Telco
-
చైతన్య భారతి: జె.ఆర్.డి.టాటా / 1904–1993
1992 మార్చిలో జరిగిన ఓ సన్మాన సభలో జె.ఆర్.డి టాటా మాట్లాడుతూ.. ‘‘వచ్చే శతాబ్దంలో భారతదేశం ఆర్థిక అగ్రరాజ్యం అవుతుందని ఓ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త అన్నారు. దేశం ఆర్థికంగా అగ్రరాజ్యం అవాలని నేను కోరుకోవడం లేదు. ఇది ఆనందమయ దేశం కావాలని కోరుకుంటున్నా..’’ అని అన్నారు. ఆయన జీవితం దాదాపు 20వ శతాబ్దం మొత్తానికీ విస్తరించింది. రైట్ సోదరులు తొలిసారిగా విమానం కనిపెట్టిన తర్వాత కొద్ది రోజులకే ఆయన జన్మించారు. 1991లో మన్మోహన్ సింగ్ సరళీకరణను ప్రవేశపెట్టడాన్ని కూడా టాటా వీక్షించారు. గగన విహారమనేది ధనికులకే పరిమితమైన రోజుల్లో 1932లో ఆయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ప్రపంచంపై నాజీలు దౌర్జన్యాలు సాగిస్తున్న రోజుల్లో యుద్ధం తర్వాత దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించారు. జె.డి . బిర్లా, కస్తూర్భాయ్ లాల్‌భాయ్ లాంటి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి మాట్లాడారు. ఫలితంగా ‘బాంబే ప్లాన్’ సిద్ధమైంది. 1945లో ఆయన ‘టెల్కో’ను ప్రారంభించారు. దేశం కోసం ఓ ప్రతిష్ఠాత్మకమైన ఇంజనీరింగ్ సంస్థను ప్రారంభించాలని ఆయన ఆలోచన. జె.ఆర్.డి. 1948లో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తొలి ఏషియన్ ఎయిర్ లైన్ అదే! టాటా సంస్థతో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం అందుకు సమ్మతించింది. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు బండికి రెండు చక్రాల లాగా వ్యవహరించాలని ఆయన భావన. ‘‘మీరు ఎవరికైనా నాయకత్వం వహించాలీ అంటే వారి పట్ల ప్రేమతో ఆ పని చేయాలి’’ అని ఆయన అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో, హోమీ భాభా భారతదేశంలో చిక్కుబడిపోయారు. దాంతో కేంబ్రిడ్జిలో చేస్తున్న పనిని భారత్‌లోనే భాభా కొనసాగించుకునేందుకు వీలుగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ‘కాస్మిక్ ఎనర్జీ’ పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని టాటా ప్రారంభించిన సంగతి చాలామందికి తెలియదు. నాలుగేళ్ల తరువాత ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్’ అనే భాభా ప్రణాళికకు ఆయన ఊతమిచ్చారు. చనిపోడానికి 20 నెలల ముందు టాటాకు భారత రత్న పురస్కారం లభించింది. – స్వర్గీయ ఆర్.ఎం.లాలా, టాటా వారసత్వ చరిత్రకారుడైన జర్నలిస్టు -
త్వరలో 5జీ నెట్వర్క్.. అందుబాటులో ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఊరిస్తోన్న 5 జీ నెట్వర్క్ సేవలు మరింత ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు రావడం మినహా.. అసలు 5జీ నెట్వర్క్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు మొబైల్ కంపెనీలో ఎడాపెడా 5జీ హ్యాండ్సెట్లను రిలీజ్ చేస్తూ మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. నవంబరులోపే 5జీ ట్రయల్స్ కోసం 2021 మే నెలలో ప్రభుత్వం టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్టీఎల్లు అనుమతి పొందాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం నవంబర్‌లోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. గడువు పెంచండి నవంబరు సమీపిస్తుండటంతో ఇక కమర్షియల్‌గా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అశించిన వారికి నిరాశే ఎదురైంది. నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి చేయలేకపోయామని, ట్రయల్స్‌కి మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కోలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కారణం అదేనా 5జీ ట్రయల్స్‌కి సంబంధించి చైనా తయారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించద్దని టెల్కోలకి కేంద్రం సూచించింది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ డాట్ తదితర ఎక్విప్మెంట్ను ఉపయోగిస్తే పర్వాలేదని పేర్కొంది. దీంతో టెల్కోలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యమైంది. ఫలితంగా నవంబరులోగా పూర్తి స్థాయిలో ట్రయల్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది టెలికం కంపెనీలో కోరినట్టు మరోసారి ట్రయల్స్ గడువు పెంచితే 5 జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు 2022 ఏప్రిల్–జూన్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వోడఫోన్ ఐడియా చేపట్టిన ట్రయల్స్‌లో నెట్ స్పీడ్ 3.7 గిగాబైట్ పర్ సెకండ్‌గా రికార్డు అయ్యింది. చదవండి:ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట -
ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బిగ్ బూస్ట్ ! పీఎల్ఐకి ఒకే చెప్పిన కేంద్రం
Production-Linked Incentive scheme: కరోనా కాటుకు తోడు చిప్సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. పీఎం అధ్యక్షతన సమావేశం వివిధ రంగాలకు ఉత్పత్తి అధారిత ప్రోత్సహకాలు అందించేందుకు కేంద్ర కేబినేట్ ప్రధానీ మోదీ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహన తయారీ, వాహన విడిభాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందివ్వాలంటూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ. 26,058 కోట్లు కేటాయింపు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టెక్నాలజీలో మార్పులు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ విధానం ద్వారా భారత్‌లోకి ఆధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ వస్తుందని కేబినేట్ అభిప్రాయపడింది. పీఎల్ఐ విధానం వల్ల కొత్తగా రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది. అంతేకాదు అదనపు ఉత్పత్తి విలువ రూ. 2.3 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. కేబినేట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు - డ్రోన్ల తయారీలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ. 5,000 కోట్లు పెట్టబడులు రావడంతో పాటు రూ. 1,500 కోట్ల మేర అదనపు ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఈ సెక్టార్‌కి ప్రోత్సహకాలు అందించేందుకు రూ. 120 కోట్ల కేటాయింపులు. - పీఎల్ఐ వల్ల భారత్‌లో తయారీ సామర్థ్యం పెరుగుతుంది. చైనాకు పోటీగా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బలపడే అవకాశం - పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల తయారీలో భారత్‌ను ముందువరుసలో నిలబెడుతుంది - ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పీఎల్ఐ బిగ్ బూస్ట్‌లా మారుతుంది - మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొత్తగా 7.6 లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుంది - అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ వాటా కేవలం 2 శాతంగా ఉందని, తాజా నిర్ణయంతో అది పెరుగుతుంది. - టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం - ఏజీఆర్ బకాయిలకు సంబంధించి నాలుగేళ్ల పాటు టెల్కోలకు మారటోరియం విధించింది. చదవండి : ఆర్థికమంత్రి హెచ్చరికలు.. ఒత్తిడిలో ఇన్ఫోసిస్.. నేడు ఆఖరు! -
సత్తా చాటిన రిలయన్స్ జియో
