సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని మీసేవ రాష్ట్ర కమిషనర్ జీటీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. జూలై 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో కొత్తగా మనీ విత్‌డ్రా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ బేస్‌డ్ పెమెంట్ సిస్టమ్ ద్వారా విత్‌డ్రా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4,500 మీసేవ కేంద్రాలు ఉన్నాయని.. బ్యాంకు ఏటీఎంలు అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఈ తరహా విధానం అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశముందని.. త్వరలోనే రోజుకు రూ.10 వేలు విత్‌డ్రాకు పెంచుతామని తెలిపారు. ఇందుకు కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమన్నారు. 30వ తేదీన నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 60 మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం ప్రారంభించనున్నట్లు వివరించారు. నెల తర్వాత రాష్ట్రంలోని మిగతా మీసేవ కేంద్రాల్లో క్యాష్ విత్‌డ్రా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment