టెల్కోలకు ట్రాయ్ పిలుపు..
జియోతో వివాదంపై నేడు ఢిల్లీలో కీలక భేటీ
న్యూఢిల్లీ: టెల్కోల మధ్య వివాదం ట్రాయ్ ముందుకు చేరింది. తమ కస్టమర్ల కాల్స్‌కు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కనెక్టివిటీ కల్పించడం లేదంటూ రిలయన్స్ జియో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు శుక్రవారం ఢిల్లీలో ట్రాయ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంటర్ కనెక్టివిటీ (కాల్స్‌కు అనుసంధానం) అంశంపై ఈ సమావేం ఏర్పాటు చేసినట్టు ట్రాయ్ అధికార వర్గాలు తెలిపాయి. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటర్ కనెక్షన్‌పై ట్రాయ్ వద్ద తేల్చుకోవాలని, ఈ అంశం ట్రాయ్ పరిధిలోకి వస్తుందని టెలికం శాఖ జియో, ఇతర టెల్కోలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
జియో ఆరోపణ ఇదీ
వాణిజ్య సేవల ప్రారంభానికి వీలుగా.... మొబైల్ సేవలకు సంబంధించి 12,727 నెట్‌వర్క్ ఇంటర్ కనెక్షన్ పాయింట్లు, ఎస్టీడీ కాల్స్ కోసం 3,068 ఇంటర్ కనెక్షన్ పాయింట్లు అవసరం అని జియో ట్రాయ్‌కు ప్రతిపాదన సమర్పించింది. అయితే, తమకు ఇతర టెలికం కంపెనీలు అవసరమైన దాంట్లో 4 శాతం మేరే పోర్ట్‌లను అందుబాటులో ఉంచినట్టు ఆరోపించింది. ఫలితంగా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లకు వెళ్లే 65 శాతం కాల్స్ విఫలమైనట్టు పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తగినంత అనుసంధానత కల్పించని ప్రధాన ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ని జియో కోరింది.
సీఓఏఐ వాదన ఇదీ: జియో కస్టమర్లకు అవసరమైన దాని కంటే పది రెట్లు అదనంగా కనెక్టివిటీ సామర్థ్యాన్ని కల్పించామని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) అంటోంది. అయితే, జియో ఉచిత కాల్స్, ఉచిత డేటా సర్వీసుల కారణంగా రద్దీ నెలకొనడమే సమస్యకు కారణంగా పేర్కొంది. తమ సంఘంలో సభ్యులైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా 400 ఇంటర్ కనెక్షన్ పోర్ట్‌లను ఇచ్చాయని, ఇవి ఇతర టెలికం కంపెనీల సేవలను వినియోగించుకునే 2 కోట్ల కస్టమర్లకు అనుసంధానం కల్పించగలవని సీఓఏఐ తెలి పింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉచిత అపరిమిత కాల్స్, డేటా సేవలు, జనవరి నుంచి పూర్తి స్థాయి వాణిజ్య సేవలు అందించనున్నట్టు జియో ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఈ ఉచిత సేవల కాలంలో 1.5 కోట్ల కస్టమర్లను సొంతం చేసుకోనున్నట్టు జియో తెలిపింది. కాగా, రిలయన్స్ జియో పై సీఓఏఐ 2 రోజుల క్రితమే ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.