జీవీఎంసీలో ఒక కీలక ఉన్నతాధికారిని బదిలీ చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి.. ఆయన స్థానంలో వేరే అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆయన వచ్చి జాయినింగ్ ఆర్డర్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌కు సమర్పించారు కూడా..కానీ బాధ్యతలు స్వీకరించడానికి కూర్చీయే ఖాళీగా లేదు.. ఎందుకంటే.. ఇప్పటివరకు ఆ కుర్చీలో ఉన్న అధికారి దాన్ని ఖాళీ చేయకపోవడమే.. అసలు ఖాళీ చేయడం ఆయనకు ఇష్టం లేదు..కుర్చీ ఖాళీ చేయడానికి ఇష్టపడని ఆ అధికారి జీవీఎంసీ ప్రాజెక్ట్స్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు.. ఇప్పుడే కాదు.. గత మే 14న.. అంతకుముందు మరో రెండుసార్లు కూడా బదిలీ ఉత్తర్వులు వచ్చినా.. ప్రజాప్రతినిధులతో రాయ‘బేరాలు’ నడిపించి వాటిని బుట్టదాఖలు చేయించిన ఘనుడు ఈ ఎస్‌ఈ.. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు..తొమ్మిదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసి.. ఎస్‌ఈ స్థాయికి ఎదిగి.. వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో చక్రం తిప్పుతున్న ఈయనగారు కుర్చీని వీడటానికి ఇష్టపడకపోవడంలోని పరమార్థం ఏమిటో?!.. దానికి ఈయన చెబుతున్న సాకు మాత్రం.. తను వెళ్లిపోతే స్మార్‌సిటీ పనులు నిలిచిపోతాయట!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహావిశాఖ నగరపాలక సంస్థ. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వేలాదిమంది పని చేస్తున్న కార్పొరేషనూ ఇదే. ఏటా రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అనకాపల్లి, భీమిలి సహా ఎనిమిది జోన్లుగా విస్తరించి.. స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత నిధుల మంజూరు, ఖర్చు మరింత పెరిగింది. బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన చందంగా వందల కోట్ల పనులు జరుగుతున్న జీవీఎంసీ నుంచి వేరే కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లాలన్నా, పనిచేస్తున్న జోన్ నుంచి వేరే జోన్‌కు వెళ్లాలన్నా అధికారులు ఇష్టపడటం లేదు. ఫలితంగా వీరున్న చోట అవకతవకలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా కార్పొరేషన్‌లో ఒక చోట మూడు నుంచి మూడున్నరేళ్లు మాత్రమే పనిచేయాలి. కానీ ప్రాజెక్టŠస్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు తొమ్మిదేళ్లుగా ఇంజినీరింగ్ విభాగంలోనే పనిచేస్తూ.. పదోన్నతులు పొందుతూ చివరికి సర్కారు ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు.
ఈఈగా జీవీఎంసీలో అడుగు
కాకినాడలో మున్సిపల్ ఇంజినీర్‌గా పనిచేసిన అనంతరం జీవీఎంసీలో ఈఈగా ప్రస్థానం మొదలెట్టిన వెంకటేశ్వరరావు తొమ్మిదేళ్లలో పలు పదోన్నతులతో ఇక్కడే ఎస్‌ఈ (ప్రాజెక్టŠస్) స్థాయికి ఎదిగారు. మధ్యలో పలుమార్లు బదిలీ అయినా.. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలనూ, పలుకుబడిని ఆయుధాలుగా ప్రయోగించి బదిలీని ఆపించుకునేవారు. అలా పాతుకుపోయిన ఆయన గత నాలుగున్నరేళ్లుగా ప్రాజెక్టŠస్ ఎస్‌ఈగానే కొనసాగుతుండటం గమనార్హం. తొమ్మిదేళ్లలో తాజా ట్రాన్స్‌ఫర్లతో కలిపి నాలుగుసార్లు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. అయితే.. అప్పటి ఈఎన్‌సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్) చంద్రశేఖర్ కొమ్ముకాయడంతో రెండుసార్లు బదిలీ నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యే గణబాబు అండదండలతో తాజా బదిలీని ఆపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కేసు
కాగా వెంకటేశ్వరరావుపై తప్పుడు సమాచారం అందించారనే కేసు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైంది. తన సర్వీస్ రిజిస్టర్‌లో డేట్ ఆఫ్ బర్త్ తక్కువ చూపించారని కేసు నమోదు చేశారు. అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ప్రమోషన్లు ఇవ్వకూడదు. కానీ వెంకటేశ్వరరావు పదోన్నతులు సైతం పొందడం గమనార్హం.
ఇంకా ఎన్నేళ్లు చేస్తావయ్యా..?
ఈ నెల 20న స్మార్ట్‌సిటీ పనులపై పురపాలక శాఖ మంత్రి నారాయణ జీవీఎంసీలో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల పురోగతి లోపభూయిష్టంగా ఉందంటూ ఎస్‌ఈ వెంకటేశ్వరరావుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ.511 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం రూ.113 కోట్ల పనులే ఎందుకు జరిగాయి.. నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ఓవైపు.. తాను లేకపోతే.. ప్రాజెక్టులు ఆగిపోతాయన్నట్లుగా ఉన్నతాధికారులకు నివేదికలు చూపించి బదిలీ నిలిపివేయించుకుంటున్న ఎస్‌ఈ పనితీరు.. సమీక్షలో తేటతెల్లమైంది. సమావేశం అనంతరం.. మంత్రి నారాయణతో బదిలీ అంశంపై ఎస్‌ఈ మాట్లాడగా.. తొమ్మిదేళ్లుగా జీవీఎంసీలో చేస్తున్నావ్ కదా.. ఇంకా ఎన్నేళ్లు చేస్తావయ్యా అని మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.
స్మార్ట్ పనులు ఆగిపోతాయంట..?
ప్రస్తుతం నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో రూ.1542 కోట్ల పనులతో పాటు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులు రూ.350 కోట్లు, అమృత్ పథకం కింద రూ.250 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ప్రాజెక్టు కింద రూ.750 కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటికి డీపీఆర్‌ల తయారీ నుంచి డిజైన్లు, డ్రాఫ్ట్సు రూపొందించడం, టెండర్లు.. తదితర అన్ని పనులూ వెంకటేశ్వరరావు చేతుల మీదుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది మే 14న అనంతపురం ఎస్‌ఈగా అతన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాను వెళ్లిపోతే స్మార్ట్ సిటీ పనులు ఆగిపోతాయని స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుని బదిలీ ఆపించుకున్నారు. తాజాగా ఈ నెల 16న వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో మరియన్నను నియమిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరియన్న వచ్చి జాయినింగ్ ఆర్డర్ కాపీని జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ బసంత్‌కుమార్‌కు ఇప్పటికే అందించారు. అయినా వెంకటేశ్వరరావు మాత్రం కుర్చీ వదలడం లేదు. రిలీవ్ కావడం లేదు.
అనంతపురం వెళ్లాల్సిందే
రెండు నెలల క్రితం ఎస్‌ఈ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ జీవో జారీ చేసిన మాట వాస్తవమే. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని అమలు చేయలేకపోయాం. ఈసారి మాత్రం జీవీఎంసీలో రిలీవ్ అయ్యి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈగా వెళ్లాల్సిందే. కమిషనర్ హరినారాయణన్ సెలవు నుంచి రాగానే ఎస్‌ఈని రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తాను.
– కరికల వలవన్,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment