టెల్కోల ఆఫర్లతో ఖజానాకు రూ.800 కోట్ల నష్టం
⇒ టారిఫ్ ఆర్డర్లను పునఃసమీక్షించాలి
⇒ ట్రాయ్‌కు టెలికం శాఖ సూచన
న్యూఢిల్లీ: టెల్కోలు అందించే ప్రమోషనల్ టారిఫ్‌ల కాలపరిమితి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ సూచించారు. ఇలాంటి ఆఫర్ల వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 800 కోట్ల మేర ఆదాయానికి గండి పడిందని, టెలికం పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు.
ఇటు ప్రభుత్వ ఆదాయాలు, అటు టెలికం రంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టారిఫ్ ఆర్డర్లను అత్యవసరంగా పునఃసమీక్షించాల్సి ఉందని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మకు ఫిబ్రవరి 23న రాసిన లేఖలో దీపక్ పేర్కొన్నారు. టారిఫ్‌లపరమైన పోటీతో (ముఖ్యంగా జియో ఉచిత వాయిస్, డేటా సేవలు) టెలికం రంగం కుదేలవుతుండటంపై ట్రాయ్‌ని టెలికం కమిషన్ వివరణ కోరిన నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
లైసెన్సు ఫీజుల రూపంలో జూన్ క్వార్టర్‌లో రూ. 3,975 కోట్లు ప్రభుత్వానికి రాగా.. డిసెంబర్ క్వార్టర్‌లో ఇది రూ. 3,186 కోట్లకు ఏ విధంగా తగ్గిపోయిందన్నది లేఖలో దీపక్ వివరించారు. ప్రమోషనల్ టారిఫ్‌లు ఏ రూపంలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ 90 రోజులకు మించి ఆఫర్ చేయకూడదంటూ 2002 జూన్‌లోనూ, 2008 సెప్టెంబర్‌లోను ట్రాయ్ తాను ఇచ్చిన ఆదేశాలను తానే పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.