బీఎస్‌ఎన్‌ఎల్–ఎంటీఎన్‌ఎల్
విలీన ప్రతిపాదనలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజాలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీన ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తీవ్రమైన పోటీతో నష్టాల్లో ఉన్న ఈ రెండింటిని విలీనం చేసే అంశాన్ని టెలికం విభాగ కార్యదర్శి జేఎస్ దీపక్ సారథ్యంలో రెండు–మూడు వారాల క్రితం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రతిపాదనల ప్రకారం తొలి దశలో ఎంటీఎన్‌ఎల్‌కి గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్‌లలో ఉన్న మొబైల్ కార్యకలాపాలను తీసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలో మొబైల్ కార్యకలాపాలు కొనుగోలు చేయడం మరో ప్రత్యామ్నాయమని సం బంధిత వర్గాలు పేర్కొన్నాయి. నష్టాల్లో ఉన్న ఎంటీఎన్‌ఎల్‌కు విలీనం సానుకూలమే అయినప్పటికీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రం భారం కావొచ్చని, అలాగే సిబ్బం ది, జీతభత్యాలు మొదలైనవి సమస్యాత్మక అంశాలు కాగలవని వివరించాయి. గతంలో ప్రమోద్ మహాజన్ టెలికం మంత్రిగా పనిచేసినప్పుడు ఈ విలీన ప్రతిపాదన తొలిసారిగా తెరపైకి వచ్చింది. ఎంటీఎన్‌ఎల్ ప్రస్తుత రుణభారం రూ. 19,418 కోట్లుగాను, బీఎస్‌ఎన్‌ఎల్ రుణాలు రూ. 4,890 కోట్లుగాను ఉన్నాయి.