోరుునోళ్లకు పింఛన్.. బతికున్నోళ్లకు టెన్షన్
తాడేపల్లిగూడెం : చుక్కా అచ్చయ్య చనిపోయి 24 నెలలు కావస్తోంది. ఇనుగంటి వెంకటేశ్వర్రావు పరమపదించి 13 నెలలు అవుతోంది. చిన్ని నూకాలమ్మ పెదకార్యం జరిగి ఎనిమిది నెలలైంది. అయినా వారందరికీ క్రమం తప్పకుండా పింఛన్ వస్తోంది. కట్టా సుబ్బారావు కుష్టు వ్యాధిబారిన పడటంతో అతడి పదివేళ్లు దెబ్బతిన్నాయి. ఆయనకు వృద్ధాప్య పింఛన్ ఉంది. కానీ.. పింఛను మొత్తం తీసుకోవడానికి ప్రతినెలా ఒక ప్రాంతానికి రిక్షాపై వెళ్లాలి. పింఛన్ సొమ్ములో కొంత మొత్తం రిక్షా వాలాకు ఇవ్వాలి. ఆ బాలుడు మూగ, చెవుడుతో బాధపడుతున్నాడు. చేతివేళ్లు ముడుచుకుపోయూరుు. వేలి ముద్రవేస్తే కాని ఆ బాలుడికి పింఛన్ ఇవ్వనంటారు. ‘ఆధార్ నంబర్ ఉందా.. వేలిముద్ర పడటం లేదు. మళ్లీ రా’ అంటున్నారు. అన్నీ బాగుంటే ‘బ్యాటరీ డౌనయ్యింది. రెండు రోజులు ఆగి రా’ అని పంపేస్తున్నారు. ఇలా పండుటాకుల జీవితాలతో పింఛన్ సొమ్ము పంపిణీ చేసే బాధ్యత చేపట్టిన ఏజెన్సీలు ఆటలాడుకుంటున్నారుు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఠంచనుగా పింఛన్ వచ్చేది. ఇప్పుడు టెన్షన్‌గా తయూరైంది. చనిపోయిన వారి పేర్లను అర్హుల జాబితాంచి తొలగించని అధికారులు, బతికున్న వారిని మాత్రం పదేపదే తిప్పించుకుంటూ వారి ఓపికను పిప్పి చేస్తున్నారు. చేయి ఉండి, దానికి వేళ్లుండి, వేలిముద్రలు మెషిన్లో పడకపోయినా ఆ పాపం వృద్ధులదే అన్నట్టుగా నెలల తరబడి పింఛన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే లబ్డిదారులు అనర్హుల జాబితాలో చేరతారు. తర్వాత పునరుద్ధరణ దేవుడికే ఎరుక. ఇది ఒకరిద్దరు వృద్దుల కష్టం కాదు. జిల్లాలో 70వేల మంది పింఛనుదారులు 90 రోజు లుగా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటున్నారు. పట్టించుకోని అధికారులు జిల్లాలో అన్నిరకాల పింఛన్లు తీసుకునే లబ్ధిదారులు 3.60 లక్షల మంది ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలలో మొదటి వారంలో వీరికి ఠంచన్‌గా పింఛన్ అందేది. కేవలం రెండు గంటల వ్యవధిలో నిర్దేశించిన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ చకచకా జరిగిపోయేది. జాబితా ఆధారంగా సొమ్ములు పంపిణీ చేశారు. ఆ తర్వాత స్మార్ట్ కార్డులు అన్నారు. వీటివల్ల కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తిం చి తపాలా శాఖ ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ప్రాంతాల వారీగా కొన్ని బ్యాంకులకు వీటి పంపిణీ బాధ్యతను అప్పగించారు. బ్యాంకులు మణిపాల్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించాయి. వీటి ఆధ్వర్యంలో పంపిణీ తంతు హైడ్రామాగా సాగుతోంది. విషయ పరిజ్ఞానం తక్కువగా ఉన్న సిబ్బంది వృద్ధులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి జేబులోని సొమ్ము ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలుగా పింఛన్ సరిగా అందక లబ్దిదారులు చాలాపాట్లు పడుతున్నారు. ఇచ్చే రెండొందల కోసం నెలలో పది రోజు లకు పైగా ఆయా ప్రాంతాల వద్ద పడిగాపులు పడుతున్నారు. పంపిణీ వ్యవహారం అంతా దైవాధీనం సర్వీసులా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పెంచుతారా.. ముంచుతారా అక్టోబర్ నుంచి పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. అరుుతే, దీనికి ముందుగానే లబ్ధిదారుల సంఖ్యను కుదించాలంటూ అధికారులకు ఆదేశాలు అందారుు. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా వేలి ముద్రలు పడటం లేదు, ఆధార్ నంబర్ లేదని, బ్యాటరీ డౌన్ అరుు్యందని, సాంకేతిక సమస్య వచ్చిందంటూ లబ్ధిదారులను మూడు నెలలుగా తిప్పించుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఇలా మూడు నెలలు తిప్పించుకున్నాక పింఛన్ రద్దరుు్యందని చెప్పి చేతులు దులుపేసుకునే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
చుక్కల మందుకు అంతా సిద్ధం
నేటి నుంచి రెండో విడత పల్స్‌పోలియో మూడు రోజుల పాటు.. 3,31,580 మంది చిన్నారులకు చుక్కలు వేయడం లక్ష్యం జేసీ వెంకటేశ్వర్రావు వెల్లడి నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. శనివా రం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. మూడు రోజుల పాటు వైద్య సిబ్బంది పోలియో చుక్కలను వే స్తారని తెలిపారు. 3,31,580 మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందును వేయడం లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేసేందుకు పట్టణ ప్రాంతాల్లో 247 బూత్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో 1386 బూత్‌లు, ట్రాన్సిట్ బూత్‌లు 77, మొబైల్ బూత్‌లు 1760 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 171 మంది సూపర్వైజర్లు, 7380 మంది వైద్యసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పారు. వైద్యాధికారులు, సూపర్వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. వలస వచ్చిన కుటుంబాలు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో, మారుమూల తండాల్లో, మురికివాడల్లో నివసించే పిల్లలకు పోలియో చుక్కల మందు వేయనున్నట్లు జేసీ పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నగరంలో ర్యాలీ పల్స్‌పోలియో కార్యక్రమం పురస్కరించుకొని శనివారం ఉదయం నగరంలో ర్యాలీ నిర్వహిచారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోవింద్‌వాగ్‌మోరే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి విజయ్‌కుమార్, నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.