విజయనగరం కంటోన్మెంట్: రేషన్ కార్డులకు ఆధార్, ఫొటోలు సమర్పించాలని అధికార యంత్రాంగం మొత్తుకుంటున్నా జిల్లాలో ఇంకా 53,511 రేషన్ కార్డులకు ఎటువంటి వివరాలూ అందలేదు. ఇటీవలే వీటికి సరుకులు ఇవ్వడం మానేసినప్పటికీ ఇంత వరకూ ఇన్ని సంవత్సరాల బట్టి సరుకులను ఎవ రు తిన్నారన్న విషయం చర్చనీయాంశమవుతోంది. ఈ కార్డులకు సంబంధించి ఇంకా వస్తే ఓ ఐదారువందల కార్డులకు మాత్రం ఆధార్, ఫొటోలు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు 53,000 కుటుంబాల పేర్లు చెప్పి సంవత్సరాల పాటు రేషన్ తినేశారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ కార్డుదారుల పరిధిలో లక్షా61,562 మంది కుటుంబ సభ్యులున్నట్టు రికార్డుల్లో ఉంది. వీరికి రేషన్ అప్పగించినట్టు ఇన్నాళ్లూ రికార్డులు నమోదు చేసి బియ్యం, పంచదార, కిరోసిన్, గోధుమలు, పప్పులు, ఇతర వస్తువులు తినేశారన్నమాట.
ఇంత వరకూ రేషన్ కార్డుల ద్వారా పెద్ద ఎత్తున సరుకులు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు తిన్నారు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉందని జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజలు విస్తుపోతున్నారు. సంవత్సర కాలంగా ఆధార్, ఫొటోలు సమర్పించాలని కోరుతున్నప్పటికీ ఇంకా స్పందించ కపోవడం చూస్తే ఇవి బోగస్ కార్డులని అధికారులు కూడా భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మాకు రేషన్ కార్డులున్నా సరుకులు రాలేదని వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆధార్ కార్డులు ఇవ్వాలని చెప్పిన తరువాత ఇన్ని నెలలు ఎవరూ ఆధార్ సమర్పించకుండా ఉండరనీ ఆలోచిస్తున్నారు. దీని ప్రకారం చూస్తే నెలకు వందలాది మెట్రిక్ టన్నుల బియ్యం తిన్నారని స్పష్టమవుతున్నది.
ఆహార భద్రత పథకం అమలు కాకముందుఒక్కో కుటుంబ సభ్యునికి 4కిలోలు ఇచ్చే వారు. అంటే నెలకు 646.248 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాహా అయ్యేవన్న మాట! ఈ లెక్కన పంచదార, కిరోసిన్, కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండితో పాటు గతంలో అందించిన 9 సరుకులను కూడా ఇదే విధంగా పందికొక్కుల్లా తిన్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈపోస్ విధానానికి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం ఈ విధంగా ఈపోస్ విధానం, ఈపీడీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బియ్యం, ఇతర వస్తువులు మిగలనున్నాయి.
తాకట్టు కార్డులేనా?: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో నివాసం ఉంటున్న హరిజన, గిరిజన ఇతర కులాలకు చెందిన నిరుపేదలకు చెందిన రేషన్ కార్డులను ధనికులు తాకట్టులో ఉంచుకుంటున్నారు. రేషన్ కార్డుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ముట్ట జెప్పి కార్డులను తమ అధీనంలో ఉంచుకుంటున్నారు. మరికొన్ని కార్డులకు ఊరూపేరూ లేని పాత కార్డులే ఇంకా కొనసాగుతున్నాయి. ఈపోస్ విధానం, ఈపీడీఎస్ విధానం వచ్చాక ఈ కార్డుల్లో చాలా వాటికి రేషన్ ఇవ్వడం లేదు. ఇవి ఆ కార్డులేనన్న అనుమానాలు వ్యక్తం చే స్తున్నారు. వీటితో పాటు కొందరు డీ లర్ల వద్ద కూడా రేషన్ కార్డులు ఉన్నట్టు అందుకే ఆధార్, ఫొటోలు ఇచ్చేందుకు సంకోచిస్తున్నారనీ విని కిడి. ఈ విషయమై అధికారులను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
ఎవరు బుక్కారు?
Published Fri, Aug 7 2015 12:00 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement