Me seva
-
ప్రకాశం: ఓటర్ లిస్టుంది సరే.. మరి మీ పేరుందా?
♦ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. ♦ 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ♦ www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ♦ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. ♦ మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ♦ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ♦ సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ► మీ మీ మండలాల తహసీల్దార్ కార్యాలయంలో ఉండే కింది నంబర్లకు చెందిన అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. కనిగిరి - నాసిరుద్దిన్, ఎలక్షన్ డీటీ - 97049 98500 కనిగిరి - కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ - 88866 16059 పామూరు - ఆర్.వాసుదేవరావు, డిప్యూటీ తహసీల్దార్ - 88866 16069 వెలిగండ్ల - టి.కోటేశ్వరరావు, తహసీల్దార్ - 88866 16082 పీసీపల్లి - సత్యనారాయణ ప్రసాద్, తహసీల్దార్ - 88866 16068 సీఎస్‌పురం - జి.శ్రీనివాసులు, తహసీల్దార్ - 88866 16049 హెచ్‌ఎంపాడు - ఎస్.రామలింగేశ్వరరావు,తహసీల్దార్ - 88866 16056 - ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
‘మీ సేవ’ నుంచి డబ్బులు!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని మీసేవ రాష్ట్ర కమిషనర్ జీటీ వెంకటేశ్వర్రావు తెలిపారు. జూలై 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో కొత్తగా మనీ విత్‌డ్రా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ బేస్డ్ పెమెంట్ సిస్టమ్ ద్వారా విత్‌డ్రా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4,500 మీసేవ కేంద్రాలు ఉన్నాయని.. బ్యాంకు ఏటీఎంలు అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఈ తరహా విధానం అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశముందని.. త్వరలోనే రోజుకు రూ.10 వేలు విత్‌డ్రాకు పెంచుతామని తెలిపారు. ఇందుకు కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయబోమన్నారు. 30వ తేదీన నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 60 మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం ప్రారంభించనున్నట్లు వివరించారు. నెల తర్వాత రాష్ట్రంలోని మిగతా మీసేవ కేంద్రాల్లో క్యాష్ విత్‌డ్రా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. -
'డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు వెసులుబాటివ్వాలి'
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం (2017–18)లో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ ప్రహసనంగా మారడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం ధ్వజమెత్తింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను కేవలం మీ–సేవ, ఈ–సేవ ద్వారానే చేయాలనడం విద్యార్థులకు సమస్యగా మారిందని... కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. అలాగే ఈ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ తదితరాలకు రూ. 200 వరకు చెల్లించాల్సి వస్తోందని... ఈ దృష్ట్యా ప్రతి ఇంటర్నెట్ కేంద్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విశ్వనాథ్‌చారి డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. -
నిలిచిన ‘మీ సేవ’లు
జిల్లాలో కేంద్రాల మూసివేత సాంకేతిక సమస్యలే కారణం ఆందోళనలో వినియోగదారులు అడ్మిషన్లకు చివరి తేదీ కావడంతో విద్యార్థుల హైరానా.. జోగిపేట: సాంకేతిక కారణాలతో జిల్లాలో మీ సేవలు శనివారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాలలో టీఎస్ ఆన్లైన్ లాగిన్ కాకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచే మీ సేవ కేంద్రాల వద్ద వారంతా వేచి ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఓకే అవుతుందని నిర్వాహకులు చెప్పినా సాయంత్రం 5.30 వరకు కూడా ఓకే కాలేదు. వినియోగదారులు కేంద్రాల వద్దనే పడిగాపులుకాశారు. ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలలో అడ్మిషన్లు పొందేందుకు శనివారమే చివరి తేదీ కావడంతో విద్యార్థులు ఉదయమే మీ సేవ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ వారిలో ఆందోళన వ్యక్తం అయ్యింది. కొన్ని కేంద్రాలలో విద్యార్థులు నిర్వాహకులతో గొడవలకు దిగారు. పనిచేయకుంటే ఎందుకు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 280 కేంద్రాలలో సేవలు పనిచేయలేదు. రాష్ర్ట వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నట్లు టీఎస్ ఆన్లైన్ జిల్లా మేనేజర్ ప్రదీప్ తెలిపారు. డాటా బేస్ సమస్య కారణంగా పనిచేయలేకపోయాయన్నారు. సమస్యను తొలగించేందుకు ప్రయత్రాలు జరుగుతున్నాయన్నారు. అనుకోకుండా సాంకేతిక పరమైన సమస్య వచ్చిందని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. 5 ఏళ్లలో ఇంత పెద్ద సమస్య రాలేదని, సర్వర్ డౌన్ కారణంగా అడపాదడపా ఇబ్బందులు వచ్చినా మొత్తానికి సేవలు నిలిపివేసే సమస్య రాలేదని నిర్వాహకులు తెలిపారు. -
తెల్ల కాగితమే ధ్రువీకరణ పత్రం!
* మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నిండుకున్న ప్రభుత్వ లోగో సర్టిఫికెట్లు * ధ్రువీకరణ పత్రాల్ని తెల్లకాగితాలపై ప్రింట్ చేసి ఇస్తున్న వైనం * నిర్వాహకుల మొర ఆలకించని జిల్లా కార్యాలయ అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సులభంగా, వేగంగా అందించే పౌరసేవల ప్రక్రియ గాడి తప్పింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా రెవెన్యూ తదితర సేవలందించేందుకు ప్రభుత్వం మీ సేవ, ఈ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆన్లైన్ పద్ధతిలో సేవలందించడమే వీటి ప్రధాన లక్ష్యం. కానీ ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి తలకిందులైంది. ఆన్లైన్ పద్ధతిలో కోరిన ధ్రువీకరణ వస్తున్నప్పటికీ.. అవన్నీ కంప్యూటర్ వరకే పరిమితమవుతున్నాయి. వాటిని ప్రభు త్వ ధ్రువీకరణతో ఇవ్వడం ఆయా కేంద్రాల నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ లోగోతో ముద్రించిన ధ్రువీకరణ పత్రాలు మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో 526 ఆన్లైన్ కేంద్రాలున్నాయి. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 165 కేంద్రాలుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 139 ఆన్లైన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇవికాకుండా 222 ఈసేవ కేంద్రాల ద్వారా పౌరసేవలు ప్రజలకు అందుతున్నాయి. ప్రధానంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పహాణీలు, ఈసీ తదితర ధ్రువీకరణ పత్రాలన్నీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల ద్వారా పొందుతున్నారు. కానీ వారం రోజులుగా జిల్లాలోని పలు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో తెలంగాణ లోగోతో ఉన్న సర్టిఫికెట్లు నిండుకున్నాయి. ఈ క్రమంలో కొత్తగా మరిన్ని దరఖాస్తులివ్వాలంటూ జిల్లా కార్యాలయంలో అర్జీలు పెట్టుకున్నప్పటికీ.. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు గందరగోళంలో పడ్డారు. ఉపకార‘వేతలు’:2014-15 సంవత్సరానికి సంబ ంధించి ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టింది. వార్షిక సంవత్సరం చివర్లో ఈ ప్రక్రియ ప్రారంభం కావడం, మరోైవె పు పరీక్షలు సైతం ముంచుకొస్తుండడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితిల్లో మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో నూతన కుల, ఆదాయ ధ్రువీకరణ కోసం అర్జీలు పెట్టుకోగా.. నిర్వాహకులు సర్టిఫికెట్లు లేవం టూ సమాధానం చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. దరఖాస్తుకు గడువు ముం చుకొస్తుండగా.. కుల, ఆదాయ ధ్రువీకరణ లేకపోవడంతో విద్యార్థులు పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ఈసీలు, పహానీల అవసరం భారీగా ఉంటుంది. కానీ మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు నిండుకోవడంతో తెల్లకాగితాలపైనే పొందాల్సివస్తోందని యా చారం గ్రామస్తుడు శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. -
పాస్‌కాని ‘ఈ’ పుస్తకం!
