విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలా నిత్యావసర సరుకులు 90 శాతం వరకు పంపిణీ అవుతున్నాయి. మిగిలిన పది శాతం బోగస్ కార్డులుగా భావిస్తున్నారు. ప్రతి నెలా జిల్లాలోని 1,392 రేషన్ షాపుల పరిధిలో ఉన్న 6.90 లక్షల రేషన్ కార్డులకు బియ్యం, పంచదార, కిరోసిన్ ఇస్తున్నారు.
ఈ కార్డుల్లో పది శాతం మాత్రం పంపిణీ కావడం లేదు. ఈ రేషన్‌కార్డులకు సంబంధించిన సరుకులు డీలర్ల క్లోజింగ్ బ్యాలెన్స్‌లో ఉండిపోతున్నాయి. వాటిని వచ్చే నెలకు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లుగా ప్రారంభిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి నిత్యావసర సరుకులు 85 శాతం రేషన్ షాపులకు వెళ్లాయి. ఈ నెల 15వ తేదీ వరకూ ఇంకా సమయం ఉంది. కాబట్టి మరో 5 శాతం పంపిణీ చేసే అవకాశముంది. ప్రతీ నెల సుమారుగా 90 శాతం సరుకులు మాత్రమే రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్నాయి.
వలసల వల్లా.. లేక సరుకులు అవసరం లేకా..!
జిల్లాలోని రేషన్ కార్డుదారుల్లో పలువురు ఇతర జిల్లాలకు వలస వెళ్లిపోయారు. వీరిలో చాలామందికి ఆయా ప్రాంతాల్లో రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. బయోమెట్రిక్ నేపథ్యంలో చాలామంది ఇక్కడికి వచ్చి బయోమెట్రిక్ తీసుకున్నప్పటికీ రెండు రేషన్‌కార్డుల్లో కొన్ని రద్దు కాలేదు. అటువంటి కార్డులే ప్రతి నెల సరుకులు తీసుకోవడం లేదని సమాచారం. ఈ కార్డుల్లో భోగస్‌వి కూడా ఉన్నట్టు తెలిసింది. అధికారులు మాత్రం వారంతా వలస వెళ్లిన వారేనని, భోగస్ కార్డులను ఏరివేశామని చెబుతున్నారు.
అయితే, చాలామంది ప్రతి నెలా ఇక్కడకు వస్తున్నారు. లేదా వారి కుటుంబ సభ్యులు, పెద్దవారు వేలిముద్రలు వేసి సరుకులు తీసుకుంటున్నారు. పది శాతం మాత్రం ఇంకా వేలిముద్రలు వేయడానికి రాలేదు. వారికి రేషన్ సరుకులు అవసరం లేక పోవడమే కారణమని భావిస్తున్నారు. అందువల్లే నెలలు గడుస్తున్నా వేలిముద్రలు వేయడానికి రావడం లేదని తెలుస్తోంది. బయోమెట్రిక్ విధానంలో సరుకులు తీసుకునేందుకు రానివారికి రెండు కార్డులు ఉండి ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
రేషన్ తీసుకునేది 90 శాతమే !
Published Thu, May 12 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement
Advertisement