గ్రామాల్లోనూ వైఫై సేవలు
పోచమ్మమైదాన్ : ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రజలకు సేవలందించేందుకు ముందుకు సాగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో మారుమూల గ్రామాలకు సైతం భారత్ సంచార్ నిగామ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పబ్లిక్ గార్డెన్, హన్మకొండ బస్టాండ్, వేయ్యిస్తంభాల దేవాలయం, భద్రకాళి, స్టేషన్‌రోడ్డు, మదనతుర్తి, పస్రాలలో వైఫై సేవలు అందిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా పెంచికల్‌పేట, జంగాలపల్లి, కల్లెడ, అన్నారం షరీఫ్, తీగరాజుపల్లి, రెడ్లవాడ, అలంకానిపేట, ముప్పారం, పెనుగొండ, చిన్నముప్పారంలలో గ్రామస్తుల సహకారంతో ఫైబర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో మార్చి 31 నాటికి ప్రజల భాగస్వామ్యంతో 300 గ్రామాల్లో వైఫై సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ముందుకుసాగుతున్నది.
వారం రోజుల్లో సేవలు ప్రారంభం : పీజీఎం నరేందర్
మరో వారం రోజుల్లో మొదటి విడతలో భాగంగా పది గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ వైఫై సేవలు ప్రారంభిస్తున్నాం. ఫైబర్ కేబుల్ ద్వారా ఈ సేవలను అందించనున్నాం. వైఫై సేవలను ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే 3జీ సిమ్‌లను ఉచితంగా అందజేస్తాం. ప్రజలందరూ దీనిని ఉపయోగించుకోవాలి.