Private Network
-
సొంత వ్యాపారం కోసమే స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటోందన్న విషయం వెలుగు చూసిన తర్వాత విశ్లేషకుల నుంచి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. వ్యాపార అవసరాల కోసమే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నట్టు ముందు చెప్పినట్టుగానే అదానీ గ్రూపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 5జీ స్పెక్ట్రమ్ కోసం మూడు టెలికం కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు వేశాయి. కానీ, అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ డేటా నెట్వర్క్స్ (ఏడీఎన్ఎల్) కేవలం రూ.212 కోట్లనే స్పెక్ట్రమ్ కొనుగోళ్లకు కేటాయించింది. తద్వారా 26 గిగాహెట్జ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్‌లో 20 ఏళ్ల కాలానికి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ వేలంలో అదానీ పెట్టుబడి 0.15 శాతంగానే ఉండడం గమనించాలి. తాము కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌తో ప్రైవేటు నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని, దాన్ని డేటా సెంటర్లు, గ్రూపులోని ఇతర కార్యకలాపాలు, అన్ని వ్యాపారాల కలబోతతో ఉండే సూపర్ యాప్ కోసం వినియోగించుకుంటామని అదానీ గ్రూపు పేర్కొంది. అదానీ గ్రూపు కీలక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, బీటూసీ వ్యాపారాల డిజిటైజేషన్ వేగవంతం చేయడానికి 5జీ స్పెక్ట్రమ్ సాయపడుతుందని అదానీ గ్రూపు ప్రకటన విడుదల చేసింది. -
ఎయిర్టెల్, టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా చేతులు కలిపాయి. 5జీ, ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్ సొల్యూషన్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అటు టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాయి. -
గ్రామాల్లోనూ వైఫై సేవలు
పోచమ్మమైదాన్ : ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ప్రజలకు సేవలందించేందుకు ముందుకు సాగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో మారుమూల గ్రామాలకు సైతం భారత్ సంచార్ నిగామ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పబ్లిక్ గార్డెన్, హన్మకొండ బస్టాండ్, వేయ్యిస్తంభాల దేవాలయం, భద్రకాళి, స్టేషన్‌రోడ్డు, మదనతుర్తి, పస్రాలలో వైఫై సేవలు అందిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా పెంచికల్‌పేట, జంగాలపల్లి, కల్లెడ, అన్నారం షరీఫ్, తీగరాజుపల్లి, రెడ్లవాడ, అలంకానిపేట, ముప్పారం, పెనుగొండ, చిన్నముప్పారంలలో గ్రామస్తుల సహకారంతో ఫైబర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో మార్చి 31 నాటికి ప్రజల భాగస్వామ్యంతో 300 గ్రామాల్లో వైఫై సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ముందుకుసాగుతున్నది. వారం రోజుల్లో సేవలు ప్రారంభం : పీజీఎం నరేందర్ మరో వారం రోజుల్లో మొదటి విడతలో భాగంగా పది గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వైఫై సేవలు ప్రారంభిస్తున్నాం. ఫైబర్ కేబుల్ ద్వారా ఈ సేవలను అందించనున్నాం. వైఫై సేవలను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే 3జీ సిమ్‌లను ఉచితంగా అందజేస్తాం. ప్రజలందరూ దీనిని ఉపయోగించుకోవాలి.