నత్తనడకన ప్రక్రియ
దరఖాస్తులు 3,000
అంగీకరించినవి 600
జారీ అయింది 100 మాత్రమే
పెరుగుతున్న అక్రమాలు
పాస్ పుస్తకం.. ఇప్పుడు పొలం ఉన్న ప్రతి రైతుకూ అవసరం. అయితే వీటిలో నకిలీలూ లేకపోలేదు. అక్రమాలకూ కొదవలేదు. వీటన్నింటినీ అరికట్టేందుకు ‘ఈ’ పాసు పుస్తకం ఇస్తామంటూ ఊదరగొట్టిన అధికారులు వాటి ఊసే మరిచిపోయారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆమడ దూరంలో ఉండిపోయారు.
సాక్షి, కర్నూలు : సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలలోను వినూత్న మార్పులు తెస్తోంది. రెవెన్యూ విభాగంలోనూ ఈ పరిజ్ఞానంతో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల నుంచి అడంగళ్ వరకు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు రెవెన్యూ శాఖ కల్పించింది. ఈ కోవలోనే పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి ఎలక్ట్రానిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక నుంచి చేతితో రాసిన పాస్‌పుస్తకాల స్థానంలో ఈ-పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ ప్రక్రియ 2014లో ప్రారంభమైనా నేటికీ పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు.
పథకం ప్రారంభంలో చోటు చేసుకున్న బాలారిష్టాలను అధిగమించి అమలును వేగవంతం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోంది.రాష్ట్ర విభజన అనంతర చాలా ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగి వాటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం రూ. 10 లక్షల నుంచి రూ. 3 కోట్లకు వరకు పలుకుతున్న వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమార్కులు హక్కులు లేకున్నా దొడ్డిదారిన ప్రభుత్వాన్ని, అసలు హక్కుదారులను బురిడీ కొట్టించి యాజమాన్య హక్కులు సాధిస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి.
నకిలీ పట్టాలు, పాస్ పుస్తకాలు సృష్టించి ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న వారు ఉన్నారు. నకిలీ పుస్తకాలతో బ్యాంకులు, సహకార సంస్థలను బురిడీ కొట్టించి రుణాలు పొందడం నుంచి పలు అక్రమాలు పాస్ పుస్తకాల రూపంలో జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంతోపాటు ప్రతి రైతు ఖాతాకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, భద్రత, నకిలీలకు తావులేకుండా చేయాలన్న సంకల్పంతో ఁఈ* పాస్ పుసక్తం విధానానికి శ్రీకారం చుట్టారు.
రుణ పరిపతిని సులభతరం చేసేందుకు..
రైతుకు రుణ పరపతిని సులభతరం చేసేందుకు పాస్‌పుస్తకం విధానాన్ని ప్రారంభించారు. 1976 నుంచి పాస్‌పుస్తకం విధానం అమలులో ఉంది. అప్పట్లో తోక పుస్తకాలు ఉండేవి. అయితే ఇవి గ్రామాల్లో ఒకరిద్దరు తెలివైన వారి తప్ప మిగిలినవారికి లభించేవి కావు. ఈ పరిస్థితుల్లో 1983లో ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేసే విధానాన్ని తీసుకువచ్చారు. గతంలోలా బ్యాంకులకు ధ్రువపత్రాలు తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా పాస్‌పుస్తకంతో రుణాలు పొందగలగేలా మార్పులు తెచ్చారు. ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్న సంకల్పంతో అప్పట్లో విరివిగా వీటిని జారీ చేశారు.
ఈ ప్రక్రియ 2014 చివరి వరకు జరిగింది. నకిలీ పాస్‌పుస్తకాల బెడద నుంచి రైతును రక్షించడానికి, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రతి రైతు ఖాతాకు ప్రత్యేక గుర్తింపు నంబరు జారీ చేయాలన్న ఉద్దేశంతో విశిష్ట సంఖ్య( యూనిక్ నంబరు) విధానానికి శ్రీకారం చుట్టారు. గ్రామం, మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా వారీగా ఒక సంఖ్యను జారీ చే శారు. ఈ తరుణంలో ఈ-పాస్‌పుస్తకం విధానం అమలులోకి వచ్చింది.
