రేషన్ కార్డులో మార్పులిలా...
జిల్లాలోని రేషన్ కార్డుల వినియోగదారులు తమ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన మళ్లీ కొత్తగా మార్పులు, చేర్పుల అవకాశం కల్పిస్తున్నామనీ జాయింట్ కలెక్టర్ బి.రామారావు తెలిపారు. ప్రస్తుతానికి ఈ మార్పులు చేర్పులను తహశీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరణకు అనుమతించామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో సేవలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న రేషన్ కార్డు వినియోగదారులంతా వారికి అవసరమైన దరఖాస్తులతో మీ సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాలను సంప్రదించాలన్నారు.
కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటే...
పుట్టిన పిల్లలు, వలస వచ్చిన కుటుంబ సభ్యుల పేర్లు కొత్తగా చేర్చాలంటే జనన ధ్రువపత్రం, వలస వచ్చిన వారికైతే గతంలో ఉండే ప్రాంతంలో రేషన్‌కార్డులో పేరు తొలగించే సమయంలో ఇచ్చే ధ్రువీకరణ పత్రం, కొత్త ప్రాంతానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం, ఆధార్, కరెంటు బిల్లు అఫిడవిట్ వంటివి జత చేయాలి. కొత్తగా సభ్యుల పేర్లు జత చేయడానికి సంయుక్త కలెక్టరు ద్వారా పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో పంపుతారు. కమిషనర్ నుంచి తుది ఆమోదం లభించిన తర్వాత పేర్లు చేర్చుతారు. మొత్తం ఈ పన్నులన్నీ మీ సేవా కేంద్రాల ద్వారా జరుగుతాయి. మండల స్థాయిలో అయితే తహశీల్దార్ వీటిని జారీ చేస్తారు.
కార్డు సరెండర్ చేయాలంటే...
ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లేవారు, ఇతరత్రా వ్యక్తులు రేషన్ కార్డును సరండరు చేయాలంటే, సరండరు చేయడానికి గల కారణాలు పేర్కొంటూ దరఖాస్తు చేయడం, బదిలీ అయితే వాటి ఉత్తర్వులు, ఇతర రాష్ర్టంలో కొత్త నివాసం తెలిపేందుకు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, నీటిపన్ను బిల్లు, ఓటరు కార్డు, అఫిడవిట్ జత చేయాలి.
మార్పులు చేర్పుల కోసం...
కొన్ని రేషన్ కార్డుల్లో ఎల్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంటే లేనట్లు, లేకుంటే ఉన్నట్లు వస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే దరఖాస్తుదారుని అఫిడవిట్ గ్యాస్ డీలరు జారీ చేసిన గ్యాస్ కనెక్షన్ రశీదు, నివాస ధ్రువపత్రం (ఆధార్ కార్డు కరెంటు బిల్లు, ఓటరు కార్డు, ఇంటి పన్ను రశీదు) గ్యాస్ కనెక్షన్ లేకుంటే లేనట్లు అఫిడవిట్ సమర్పించాలి.
డూప్లికేట్ కార్డు పొందాలంటే...
పోగొట్టుకొన్న లేక చిరిగిన వాటి స్థానంలో కొత్తగా డూప్లికేట్ కార్డు పొందాల్సిన వారు చిరిగిపోయిన రేషన్ కార్డు జిరాక్సు, పోయినట్టు ఎస్‌హెచ్‌ఓ రిపోర్టు, దరఖాస్తుదారుని సొంత డిక్లరేషన్, రేషన్ డీలరు నుంచి సరుకులు విడిపించుకోలేదని డీలరు ఇచ్చే ధ్రువీకరణపత్రం, దరఖాస్తుదారుని అఫిడవిట్ జతచేయాలి.
గ్యాస్ కనెక్షన్ కొత్తగా పొందాలంటే...
నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, నీటి పన్ను బిల్లు, ఓటరు కార్డు, జతచేసి దరఖాస్తు చేస్తే సంబంధిత గ్యాస్ డీలరు కనెక్షన్ ఇస్తారు.
రేషన్ కార్డు బదిలీ చేయడానికి...
రేషన్ కార్డును ఒక చోట నుంచి మరొక చోటుకు బదిలీ చేసుకోవడానికి గల కారణాలను తెలియజేస్తూ దరఖాస్తు, కొత్త ప్రాంతంలో నివసిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఓటరు కార్డు జిరాక్సులు జతచేయాలి.
తెలుపు కార్డును గులాబీగా మార్చుకోవాలంటే
ప్రస్తుతం ఉన్న తెలుపు కార్డును గులాబీ కార్డుగా మార్చుకోవాలంటే దరఖాస్తుతో పాటు ఆదాయ ధ్రువపత్రం కార్డుదారుని అఫిడవిట్/ నోటరీ / డిక్లరేషన్ ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డును జత చేసి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. వీటిని జారీ చేసే అధికారం మండల స్థాయిలో తహశీల్దార్‌కి అప్పగించాలి.
గులాబీ కార్డు పొందాలంటే...
గులాబీ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు, విద్యుత్ / నీటి పన్ను రశీదు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు, అఫిడవిట్ / నోటరీ జతచేసి దరఖాస్తు చేస్తే తహశీల్దార్ గులాబీ కార్డు జారీ చేస్తారు.
పేరు తొలగింపు ఇలా...
రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు తొలగించాలంటే సంబంధిత సభ్యుని డిక్లరేషన్ పత్రం, అఫిడవిట్ / నోటరీ ఉండాలి. చనిపోయిన వ్యక్తి పేరు తొలగించాలంటే సంబంధిత వ్యక్తి మరణ ధ్రువపత్రం జతచేసి దరఖాస్తు చేసుకోవాలి.
కుటుంబ యజమాని పేరు మార్చాలంటే...
రేషన్ కార్డులో ప్రస్తుతం ఉన్న కుటుంబ యజమాని పేరు మార్చాలంటే కుటుంబ యజమాని / కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, కొత్త ప్రాంతంలో నివసిస్తే తహశీల్దార్ జారీ చేసే ధ్రువీకరణ పత్రం, చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం ఉన్న ఒరిజనల్ రేషన్ కార్డు జతచేసి దరఖాస్తు చేయాలి.