నత్తనడకన ప్రక్రియ దరఖాస్తులు 3,000 అంగీకరించినవి 600 జారీ అయింది 100 మాత్రమే పెరుగుతున్న అక్రమాలు పాస్ పుస్తకం.. ఇప్పుడు పొలం ఉన్న ప్రతి రైతుకూ అవసరం. అయితే వీటిలో నకిలీలూ లేకపోలేదు. అక్రమాలకూ కొదవలేదు. వీటన్నింటినీ అరికట్టేందుకు ‘ఈ’ పాసు పుస్తకం ఇస్తామంటూ ఊదరగొట్టిన అధికారులు వాటి ఊసే మరిచిపోయారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆమడ దూరంలో ఉండిపోయారు. సాక్షి, కర్నూలు : సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలలోను వినూత్న మార్పులు తెస్తోంది. రెవెన్యూ విభాగంలోనూ ఈ పరిజ్ఞానంతో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల నుంచి అడంగళ్ వరకు మీ-సేవ ద్వారా ఆన్లైన్లో పొందే వెసులుబాటు రెవెన్యూ శాఖ కల్పించింది. ఈ కోవలోనే పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి ఎలక్ట్రానిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక నుంచి చేతితో రాసిన పాస్‌పుస్తకాల స్థానంలో ఈ-పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ ప్రక్రియ 2014లో ప్రారంభమైనా నేటికీ పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. పథకం ప్రారంభంలో చోటు చేసుకున్న బాలారిష్టాలను అధిగమించి అమలును వేగవంతం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోంది.రాష్ట్ర విభజన అనంతర చాలా ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగి వాటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం రూ. 10 లక్షల నుంచి రూ. 3 కోట్లకు వరకు పలుకుతున్న వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమార్కులు హక్కులు లేకున్నా దొడ్డిదారిన ప్రభుత్వాన్ని, అసలు హక్కుదారులను బురిడీ కొట్టించి యాజమాన్య హక్కులు సాధిస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. నకిలీ పట్టాలు, పాస్ పుస్తకాలు సృష్టించి ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న వారు ఉన్నారు. నకిలీ పుస్తకాలతో బ్యాంకులు, సహకార సంస్థలను బురిడీ కొట్టించి రుణాలు పొందడం నుంచి పలు అక్రమాలు పాస్ పుస్తకాల రూపంలో జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంతోపాటు ప్రతి రైతు ఖాతాకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు, భద్రత, నకిలీలకు తావులేకుండా చేయాలన్న సంకల్పంతో ఁఈ* పాస్ పుసక్తం విధానానికి శ్రీకారం చుట్టారు. రుణ పరిపతిని సులభతరం చేసేందుకు.. రైతుకు రుణ పరపతిని సులభతరం చేసేందుకు పాస్‌పుస్తకం విధానాన్ని ప్రారంభించారు. 1976 నుంచి పాస్‌పుస్తకం విధానం అమలులో ఉంది. అప్పట్లో తోక పుస్తకాలు ఉండేవి. అయితే ఇవి గ్రామాల్లో ఒకరిద్దరు తెలివైన వారి తప్ప మిగిలినవారికి లభించేవి కావు. ఈ పరిస్థితుల్లో 1983లో ఆర్ఓఆర్ చట్టం ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేసే విధానాన్ని తీసుకువచ్చారు. గతంలోలా బ్యాంకులకు ధ్రువపత్రాలు తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా పాస్‌పుస్తకంతో రుణాలు పొందగలగేలా మార్పులు తెచ్చారు. ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్న సంకల్పంతో అప్పట్లో విరివిగా వీటిని జారీ చేశారు. ఈ ప్రక్రియ 2014 చివరి వరకు జరిగింది. నకిలీ పాస్‌పుస్తకాల బెడద నుంచి రైతును రక్షించడానికి, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రతి రైతు ఖాతాకు ప్రత్యేక గుర్తింపు నంబరు జారీ చేయాలన్న ఉద్దేశంతో విశిష్ట సంఖ్య( యూనిక్ నంబరు) విధానానికి శ్రీకారం చుట్టారు. గ్రామం, మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా వారీగా ఒక సంఖ్యను జారీ చే శారు. ఈ తరుణంలో ఈ-పాస్‌పుస్తకం విధానం అమలులోకి వచ్చింది. జిల్లాలో 3వేల దరఖాస్తులు... జిల్లాలో 10 లక్షల హెక్టార్లకుపైగా సాగు భూములుండగా 6.50 లక్షల రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. ఈ-పాస్‌పుస్తకాల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 3వేలకు పైగా దరఖాస్తులు నమోదయ్యాయి. రైతులు మీ సేవా కేంద్రాలలో పాస్‌పుస్తకాలు కోసం దరఖాస్తులు చేస్తున్నారు. మ్యుటేషన్, పాస్‌పుస్తకం కోసం చేసిన 3వేల దరఖాస్తులలో 600 దరఖాస్తులను అధికారులు అంగీకరించారు. సాంకేతిక ఇబ్బందులు... జిల్లా వ్యాప్తంగా లక్షల్లో రైతు ఖాతాలు ఉన్నప్పటికీ దరఖాస్తులు తక్కువగా ఉండడానికి కూడా పలు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ సంఖ్య లేని రైతుల భూములకు సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించడం లేదు. ఆన్లైన్లో నమోదు కానీ సర్వే నంబర్లకు సంబంధించి చేసే దరఖాస్తుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఒక సర్వే నంబరులో సబ్ డివిజన్ చేసి ముగ్గురు, నలుగురు రైతులు ఉండి ఉంటే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడం లేదు. ప్రారంభంలో మరిన్ని ఇబ్బందులు ఉన్నా ప్రస్తుతం వీటిలో చాలా వరకు పరిష్కరించినట్లు చెబుతున్నారు. ఈ విధానాన్ని సరళతరం చేయాలని రైతులు కోరుతున్నారు. దీనికి తోడు దీనికి సంబంధించిన సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై నుంచి పాస్‌పుస్తకం.. ఈ-పాస్‌పుస్తకాలను చెన్నైలో ముద్రించి రైతులకు అందజేస్తున్నారు. ఇవి అత్యంత ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందినవిగా చెబుతున్నారు. పాస్‌పుస్తకానికి దరఖాస్తు చేసిన నాటి నుంచి సుమారు రెండు నెలల వ్యవధి వరకు రైతులకు ఇవి చేరడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 100 మంది రైతులకు మాత్రమే ఈ-పాస్‌పుస్తకాలు అందాయి. తొలుత మీ-సేవా కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తులను సంబంధిత తహశీల్దారు పరిశీలించి అర్హమైన దరఖాస్తు అయితే 45 రోజుల్లోగా ఫారం-8ని జారీ చేయాలి. అభ్యంతరాలను తెలిపేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఫారం-8ను ప్రదర్శించాలి. అనంతరం పాస్‌పుస్తకం కోసం అంతర్జాలంలో ఆమోదించాలి. అనంతరం పాస్‌పుస్తకం తపాలా ద్వారా కార్యాలయానికి చేరుతుంది. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి సంతకం చేశాక రైతుకు అందజేయాలి. సబ్‌డివిజన్ కాని భూములను నోషనల్ సబ్‌డివిజన్ విధానం ద్వారా చేసేందుకు తహశీల్దార్లకు అధికారం కల్పించారు. ఒక సర్వే నంబరులోని భూమిలో నలుగురు రైతులు ఉండి ఒక్కరే దరఖాస్తు చేస్తే మిగిలిన ముగ్గురు రైతులకు ఇందుకు సంబంధించిన సమాచారం విధిగా అందించాలి. పాస్‌పుస్తకం ఆన్లైన్లో వచ్చినా టైటిల్ డీడ్‌ను మాత్రం ఆర్డీవో ఎప్పటి మాదిరిగానే జారీ చేస్తారు. -
రేషన్ కార్డులో మార్పులిలా...
జిల్లాలోని రేషన్ కార్డుల వినియోగదారులు తమ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన మళ్లీ కొత్తగా మార్పులు, చేర్పుల అవకాశం కల్పిస్తున్నామనీ జాయింట్ కలెక్టర్ బి.రామారావు తెలిపారు. ప్రస్తుతానికి ఈ మార్పులు చేర్పులను తహశీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరణకు అనుమతించామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో సేవలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న రేషన్ కార్డు వినియోగదారులంతా వారికి అవసరమైన దరఖాస్తులతో మీ సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటే... పుట్టిన పిల్లలు, వలస వచ్చిన కుటుంబ సభ్యుల పేర్లు కొత్తగా చేర్చాలంటే జనన ధ్రువపత్రం, వలస వచ్చిన వారికైతే గతంలో ఉండే ప్రాంతంలో రేషన్‌కార్డులో పేరు తొలగించే సమయంలో ఇచ్చే ధ్రువీకరణ పత్రం, కొత్త ప్రాంతానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం, ఆధార్, కరెంటు బిల్లు అఫిడవిట్ వంటివి జత చేయాలి. కొత్తగా సభ్యుల పేర్లు జత చేయడానికి సంయుక్త కలెక్టరు ద్వారా పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు ఆన్లైన్లో పంపుతారు. కమిషనర్ నుంచి తుది ఆమోదం లభించిన తర్వాత పేర్లు చేర్చుతారు. మొత్తం ఈ పన్నులన్నీ మీ సేవా కేంద్రాల ద్వారా జరుగుతాయి. మండల స్థాయిలో అయితే తహశీల్దార్ వీటిని జారీ చేస్తారు. కార్డు సరెండర్ చేయాలంటే... ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లేవారు, ఇతరత్రా వ్యక్తులు రేషన్ కార్డును సరండరు చేయాలంటే, సరండరు చేయడానికి గల కారణాలు పేర్కొంటూ దరఖాస్తు చేయడం, బదిలీ అయితే వాటి ఉత్తర్వులు, ఇతర రాష్ర్టంలో కొత్త నివాసం తెలిపేందుకు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, నీటిపన్ను బిల్లు, ఓటరు కార్డు, అఫిడవిట్ జత చేయాలి. మార్పులు చేర్పుల కోసం... కొన్ని రేషన్ కార్డుల్లో ఎల్పీ గ్యాస్ కనెక్షన్ ఉంటే లేనట్లు, లేకుంటే ఉన్నట్లు వస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే దరఖాస్తుదారుని అఫిడవిట్ గ్యాస్ డీలరు జారీ చేసిన గ్యాస్ కనెక్షన్ రశీదు, నివాస ధ్రువపత్రం (ఆధార్ కార్డు కరెంటు బిల్లు, ఓటరు కార్డు, ఇంటి పన్ను రశీదు) గ్యాస్ కనెక్షన్ లేకుంటే లేనట్లు అఫిడవిట్ సమర్పించాలి. డూప్లికేట్ కార్డు పొందాలంటే... పోగొట్టుకొన్న లేక చిరిగిన వాటి స్థానంలో కొత్తగా డూప్లికేట్ కార్డు పొందాల్సిన వారు చిరిగిపోయిన రేషన్ కార్డు జిరాక్సు, పోయినట్టు ఎస్హెచ్ఓ రిపోర్టు, దరఖాస్తుదారుని సొంత డిక్లరేషన్, రేషన్ డీలరు నుంచి సరుకులు విడిపించుకోలేదని డీలరు ఇచ్చే ధ్రువీకరణపత్రం, దరఖాస్తుదారుని అఫిడవిట్ జతచేయాలి. గ్యాస్ కనెక్షన్ కొత్తగా పొందాలంటే... నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, నీటి పన్ను బిల్లు, ఓటరు కార్డు, జతచేసి దరఖాస్తు చేస్తే సంబంధిత గ్యాస్ డీలరు కనెక్షన్ ఇస్తారు. రేషన్ కార్డు బదిలీ చేయడానికి... రేషన్ కార్డును ఒక చోట నుంచి మరొక చోటుకు బదిలీ చేసుకోవడానికి గల కారణాలను తెలియజేస్తూ దరఖాస్తు, కొత్త ప్రాంతంలో నివసిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఓటరు కార్డు జిరాక్సులు జతచేయాలి. తెలుపు కార్డును గులాబీగా మార్చుకోవాలంటే ప్రస్తుతం ఉన్న తెలుపు కార్డును గులాబీ కార్డుగా మార్చుకోవాలంటే దరఖాస్తుతో పాటు ఆదాయ ధ్రువపత్రం కార్డుదారుని అఫిడవిట్/ నోటరీ / డిక్లరేషన్ ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డును జత చేసి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. వీటిని జారీ చేసే అధికారం మండల స్థాయిలో తహశీల్దార్‌కి అప్పగించాలి. గులాబీ కార్డు