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సబ్స్క్రైబర్లు కోరుకునే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌లో ఏపీ టెలికాం సర్కిల్లో రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో 1.46 లక్షలకు పైగా నూతన మొబైల్ సబ్‌స్క్కైబర్లు చేరారు. ట్రాయ్ వెల్లడించిన టెలికాం సబ్‌స్ర్కైబర్ డేటా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలతో కూడిన ఉమ్మడి ఏపీ టెలికాం సర్కిల్లో జూన్‌లో చేరిన నూతన సబ్‌స్క్కైబర్లతో మొత్తం జియో మొబైల్ సబ్‌స్క్కైబర్ల సంఖ్య 3.10 కోట్లు దాటింది. ఈ సమయంలో అన్ని ఇతర టెలికాం ఆపరేటర్ల సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గుముఖం పట్టగా జియో సబ్‌స్క్కైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో వొడాఫోన్ ఐడియా 3 లక్షల మందికి పైకి సబ్స్క్రైబర్లను కోల్పోగా, ఎయిర్టెల్ 68,411, బీఎస్ఎన్ఎల్ 31,954 మందిని కోల్పోయిందని ట్రాయ్ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. చదవండి : రిలయన్స్ జియో చేతికి పబ్జీ ఇక ఈ ఏడాది జూన్‌లో 45 లక్షల నూతన సబ్స్క్రైబర్లతో మొత్తం 39.72 కోట్ల సబ్‌స్క్కైబర్ బేస్‌తో జాతీయ మార్కెట్లోనూ జియో తన ప్రాబల్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. వొడాఫోన్ ఐడియా ఇదే నెలలో వరుసగా ఎనిమిదో నెలలోనూ 48 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 17 లక్షల కస్టమర్లను, భారతి ఎయిర్టెల్ 11 లక్షల సబ్‌స్ర్కైబర్లనూ కోల్పోయాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 34.8 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించగా, 27.8 శాతం మార్కెట్ వాటాతో ఎయిర్టెల్, 26.8 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియాలు ఆ తర్వాతి స్ధానాల్లో నిలిచాయని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. -
టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టెలికాం విభాగం (డాట్) మరోషాక్ ఇచ్చింది. రాత్రి 11. 59 నిమిషాల్లోపు బకాయిలు చెల్లించాలని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం గడువు విధించింది. శుక్రవారం అర్థరాత్రి లోపు మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. బకాయిల వసూళ్లపై సుప్రీంకోర్టు డాట్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తమకు ఉపశమనం లభిస్తుందని ఎదురు చూస్తున్న టెల్కోలకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా వోడాఫోన్‌ఐడియాకు ఈ సమయంలో బకాయిలు చెల్లించడం తలకుమించిన భారమే. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వోడాఫోన్ ఐడియా షేరు భారీగా నష్టపోయింది. కాగా ఏజీఆర్ బకాయిల విషయంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. రూ .1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు చెల్లించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు వారిపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని సుప్రీం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొత్తం టెలికాం విభాగానికి రూ .88,624 కోట్లు చెల్లించాల్సివుంది. రిలయన్స్ జియో రూ.177 కోట్లను ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం -
టెల్కోల ఆఫర్లతో ఖజానాకు రూ.800 కోట్ల నష్టం
⇒ టారిఫ్ ఆర్డర్లను పునఃసమీక్షించాలి ⇒ ట్రాయ్‌కు టెలికం శాఖ సూచన న్యూఢిల్లీ: టెల్కోలు అందించే ప్రమోషనల్ టారిఫ్‌ల కాలపరిమితి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ సూచించారు. ఇలాంటి ఆఫర్ల వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 800 కోట్ల మేర ఆదాయానికి గండి పడిందని, టెలికం పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు. ఇటు ప్రభుత్వ ఆదాయాలు, అటు టెలికం రంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టారిఫ్ ఆర్డర్లను అత్యవసరంగా పునఃసమీక్షించాల్సి ఉందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మకు ఫిబ్రవరి 23న రాసిన లేఖలో దీపక్ పేర్కొన్నారు. టారిఫ్లపరమైన పోటీతో (ముఖ్యంగా జియో ఉచిత వాయిస్, డేటా సేవలు) టెలికం రంగం కుదేలవుతుండటంపై ట్రాయ్‌ని టెలికం కమిషన్ వివరణ కోరిన నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. లైసెన్సు ఫీజుల రూపంలో జూన్ క్వార్టర్లో రూ. 3,975 కోట్లు ప్రభుత్వానికి రాగా.. డిసెంబర్ క్వార్టర్లో ఇది రూ. 3,186 కోట్లకు ఏ విధంగా తగ్గిపోయిందన్నది లేఖలో దీపక్ వివరించారు. ప్రమోషనల్ టారిఫ్‌లు ఏ రూపంలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ 90 రోజులకు మించి ఆఫర్ చేయకూడదంటూ 2002 జూన్‌లోనూ, 2008 సెప్టెంబర్లోను ట్రాయ్ తాను ఇచ్చిన ఆదేశాలను తానే పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. -