జిల్లాలో 3వేల దరఖాస్తులు...
జిల్లాలో 10 లక్షల హెక్టార్లకుపైగా సాగు భూములుండగా 6.50 లక్షల రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. ఈ-పాస్‌పుస్తకాల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 3వేలకు పైగా దరఖాస్తులు నమోదయ్యాయి. రైతులు మీ సేవా కేంద్రాలలో పాస్‌పుస్తకాలు కోసం దరఖాస్తులు చేస్తున్నారు. మ్యుటేషన్, పాస్‌పుస్తకం కోసం చేసిన 3వేల దరఖాస్తులలో 600 దరఖాస్తులను అధికారులు అంగీకరించారు.
సాంకేతిక ఇబ్బందులు...
జిల్లా వ్యాప్తంగా లక్షల్లో రైతు ఖాతాలు ఉన్నప్పటికీ దరఖాస్తులు తక్కువగా ఉండడానికి కూడా పలు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ సంఖ్య లేని రైతుల భూములకు సంబంధించిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించడం లేదు. ఆన్‌లైన్‌లో నమోదు కానీ సర్వే నంబర్లకు సంబంధించి చేసే దరఖాస్తుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఒక సర్వే నంబరులో సబ్ డివిజన్ చేసి ముగ్గురు, నలుగురు రైతులు ఉండి ఉంటే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించడం లేదు. ప్రారంభంలో మరిన్ని ఇబ్బందులు ఉన్నా ప్రస్తుతం వీటిలో చాలా వరకు పరిష్కరించినట్లు చెబుతున్నారు. ఈ విధానాన్ని సరళతరం చేయాలని రైతులు కోరుతున్నారు. దీనికి తోడు దీనికి సంబంధించిన సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెన్నై నుంచి పాస్‌పుస్తకం..
ఈ-పాస్‌పుస్తకాలను చెన్నైలో ముద్రించి రైతులకు అందజేస్తున్నారు. ఇవి అత్యంత ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందినవిగా చెబుతున్నారు. పాస్‌పుస్తకానికి దరఖాస్తు చేసిన నాటి నుంచి సుమారు రెండు నెలల వ్యవధి వరకు రైతులకు ఇవి చేరడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 100 మంది రైతులకు మాత్రమే ఈ-పాస్‌పుస్తకాలు అందాయి. తొలుత మీ-సేవా కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తులను సంబంధిత తహశీల్దారు పరిశీలించి అర్హమైన దరఖాస్తు అయితే 45 రోజుల్లోగా ఫారం-8ని జారీ చేయాలి. అభ్యంతరాలను తెలిపేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఫారం-8ను ప్రదర్శించాలి.
అనంతరం పాస్‌పుస్తకం కోసం అంతర్జాలంలో ఆమోదించాలి. అనంతరం పాస్‌పుస్తకం తపాలా ద్వారా కార్యాలయానికి చేరుతుంది. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి సంతకం చేశాక రైతుకు అందజేయాలి. సబ్‌డివిజన్ కాని భూములను నోషనల్ సబ్‌డివిజన్ విధానం ద్వారా చేసేందుకు తహశీల్దార్లకు అధికారం కల్పించారు. ఒక సర్వే నంబరులోని భూమిలో నలుగురు రైతులు ఉండి ఒక్కరే దరఖాస్తు చేస్తే మిగిలిన ముగ్గురు రైతులకు ఇందుకు సంబంధించిన సమాచారం విధిగా అందించాలి. పాస్‌పుస్తకం ఆన్‌లైన్‌లో వచ్చినా టైటిల్ డీడ్‌ను మాత్రం ఆర్డీవో ఎప్పటి మాదిరిగానే జారీ చేస్తారు.
పాస్‌కాని ‘ఈ’ పుస్తకం!
Published Thu, Feb 12 2015 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM
Advertisement
Advertisement