పొందాలంటే... గులాబీ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు, విద్యుత్ / నీటి పన్ను రశీదు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు, అఫిడవిట్ / నోటరీ జతచేసి దరఖాస్తు చేస్తే తహశీల్దార్ గులాబీ కార్డు జారీ చేస్తారు. పేరు తొలగింపు ఇలా... రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు తొలగించాలంటే సంబంధిత సభ్యుని డిక్లరేషన్ పత్రం, అఫిడవిట్ / నోటరీ ఉండాలి. చనిపోయిన వ్యక్తి పేరు తొలగించాలంటే సంబంధిత వ్యక్తి మరణ ధ్రువపత్రం జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబ యజమాని పేరు మార్చాలంటే... రేషన్ కార్డులో ప్రస్తుతం ఉన్న కుటుంబ యజమాని పేరు మార్చాలంటే కుటుంబ యజమాని / కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, కొత్త ప్రాంతంలో నివసిస్తే తహశీల్దార్ జారీ చేసే ధ్రువీకరణ పత్రం, చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం ఉన్న ఒరిజనల్ రేషన్ కార్డు జతచేసి దరఖాస్తు చేయాలి. -
ఇదే మి సేవ..?
* ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం * వారాలు గడిచినా రాని సర్టిఫికెట్లు * వేలాది సర్టిఫికెట్లు పెండింగ్ * నానా అగచాట్లు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు * సర్వర్లు డౌన్, సాంకేతిక సమస్యలతో సతమతం * రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమూ కారణమే * క్షేత్రస్థాయి తనిఖీకే వారాలు పడుతున్న వైనం * సర్టిఫికెట్ల జారీ వెనుక అవినీతి ఆరోపణలు? సాక్షి ప్రతినిధి, ఖమ్మంజిల్లా కేంద్రానికి చెందిన సంతోష్‌కు డిగ్రీలో చేరేందుకు కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలి. వాటిని కళాశాలలో సమర్పిస్తేనే అడ్మిషన్ దొరుకుతుంది. సర్టిఫికెట్ల కోసం పదిరోజుల క్రితం స్థానిక ‘మీసేవ’ కేంద్రంలో అతను దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇంతవరకు అతనికి సర్టిఫికెట్ రాలేదు. మీసేవా కేంద్రం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం అని రాసిన ధ్రువీకరణపత్రాలు ఇంకా రాలేదని కొన్ని రోజులు.. సాంకేతిక సమస్యలున్నాయని.. సర్వర్లు డౌన్ అయ్యాయని మరికొన్ని రోజులు..ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్ప అతనికి సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఒక్క సంతోష్‌దే కాదు జిల్లాలోని దాదాపు మెజార్టీ మీసేవ, ఈసేవ కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల నుంచి రైతుల దాకా అందరూ వారాల తరబడి తిరగాల్సి వస్తోంది. చేతులు తడిపితే మాత్రం సర్టిఫికెట్ ఇట్టే జారీ అయిపోతుండటం గమనార్హం. జిల్లాలో మీ సేవ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. సాంకేతిక సమస్యలకు తోడు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో అవస్థలు పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. మీసేవ కేంద్రాల చుట్టూ తిరగలేక వారి చెప్పులు అరిగిపోతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి తహశీల్దార్ల వరకు సర్టిఫికెట్ల జారీ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డబ్బు ముట్టిన దాన్ని బట్టి సర్టిఫికెట్ల జారీ అవుతున్నాయని, ఒక్కో సర్టిఫికెట్‌కు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలకు తోడు మానవ తప్పిదాలు వాస్తవానికి ఏపీ ఆన్లైన్, ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో సర్టిఫికెట్ల జారీ రోజురోజుకూ సులభతరం కావాల్సింది పోయి క్లిష్టమతున్నాయి. ముఖ్యంగా సర్వర్ ప్రాబ్లమ్ అటు కేంద్రాల నిర్వాహకులు, ఇటు దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నెట్ క నెక్ట్ కావడం లేదని, సర్వర్లు పనిచేయడం లేదని దరఖాస్తుదారులను నిర్వాహకులు