బ్యాంక్ ఖాతాదారులకు టెల్కోల ఊరట
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ కారణంగా టెలికాం సంస్థలు వినియోగదారులకు మరో వెసులుబాటును కల్పించాయి. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో డిసెంబర్ 31 దాకా మొబైల్ బ్యాంకింగ్ పై వసూలు చేసే చార్జీలను రద్దు చేసింది. ఏ అదనపు ఖర్చు లేకుండా ఫీచర్ ఫోన్ల లో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రజలకు మరింత వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మూడు ప్రధాన టెలికాం కంపెనీలు అంగీకారం తెలిపినట్టు వరుస ట్వీట్లలో వెల్లడించారు. ముఖ్యంగా యూఎస్ఎస్డీ చార్జీలుగా పిలువబడే మొబైల్ బ్యాంకింగ్ సేవలను టెలికాం ఆపరేటర్లు ఉచితంగా అందించనున్నట్టు ట్వీట్ లో తెలిపారు. సామాన్యులకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యం, కరెన్సీ కష్టాలను తగ్గించడంకోసం డిసెంబర్ 31, 2016 వరకు ఈ చార్జీలను రద్దుచేయడానికి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. డీమానిటైజేషన్ సమయంలో వినియోగదారుల సౌలభ్యంకోసం అన్ని ఎస్ఎస్డి ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు చార్జీలను డిసెంబర్ 31 వరకు మాఫీ చేసినట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈమేరకు వోడాఫోన్ ఇండియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ కూడా ఒక ప్రకటన చేశారు. మరోవైపు ట్రాయ్ కూడా షార్ట్ కోడ్ మెసేజ్ చార్జీలను కూడా భారీగా కోత పెట్టనుంది. ఇప్పటివరకూ వసూలు చేస్తున్న రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 31 తరువాత ఈ చార్జీలను గరిష్టంగా 50పైసలు వసూలు చేయనున్నట్టు ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. 3/ telecom operators have decided to waive off charges for mobile banking services till 31st December 2016.@DoT_India — Manoj Sinha (@manojsinhabjp) November 22, 2016 -
డేటా పరిమితి, వేగాన్ని కస్టమర్లకు చెప్పాల్సిందే
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ: మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్లకు సంబంధించి డేటా వినియోగ పరిమితిని కస్టమర్లకు తప్పకుండా తెలియజేయాలని టెలికం కంపెనీలను నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అదేవిధంగా ‘పరిమితి దాటిన తర్వాత(ఫెయిర్ యూసేజ్ విధానం) కనెక్షన్ స్పీడ్ ఎంతకు తగ్గుతుందన్న విషయాన్ని కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఫెయిర్ యూసేజ్ ప్రకారం... ఉదాహరణకు ఒక కస్టమర్ అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకున్నాడనుకుందాం. నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కంటే అధికంగా డౌన్లోడ్ పరిమితి 2 జీబీగా టెల్కో నిర్ణయిస్తే... సంబంధిత బిల్లింగ్ వ్యవధిలో కస్టమర్ వినియోగం ఈ పరిమితిని గనుక మించిపోతే, ఆటోమేటిక్‌గా మిగతా కాలానికి స్పీడ్‌ను టెల్కోలు తగ్గించేసే అవకాశం ఉంది. ఫిక్స్డ్(వైర్‌లైన్) బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీని వర్తింపజేశాక కనీస స్పీడ్ 512 కేబీపీఎస్ కంటే తగ్గకూడదని ట్రాయ్ తేల్చిచెప్పింది. టెల్కోలు డేటా లిమిట్ ఎంతవరకూ చేరిందనే(50%, 90%, 100%) సమాచారాన్ని కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఈ-మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది. -
టెల్కోలకు ట్రాయ్ పిలుపు..
