అడుగడుగునా అవమానాలు | Conflicts Between BJP And TDP In Vizianagaram | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అవమానాలు

Published Sun, Feb 4 2018 12:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

Conflicts Between BJP And TDP In Vizianagaram - Sakshi

అడుగడుగునా అవమానిస్తున్నారు. అయినా భరించారు. ఎన్నికలపుడు ప్రచారానికి వాడుకున్నారు. గెలిచాక పట్టించుకోకుండా వదిలేశారు. ఏ కార్యక్రమానికీ వారిని ఆహ్వానించకుండా తీసిపడేశారు. సమావేశాల సమాచారాన్నీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర పథకాలన్నింటికీ పేర్లు మార్చేసి తమవిగానే ప్రచారం చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన కార్యక్రమాల్లో మిత్ర పార్టీ నేతల బొమ్మలు లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను కనీసం తాము చెప్పినవారికివ్వకుండా అడ్డుకున్నారు. అయినా మిత్రధర్మాన్ని పాటిస్తున్నా... లోలోపల మధనపడుతున్నారు. ఇదీ జిల్లాలో బీజేపీ... టీడీపీల మధ్య నడుస్తున్న మిత్ర భేదం.

సాక్షిప్రతినిధి, విజయనగరం: మిత్ర పక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య జిల్లాలో కనీస సఖ్యత లేదు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు బీజేపీ నేతలకు కనీస ఆహ్వానం లేదు. ఇలాంటి అవమానాలు జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులకు నిత్యకృత్యమైపోయా యి. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నా... నాలుగేళ్లుగా గ్రామ స్థాయి నుంచి నియోజవర్గ స్థాయి వరకూ సంక్షేమ పథకాలు బీజేపీ కార్యకర్తలకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. గ్రామ స్థాయిలో ఏ ఒక్కరూ తమ కటుంబ సభ్యులకు పింఛన్, రేషన్‌ కార్డు, గృహాలు ఇప్పించుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలున్నారు. దీనంతటికీ కారణం టీడీపీ నాయకులేనని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

కేంద్రం నిధులిస్తే... వీరి పేర్లు...
కేంద్రం నిధులతో జరుగుతున్న కార్యక్రమాలకు సైతం బీజేపీ నాయకులను టీడీపీ నేతలు కలుపుకుని వెళ్లిన సందర్భాలు ఎక్కడా లేవు. అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని పైకి చెబుతున్నా... లోలోన టీడీపీపై బీజేపీ నేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లకు చంద్రన్న బాట పేరుపెట్టి వాటి ప్రారంభోత్సవాలకుగాని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హా మీ పథకం ద్వారా మంజూరవుతున్న పంచాయతీ భవన నిర్మాణాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాల ప్రారంభోత్సవాలకు గా నీ మిత్రపక్షానికి ఆహ్వానం అందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత పథకాన్ని ఇటీవల కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికీ బీజేపీ నాయకులను ఆహ్వానించలేదు. దీంతో బీజేపీ జిల్లా నేతలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అసలు అధికార పక్షమో, మిత్రపక్షమో, ప్రతిపక్షమో తెలియని మీమాం సలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో గాని, కొత్తవలస మండలం రెల్లిలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపనకుగానీ టీడీపీ నేతలు గాని, వారు చెప్పినట్టు నడుచుకుంటున్న అధికారులు గాని ఆహ్వానించలేదు.

బీజేపీలో పెరుగుతున్న ఆవేదన
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పని చేసి, బీజేపీ అభ్యర్థి డబ్బుతోనే ప్రచారం చేసినప్పటికీ అంతా తమదేనని టీడీపీ నేతలు చెప్పుకున్నారు. తెలుగుదేశంతో కలిసి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని ఎదగనివ్వరనేది చీపురుపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి కరణం మురళి బాహాటంగా ఆరోపిస్తున్నారు. టీడీపీతో పొత్తు అనవసరమని, రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదనే బాధ కంటే జగన్‌మోహన్‌రెడ్డికి మంచి జరుగుతుందేమోనన్న బాధ తెలుగుదేశం నేతలకు ఎక్కువయ్యిందని, నియోజకవర్గంలో తమను ఎప్పుడూ టీడీపీ వారు కలుపుకుని వెళ్లకపోగా ఒక్క పథకం ద్వారా కూడా తమ వారికి లబ్ధి చేకూరనివ్వడం లేదనేది ఆయన వాదన. నిజానికి ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలందరి మాట. ఇదే విషయంపై దత్తిరాజేరు గజపతినగరం బొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు జాగారపు కృష్ణ, గెద్ద అప్పలనాయుడు, మీసాల కుమార్‌ ఎన్నో మార్లు అధిష్టాన పెద్దల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.  

కరివేపాకులా తీసి పారేస్తూ...
2015లో నెల్లిమర్ల నగరపంచాయతీకి కేంద్రప్రభుత్వం మం జూరుచేసిన ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ పథకానికి లబ్ధి దారుల ఎంపిక పూర్తిగా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ యే చేసింది. పట్టణానికి తొలివిడతగా 324 ఇళ్లు మంజూరవ్వగా ఒక్క ఇంటిని కూడా బీజేపీ నేతలకు కేటాయించలేదు. దీంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కె.ఎన్‌.ఎం.కృష్ణారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గతేడాది నగరపంచాయతీ కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. గత నెలలో మళ్లీ రెండో విడతకు సంబంధించి 624 ఇళ్లకు ఆన్‌లైన్లో ప్రతిపాదనలు పంపించారు. ఈ సారీ జన్మభూమి కమిటీ సభ్యులు బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వలేదు. కేంద్రంలోని తమ ప్రభుత్వం అందించే నిధులతో పథకాలకు పేర్లు మార్చి సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని బీజేపీనేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని, టీడీపీతో పొత్తు ఉండాలా వద్దా అనేది దానిపై ఏ నిర్ణయం తీసుకొన్నా అనుసరిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.వి.వి.గోపాలరాజు అంటున్నారు.

పొత్తు ఇష్టం లేకున్నా...
నిజానికి జిల్లాలో బీజేపీ నేతలెవరికీ టీడీపీతో పొత్తు ఏ మాత్రం ఇష్టం లేదు. ఎన్నిసీట్లు వచ్చినా చాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండానే పోటీ చేస్తే మంచిదనే భావనలోనే వారంతా ఉన్నారు. విశాఖ ఎంపీ హరిబాబు ఉన్నా ఎస్‌.కోట నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వానికి ఏనాడూ విలువ లేదు, ఖాసాపేట  గ్రామానికి విశాఖ ఎంపీ బోర్లు మంజూరు చేస్తే, ఖాసాపేట గ్రామానికి బోర్లు వద్దని తీర్మానం చేయించి, బీజేపీ సర్కారును హరిబాబు నాయకత్వాన్ని టీడీపీ అడ్డుకున్న తీరు వారి మధ్య విభేదాలకు నిదర్శనం.

పైగా కవ్వింపు చర్యలు
దీనికి తోడు తెలుగుదేశం నాయకులు తరచూ కవ్వింపు ప్రకటనలు చేస్తూ తమను తీవ్రంగా అవమానిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గద్దెబాబూరావు చీపురుపల్లిలో బాహాటంగానే బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానంటూ కవ్వింపు ధోరణిలో వ్యాఖ్యానాలు చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు.

పెత్తనం టీడీపీది... బానిసత్వం బీజేపీది
రాష్ట్రంలో పెత్తనం టీడీపీది... బానిసత్వం బీజేపీది అన్నచందంగా ఉంది మా పరిస్థితి. ఎన్నికల్లో మిత్రపక్షమన్న భావంతో బీజేపీ నాయకులు బానిసల్లా టీడీపీ నేతల గెలుపునకు కృషి చేశారు. తీరా అధికారం చేపట్టాక ఏటిదాటాక... తెప్ప తగలేసిన చందంగా తయారైంది మా పరిస్థితి. టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మిత్రపక్ష నాయకులకు, కార్యకర్తలకు విలువ, గౌరవం ఇవ్వలేదన్న బాధ ప్రతీ బీజేపీ కార్యకర్తలోనూ ఉంది. గౌరవం లేనిచోట ఎందుకు ఉండాలన్న ఆలోచనా అందరిలోనూ ఉంది. అయితే మిత్రధర్మం పాటించాలన్న సమన్వయంతో వ్యవహరిస్తూ సర్దుకుపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం నాయకులు ఏమి కోరుకుంటున్నారో, రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అదే కోరుకుంటున్నారు. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇదే. రాష్ట్రంలో మాకు గౌరవం కల్పిస్తేనే కేంద్రంలో వారికి గౌరవం అందుతుంది. ఇక్కడ బీజేపీ నేతలకు, కార్యకర్తలకు జరగుతున్న అన్యాయం అంతా కేంద్ర నాయకులకు తెలియనిది కాదు. వారికి ఏమి తెలియదనుకోవడం చెల్లదు.            –  పాకలపాటి సన్యాసిరాజు (మురళి), బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  

పొత్తు తరువాతే... అవమానాలు
గత ఎన్నికల్లో జిల్లాలో బీజేపీకి ఒక్క సీటు ఇవ్వకపోయినా మిత్రధర్మం పాటించి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు గెలుపునకు రెండు జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాల్లో సొంత వాహనంపై ప్రధాని మోదీ, అశోక్‌గజపతిరాజు బొమ్మలు ముద్రించి ప్రచారం నిర్వహించాను. తీరా అధికారం చేపట్టాక ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి గాని, ప్రారంభో త్సవాలకు గాని ఆహ్వానం ఇవ్వడం లేదు. గతంలో కొంతమంది అధికారులు ఆహ్వానించేవారు ఇప్పుడు అధికార పార్టీ నేతలకు భయపడి అది కూడా మానేశారు.      
– బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

ఆ విధానం సరికాదు
బీజేపీ, టీడీపీ కూటమి విషయంలో అమిత్‌ షా ఇటీవల విమర్శించొద్దు అన్న తరువాత టీడీపీ నాయకులు మారుతారనుకుంటున్నాం. జన్మభూమి కమిటీల ఆజమాయిషీ, కేంద్ర ప్రభుత్వ నిధులకు చంద్రబాబు పేర్లను పెట్టడం సరికాదు. అమిత్‌ షా అన్న తరువాత మేం నోరు జారం. ఇక వారు మారుతారని ఆశిస్తున్నాం. జన్మభూమి కమిటీల్లో మాకూ చోటివ్వాలని కోరినా స్పందించలేదు.
– పెద్దింటి జగన్మోహన రావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement