
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టెలికం నెట్‌వర్క్ కవరేజీ ఉన్న నేపథ్యంలో కంపెనీలు సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం దాదాపుగా లేదని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచ్చర్ వ్యాఖ్యానించారు.
ప్రజలకు టెలికం కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉన్న చోట్ల లేదా అస్సలు లేని కనెక్టివిటీనే లేని భౌగోళిక ప్రాంతాల్లో, చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటివి కావాలి తప్ప భారత్‌లో అనవసరమని తెలిపారు. కంపెనీలు తమ ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలైన అవసరాల కోసం, నేరుగా టెలికం శాఖ నుంచి స్పెక్ట్రంను తీసుకుని, సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కొచ్చర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి బదులుగా పారిశ్రామిక వృద్ధికి దోహదపడే టెలికం మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ భారత్ నిధికి మరింతగా నిధులను సమకూర్చగలిగితే ఇంకా కనెక్టివిటీ అంతగా లేని ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కొచ్చర్ పేర్కొన్నారు.