జియోతో వివాదంపై నేడు ఢిల్లీలో కీలక భేటీ న్యూఢిల్లీ: టెల్కోల మధ్య వివాదం ట్రాయ్ ముందుకు చేరింది. తమ కస్టమర్ల కాల్స్‌కు ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ కనెక్టివిటీ కల్పించడం లేదంటూ రిలయన్స్ జియో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు శుక్రవారం ఢిల్లీలో ట్రాయ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంటర్ కనెక్టివిటీ (కాల్స్‌కు అనుసంధానం) అంశంపై ఈ సమావేం ఏర్పాటు చేసినట్టు ట్రాయ్ అధికార వర్గాలు తెలిపాయి. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటర్ కనెక్షన్‌పై ట్రాయ్ వద్ద తేల్చుకోవాలని, ఈ అంశం ట్రాయ్ పరిధిలోకి వస్తుందని టెలికం శాఖ జియో, ఇతర టెల్కోలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. జియో ఆరోపణ ఇదీ వాణిజ్య సేవల ప్రారంభానికి వీలుగా.... మొబైల్ సేవలకు సంబంధించి 12,727 నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ పాయింట్లు, ఎస్టీడీ కాల్స్ కోసం 3,068 ఇంటర్ కనెక్షన్ పాయింట్లు అవసరం అని జియో ట్రాయ్‌కు ప్రతిపాదన సమర్పించింది. అయితే, తమకు ఇతర టెలికం కంపెనీలు అవసరమైన దాంట్లో 4 శాతం మేరే పోర్ట్‌లను అందుబాటులో ఉంచినట్టు ఆరోపించింది. ఫలితంగా ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లకు వెళ్లే 65 శాతం కాల్స్ విఫలమైనట్టు పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తగినంత అనుసంధానత కల్పించని ప్రధాన ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ని జియో కోరింది. సీఓఏఐ వాదన ఇదీ: జియో కస్టమర్లకు అవసరమైన దాని కంటే పది రెట్లు అదనంగా కనెక్టివిటీ సామర్థ్యాన్ని కల్పించామని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) అంటోంది. అయితే, జియో ఉచిత కాల్స్, ఉచిత డేటా సర్వీసుల కారణంగా రద్దీ నెలకొనడమే సమస్యకు కారణంగా పేర్కొంది. తమ సంఘంలో సభ్యులైన ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా 400 ఇంటర్ కనెక్షన్ పోర్ట్‌లను ఇచ్చాయని, ఇవి ఇతర టెలికం కంపెనీల సేవలను వినియోగించుకునే 2 కోట్ల కస్టమర్లకు అనుసంధానం కల్పించగలవని సీఓఏఐ తెలి పింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉచిత అపరిమిత కాల్స్, డేటా సేవలు, జనవరి నుంచి పూర్తి స్థాయి వాణిజ్య సేవలు అందించనున్నట్టు జియో ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఈ ఉచిత సేవల కాలంలో 1.5 కోట్ల కస్టమర్లను సొంతం చేసుకోనున్నట్టు జియో తెలిపింది. కాగా, రిలయన్స్ జియో పై సీఓఏఐ 2 రోజుల క్రితమే ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. -
‘జియో’ను ఎదుర్కోవడం ఎలా..?
కొత్త వ్యూహాల్లో టెల్కోలు... వినూత్నమైన ప్లాన్ల ప్రకటన ♦ డేటా చార్జీల్లో కోతలు తప్పవు ♦ బండిల్ ఆఫర్ల జోరు పెరుగుతుంది ♦ బ్రోకరేజ్ సంస్థల నివేదికలు న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రివ్యూ ఆఫర్‌తో టెలికం రంగంలోని దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉందంటే.. జనవరిలో పూర్తిస్థాయిలో జియో మార్కెట్లోకి అడుగుపెడితే? దీనికి సమాధానమివ్వడం కొంత కష్టమే. జియో ప్రివ్యూ ఆఫర్ దెబ్బకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఉన్న డేటా ప్యాక్స్‌కు అదనపు డేటాను అందిస్తున్నాయి. కొత్త యూజర్లను ఆకట్టుకోవడం పక్కన ఉంచితే.. ఉన్నవారిని జారిపోకుండా చూసుకోవడానికి తెగ శ్రమిస్తున్నాయి. దీంతో టెల్కోలు ఇప్పటికే డేటాతోపాటు ఉచిత కాల్స్‌తో కూడిన వినూత్నమైన ఆఫర్లనూ ప్రకటిస్తున్నాయి. టెల్కోలు.. హ్యాండ్సెట్స్ కంపెనీలతో కలసి ప్రకటించే బండిల్ ఆఫర్ల జోరు పెరుగుతుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా సేవర్ ప్యాక్స్ ధర మరింత తగ్గొచ్చు! ప్రస్తుతం ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు వాటి ప్రి-పెయిడ్ ఇంటర్నెట్ ప్యాక్స్‌పై అధిక డేటాను అందిస్తున్నాయని యూబీఎస్ పేర్కొంది. తమ లెక్కల ప్రకారం సాంప్రదాయ ప్లాన్స్‌తో పోలిస్తే మెగా సేవర్ ప్యాక్స్ త్వరలో 35-40 శాతం మరింత తక్కువ ధరకే అందుబాటులో రావొచ్చని తెలిపింది. ‘రిలయన్స్ జియో రాకతో 4జీ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. దీనికి తక్కువ డేటా చార్జీలతో కూడిన ప్లాన్స్, చౌక ధరల 4జీ హ్యాండ్సెట్స్ వంటి అంశాలు కారణంగా నిలుస్తాయి’ అని వివరించింది. ఉచిత కాలింగ్‌తో బండిల్ ప్లాన్స్? జియో సేవలు త్వరలో ప్రారంభం కానుండటంతో ఎయిర్టెల్ సహా ఇతర కంపెనీలు డేటా చార్జీలను తగ్గించే అవకాశముందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. టెల్కోలు డేటాతోపాటు ఉచిత కాలింగ్ ఫీచర్‌తో కూడిన బండిల్ ప్లాన్స్ అందించొచ్చని పేర్కొంది. జియోతో పోటీపడటానికి ఇతర కంపెనీలు ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తాయో చూడాల్సి ఉందని వివరించింది. కాగా టెల్కోలు ప్రస్తుతం రూ.9 నుంచి (20 ఎంబీ, 28 రోజుల వ్యాలిడిటీ) డేటా ప్లాన్స్‌ను అందిస్తున్నాయని క్రెడిట్ సూచీ పేర్కొంది. దీనికి మార్కెట్లోకి కొత్త సంస్థ అడుగుపెట్టడం కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఎయిర్టెల్ వ్యూహాలు మెరుగు రిలయన్స్ జియో సేవల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్టెల్ వ్యవహరిస్తోన్న విధానాలు మెరుగ్గా వున్నాయని యూబీఎస్ పేర్కొంది. టారిఫ్ ధరలను తగ్గించకుండా అదనపు డేటా అందించడం, రూ.1,498 ముందస్తు చెల్లింపుతో రూ.51లకే 1 జీబీ డేటా వంటి ప్లాన్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కస్టమర్లను నిలుపుకోవడానికి ఇలాంటి చర్యలు దోహదపడతాయని తెలిపింది. వీటి వ ల్ల డేటా వినియోగం కూడా పెరుగుతుందని పేర్కొంది. జియోని నిలువరిస్తాయా? రిలయన్స్ జియోని ప్రస్తుత దిగ్గజ టెల్కోలు ఎలా ఎదుర్కొంటాయనేది ఆసక్తికరంగా మారిందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. జియో ఇప్పటికే రూ.50లకే 1 జీబీ డేటా వంటి పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ‘సంస్థ ప్రివ్యూ ఆఫర్ కింద ఉచిత సిమ్‌తో 4 నెలలు అపరిమిత డేటా, వాయిస్ సేవలను అందిస్తోంది. దీనికి మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో జియో యూజర్ల సంఖ్య 3.5 కోట్లకు చేరొచ్చు’ అని వివరించింది. దీని దెబ్బకి ఇతర టెల్కోల డేటా వినియోగం వృద్ధి 70% నుంచి 50 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. నాణ్యమైన టెలికం సేవలు కావాలి: సర్వే న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకి టెలికం కంపెనీలు టారిఫ్ ధరలపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించాయి. అందులో భాగంగానే టారిఫ్ ధరలను తగ్గిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తక్కువ టారిఫ్ ధరలు మంచిదేనని, వీటితోపాటు టెల్కోలు మెరుగైన సేవలను అందిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం ‘లోకల్‌సర్కిల్’ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సర్వే ప్రకారం.. టెల్కోల డేటా సర్వీసులు చాలా పేలవంగా ఉన్నాయని 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక వాయిస్ సేవలు సంతృప్తికరంగా లేవని 27 శాతం మంది తెలిపారు. కాల్ డ్రాప్స్ విషయానికి వస్తే.. 53 శాతం మంది వారి ఆపరేటర్‌కు యావరేజ్ రేటింగ్‌ను ఇచ్చారు. ఇక టెలికం సంబంధిత సమస్యలను చక్కబెట్టడానికి నియంత్రణ సంస్థ ట్రాయ్ తగినంత కృషి చేయలేదని దాదాపు 77 శాతం మంది అభిప్రాయపడ్డారు. డౌన్లోడింగ్ వ్యయం ఎక్కువగా ఉందని 53 శాతం పేర్కొన్నారు. -
కాల్ డ్రాప్‌లపై టెల్కోలకు జనవరి 6 దాకా ఊరట
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌కి పరిహారం విషయంలో టెల్కోలకు కొంత ఊరట లభించింది. తదుపరి విచారణ తేది జనవరి 6 దాకా ఈ అంశానికి సంబంధించి ఆపరేటర్లను ఒత్తిడి చేసే చర్యలు తీసుకోబోమని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనలు మాత్రం ముందుగా నిర్ణయించినట్లు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల కాల్ డ్రాప్ అయిన పక్షంలో యూజర్లకు రూ. 1 పరిహారంగా చెల్లించాలన్న ట్రాయ్ నిబంధనలను సవాలు చేస్తూ టెల్కోలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్, ఎయిర్టెల్, ఆర్‌కామ్ తదితర 21 టెల్కోలు ఇందులో ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రకారం నూటికి నూరుపాళ్లు కాల్ డ్రాప్ సమస్య ఉండని నెట్వర్క్ ఏర్పాటు అసాధ్యమని తెలిసీ ట్రాయ్ పరిహారం నిర్ణయం తీసుకుందని ఆపరేటర్ల తరఫు లాయర్ హరీశ్ సాల్వే పేర్కొన్నారు. అయితే, సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తీసుకున్న మేరకే అక్టోబర్ 16న నిబంధనలను ప్రకటించడం జరిగిందని, టెల్కోల స్థూల ఆదాయంలో పరిహార భారం కేవలం ఒక్క శాతం కన్నా తక్కువే ఉండొచ్చని జస్టిస్ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన బెంచ్‌కి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ తెలిపారు. వాదోపవాదాలు విన్న మీదట కేసు తదుపరి విచారణను బెంచ్ జనవరి 6 దాకా వాయిదా వేసింది. -
ఎంఎన్‌పీతో టెలికం సర్వీసులు మెరుగు
- టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) వల్ల టెల్కోల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, సర్వీసులు మెరుగుపడటంతో పాటు ప్రజలకు సాధికారత లభించగలదని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పూర్తి స్థాయి ఎంఎన్‌పీని మేలోనే ప్రారంభించాలని ముందుగా భావించినప్పటికీ టెలికం ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు జూలై 3 దాకా పొడిగించాల్సి వచ్చిందని బీఎస్ఎన్ఎల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ‘ఇకపై మీ మొబైల్ నంబరుకు మీరే యజమాని. మీరెక్కడికెళ్లినా మీ నంబరును మార్చనక్కర్లేదు’ అని మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌ను ఉద్దేశించి ఆయన చెప్పారు. మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు వీలు కల్పించే పూర్తి స్థాయి ఎంఎన్‌పీ.. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటిదాకా ఈ సదుపాయం కేవలం ఒక టెలికం సర్కిల్ పరిధికి మాత్రమే పరిమితమై ఉండేది. ఈ సదుపాయం వల్ల వేరే టెలికం సర్కిల్‌లోకి నంబరు మార్చుకుంటే సదరు సర్కిల్లో రోమింగ్ చార్జీలు భారం ఉండదు. అయితే, టెలికం సర్కిల్ పరిధి వెలుపల మాత్రం రోమింగ్ చార్జీలు వర్తిస్తాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, యూనినార్, టాటా డొకొమో తదితర టెలికం సంస్థలన్నీ ఎంఎన్‌పీని అమల్లోకి తెచ్చాయి.