బ్యాంక్ ఖాతాదారులకు టెల్కోల ఊరట
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ కారణంగా టెలికాం సంస్థలు వినియోగదారులకు మరో వెసులుబాటును కల్పించాయి. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో డిసెంబర్ 31 దాకా మొబైల్ బ్యాంకింగ్ పై వసూలు చేసే చార్జీలను రద్దు చేసింది. ఏ అదనపు ఖర్చు లేకుండా ఫీచర్ ఫోన్ల లో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రజలకు మరింత వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మూడు ప్రధాన టెలికాం కంపెనీలు అంగీకారం తెలిపినట్టు వరుస ట్వీట్లలో వెల్లడించారు.
ముఖ్యంగా యూఎస్ఎస్డీ చార్జీలుగా పిలువబడే మొబైల్ బ్యాంకింగ్ సేవలను టెలికాం ఆపరేటర్లు ఉచితంగా అందించనున్నట్టు ట్వీట్ లో తెలిపారు. సామాన్యులకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యం, కరెన్సీ కష్టాలను తగ్గించడంకోసం డిసెంబర్ 31, 2016 వరకు ఈ చార్జీలను రద్దుచేయడానికి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
డీమానిటైజేషన్ సమయంలో వినియోగదారుల సౌలభ్యంకోసం అన్ని ఎస్ఎస్డి ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు చార్జీలను డిసెంబర్ 31 వరకు మాఫీ చేసినట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈమేరకు వోడాఫోన్ ఇండియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ కూడా ఒక ప్రకటన చేశారు. మరోవైపు ట్రాయ్ కూడా షార్ట్ కోడ్ మెసేజ్ చార్జీలను కూడా భారీగా కోత పెట్టనుంది. ఇప్పటివరకూ వసూలు చేస్తున్న రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 31 తరువాత ఈ చార్జీలను గరిష్టంగా 50పైసలు వసూలు చేయనున్నట్టు ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.
3/ telecom operators have decided to waive off charges for mobile banking services till 31st December 2016.@DoT_India
— Manoj Sinha (@manojsinhabjp) November 22, 2016