వెనక్కు పంపుతున్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా చోట్ల తహశీల్దార్లు, డెప్యూటీ తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు లేక సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. మరోవైపు దరఖాస్తుపై విచారణ స్థాయిలో కూడా జాప్యం జరుగుతోంది. ఈ విచారణ పేరుతో వీఆర్వోలు వారాల తరబడి జాప్యం చేస్తున్నారు. ఇదేమంటే మాకు ఇదొక్కటే పనికాదు కదా అని బదులిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్టిఫికెట్ల జారీలో అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయం స్థాయిలో మామూళ్లు ఇచ్చిన కేంద్రాల సర్టిఫికెట్లు మాత్రమే క్లియర్ అవుతున్నాయని, పెద్దగా ముడుపులు ఇవ్వని కేంద్రాల సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని కూడా కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ మామూళ్లకు మధ్యవర్తులుగా క్షేత్రస్థాయిలో దరఖాస్తులను విచారించే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారని సమాచారం. మరోవైపు సర్టిఫికెట్ల వారీగా కొన్ని చోట్ల వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం రూ.3వేలు, ఆదాయం కోసం రూ.వెయ్యి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి.. భద్రాచలంలో మీసేవా, ఈ సేవా ఆన్లైన్లలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక పదిరోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై మీసేవా నిర్వాహకులను ప్రశ్నిస్తే పదిరోజులుగా ప్రింటింగ్ స్టేషనరీ ప్రభుత్వం నుంచి అందటం లేదని చెపుతున్నారు. భద్రాచలం మీసేవలో తహశీల్దార్ సంతకం అయి కూడా వందల సంఖ్యలో కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు జారీ కావడం లేదు. కూనవరంలో 122, వెంకటాపురంలో 60 వరకు ఇలానే పెండింగ్‌లో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో ఆరు ఈసేవా కేంద్రాలు ఉన్నాయి. జూన్ 29వ తేది నుంచి జూలై 04వ తేదీ వరకు 2000 సర్టిఫికెట్ల( కుల,ఆదాయ, నివాస, ఈబీసీ, ఓబీసీ) కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో 760 ధ్రువీకరణ పత్రాలు తహశీల్దార్ మంజూరు చేయగా, 250 పత్రాలు ఈసేవా నుంచి లబ్ధిదారులకు విడుదల చేశారు. ఇంకా 410 సర్టిఫికెట్లు ఈసేవా నుంచి లబ్ధిదారులకు అందాల్సి ఉంది. నాలుగు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వ ముద్రతో కూడిన పత్రాలు అందుబాటులో లేవు. గార్ల మండలంలో 424 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తహశీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. తహశీల్దార్‌కు రిజిస్టర్ కీ ఇచ్చి రెండేళ్లు అయింది. రిజిస్టర్ కీ కాల పరిమితి ఈనెల 3తో ముగిసింది. తహశీల్దార్ రిజిస్టర్ కీ లేనందున విద్యార్థుల సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఈ, మీసేవా కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లోనే ఉన్నాయి. స్టేషనరీ పేపర్లు సమయానికి రాకపోవడం, సర్వర్లు మొరాయించడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందటం లేదు. ఖమ్మం రూరల్ మండలంలోని పెదతండా, తల్లంపాడులో 30 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ ప్రాబ్లమ్ అని తిప్పుతున్నారు: పొట్టపింజర బాలస్వామి, నేలకొండపల్లి మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో సర్వర్ ప్రాబ్లమ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కేంద్రాలలో పని అయిపోయిందని తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడా అదే పరిస్థితి... రోజుల తరబడి తిప్పుతున్నారు. కాలేజీ, వసతి గృహాలలో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో అందటం లేదు.