JS Deepak
-
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్
విలీన ప్రతిపాదనలు! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజాలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీన ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తీవ్రమైన పోటీతో నష్టాల్లో ఉన్న ఈ రెండింటిని విలీనం చేసే అంశాన్ని టెలికం విభాగ కార్యదర్శి జేఎస్ దీపక్ సారథ్యంలో రెండు–మూడు వారాల క్రితం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రతిపాదనల ప్రకారం తొలి దశలో ఎంటీఎన్ఎల్కి గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్‌లలో ఉన్న మొబైల్ కార్యకలాపాలను తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలో మొబైల్ కార్యకలాపాలు కొనుగోలు చేయడం మరో ప్రత్యామ్నాయమని సం బంధిత వర్గాలు పేర్కొన్నాయి. నష్టాల్లో ఉన్న ఎంటీఎన్ఎల్కు విలీనం సానుకూలమే అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్కు మాత్రం భారం కావొచ్చని, అలాగే సిబ్బం ది, జీతభత్యాలు మొదలైనవి సమస్యాత్మక అంశాలు కాగలవని వివరించాయి. గతంలో ప్రమోద్ మహాజన్ టెలికం మంత్రిగా పనిచేసినప్పుడు ఈ విలీన ప్రతిపాదన తొలిసారిగా తెరపైకి వచ్చింది. ఎంటీఎన్ఎల్ ప్రస్తుత రుణభారం రూ. 19,418 కోట్లుగాను, బీఎస్ఎన్ఎల్ రుణాలు రూ. 4,890 కోట్లుగాను ఉన్నాయి. -
టెల్కోల ఆఫర్లతో ఖజానాకు రూ.800 కోట్ల నష్టం
⇒ టారిఫ్ ఆర్డర్లను పునఃసమీక్షించాలి ⇒ ట్రాయ్‌కు టెలికం శాఖ సూచన న్యూఢిల్లీ: టెల్కోలు అందించే ప్రమోషనల్ టారిఫ్‌ల కాలపరిమితి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ సూచించారు. ఇలాంటి ఆఫర్ల వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 800 కోట్ల మేర ఆదాయానికి గండి పడిందని, టెలికం పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు. ఇటు ప్రభుత్వ ఆదాయాలు, అటు టెలికం రంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టారిఫ్ ఆర్డర్లను అత్యవసరంగా పునఃసమీక్షించాల్సి ఉందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మకు ఫిబ్రవరి 23న రాసిన లేఖలో దీపక్ పేర్కొన్నారు. టారిఫ్లపరమైన పోటీతో (ముఖ్యంగా జియో ఉచిత వాయిస్, డేటా సేవలు) టెలికం రంగం కుదేలవుతుండటంపై ట్రాయ్‌ని టెలికం కమిషన్ వివరణ కోరిన నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. లైసెన్సు ఫీజుల రూపంలో జూన్ క్వార్టర్లో రూ. 3,975 కోట్లు ప్రభుత్వానికి రాగా.. డిసెంబర్ క్వార్టర్లో ఇది రూ. 3,186 కోట్లకు ఏ విధంగా తగ్గిపోయిందన్నది లేఖలో దీపక్ వివరించారు. ప్రమోషనల్ టారిఫ్‌లు ఏ రూపంలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ 90 రోజులకు మించి ఆఫర్ చేయకూడదంటూ 2002 జూన్‌లోనూ, 2008 సెప్టెంబర్లోను ట్రాయ్ తాను ఇచ్చిన ఆదేశాలను తానే పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. -
పెద్ద టెల్కోలు 5 చాలు!
ప్రస్తుత స్థిరీకరణ మంచిదే: టెలికం కార్యదర్శి బార్సిలోనా: భారత్ టెలికం మార్కెట్లో అయిదు పెద్ద టెలికం కంపెనీలు ఉంటే సరిపోతుందని టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ రంగంలో జరుగుతున్న స్థిరీకరణ(కంపెనీల కొనుగోళ్లు, విలీనాలు)తో బరిలో అయిదు ప్రధాన కంపెనీలు మిగిలే అవకాశం ఉందన్నారు. తగినంత పోటీకి ఇవి సరిపోతాయని... దీనివల్ల స్పెక్ట్రం కూడా చిన్నచిన్నభాగాలుగా అయిపోకుండా ఉంటుందని దీపక్ పేర్కొన్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత వాయిస్ కాలింగ్ ఇతరత్రా ఆఫర్ల దెబ్బకు ఇతర టెల్కోలు సైతం టారిఫ్‌లను భారీగా తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చిన్న కంపెనీలు పెద్ద సంస్థల గూటికి చేరుతున్నాయి. వొడాఫోన్.. ఐడియాలో విలీనం అయ్యేందుకు సిద్ధం కాగా, టెలినార్ ఇండియాను ఎయిర్టెల్ కొనుగోలు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించడం తెలిసిందే. అనిల్ అంబానీ ఆర్‌కామ్ కూడా ఎయిర్‌సెల్‌తో విలీనానికి ఒప్పందం కుదుర్చుకుంది. ‘టెల్కోల ఆదాయం పడిపోతుండటం ఆందోళకరమైన అంశమే. అయితే, ఈ పరిస్థితి త్వరలో మారుతుంది. తాజాగా భారత్ టెలికం రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు లాభదాయకమే. టెలికం రంగంలో ప్రస్తుత స్థిరీకరణ పరిశ్రమకు మంచిదే. దీనివల్ల ప్రైవేటు రంగంలో నాలుగు, ప్రభుత్వ రంగంలో ఒక్కటి చొప్పున పెద్ద కంపెనీలు మిగులుతాయి. మన మార్కెట్‌కు ఇవి సరిపోతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.