ఎంఎన్‌పీతో టెలికం సర్వీసులు మెరుగు
- టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) వల్ల టెల్కోల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, సర్వీసులు మెరుగుపడటంతో పాటు ప్రజలకు సాధికారత లభించగలదని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పూర్తి స్థాయి ఎంఎన్‌పీని మేలోనే ప్రారంభించాలని ముందుగా భావించినప్పటికీ టెలికం ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు జూలై 3 దాకా పొడిగించాల్సి వచ్చిందని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ‘ఇకపై మీ మొబైల్ నంబరుకు మీరే యజమాని. మీరెక్కడికెళ్లినా మీ నంబరును మార్చనక్కర్లేదు’ అని మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌ను ఉద్దేశించి ఆయన చెప్పారు.
మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు వీలు కల్పించే పూర్తి స్థాయి ఎంఎన్‌పీ.. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటిదాకా ఈ సదుపాయం కేవలం ఒక టెలికం సర్కిల్ పరిధికి మాత్రమే పరిమితమై ఉండేది. ఈ సదుపాయం వల్ల వేరే టెలికం సర్కిల్‌లోకి నంబరు మార్చుకుంటే సదరు సర్కిల్‌లో రోమింగ్ చార్జీలు భారం ఉండదు. అయితే, టెలికం సర్కిల్ పరిధి వెలుపల మాత్రం రోమింగ్ చార్జీలు వర్తిస్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, యూనినార్, టాటా డొకొమో తదితర టెలికం సంస్థలన్నీ ఎంఎన్‌పీని అమల్లోకి తెచ్చాయి.