కాల్ డ్రాప్‌లపై టెల్కోలకు జనవరి 6 దాకా ఊరట
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌కి పరిహారం విషయంలో టెల్కోలకు కొంత ఊరట లభించింది. తదుపరి విచారణ తేది జనవరి 6 దాకా ఈ అంశానికి సంబంధించి ఆపరేటర్లను ఒత్తిడి చేసే చర్యలు తీసుకోబోమని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనలు మాత్రం ముందుగా నిర్ణయించినట్లు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
నెట్‌వర్క్ సమస్యల వల్ల కాల్ డ్రాప్ అయిన పక్షంలో యూజర్లకు రూ. 1 పరిహారంగా చెల్లించాలన్న ట్రాయ్ నిబంధనలను సవాలు చేస్తూ టెల్కోలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఆర్‌కామ్ తదితర 21 టెల్కోలు ఇందులో ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రకారం నూటికి నూరుపాళ్లు కాల్ డ్రాప్ సమస్య ఉండని నెట్‌వర్క్ ఏర్పాటు అసాధ్యమని తెలిసీ ట్రాయ్ పరిహారం నిర్ణయం తీసుకుందని ఆపరేటర్ల తరఫు లాయర్ హరీశ్ సాల్వే పేర్కొన్నారు.
అయితే, సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తీసుకున్న మేరకే అక్టోబర్ 16న నిబంధనలను ప్రకటించడం జరిగిందని, టెల్కోల స్థూల ఆదాయంలో పరిహార భారం కేవలం ఒక్క శాతం కన్నా తక్కువే ఉండొచ్చని జస్టిస్ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన బెంచ్‌కి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ తెలిపారు. వాదోపవాదాలు విన్న మీదట కేసు తదుపరి విచారణను బెంచ్ జనవరి 6 దాకా వాయిదా వేసింది.