WiFi Services
-
ఏడాదిలో 5 లక్షల వైఫై హాట్‌స్పాట్స్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ సంవత్సరాంతానికి 5 లక్షల వైఫై హాట్‌స్పాట్స్ అందుబాటులోకి వస్తాయని టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ చెప్పారు. ప్రతి గ్రామానికీ వైఫై హాట్‌స్పాట్ సదుపాయం ఉంటుందని చెప్పుకొచ్చారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో వెనుకబడిన భారత్ ఈ ఏడాది అద్భుత పురోగతి సాధిస్తుందన్నారు. 4జీ నెట్‌వర్క్‌కు వేగంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు టెలికాం కంపెనీలతో కసరత్తు సాగిస్తున్నామన్నారు. ఆప్టిక్ ఫైబర్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత గ్రామాలకూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ దిశగా భారత్ నెట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. కాల్ డ్రాప్స్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టెలికాం సేవల్లో నాణ్యత పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపడతామన్నారు. -
గ్రామాల్లోనూ వైఫై సేవలు
పోచమ్మమైదాన్ : ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ప్రజలకు సేవలందించేందుకు ముందుకు సాగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో మారుమూల గ్రామాలకు సైతం భారత్ సంచార్ నిగామ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పబ్లిక్ గార్డెన్, హన్మకొండ బస్టాండ్, వేయ్యిస్తంభాల దేవాలయం, భద్రకాళి, స్టేషన్‌రోడ్డు, మదనతుర్తి, పస్రాలలో వైఫై సేవలు అందిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా పెంచికల్‌పేట, జంగాలపల్లి, కల్లెడ, అన్నారం షరీఫ్, తీగరాజుపల్లి, రెడ్లవాడ, అలంకానిపేట, ముప్పారం, పెనుగొండ, చిన్నముప్పారంలలో గ్రామస్తుల సహకారంతో ఫైబర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో మార్చి 31 నాటికి ప్రజల భాగస్వామ్యంతో 300 గ్రామాల్లో వైఫై సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ముందుకుసాగుతున్నది. వారం రోజుల్లో సేవలు ప్రారంభం : పీజీఎం నరేందర్ మరో వారం రోజుల్లో మొదటి విడతలో భాగంగా పది గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వైఫై సేవలు ప్రారంభిస్తున్నాం. ఫైబర్ కేబుల్ ద్వారా ఈ సేవలను అందించనున్నాం. వైఫై సేవలను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే 3జీ సిమ్‌లను ఉచితంగా అందజేస్తాం. ప్రజలందరూ దీనిని ఉపయోగించుకోవాలి. -
సిటీ బస్సుల్లో ఉచిత వైఫై
- ఏసీ బస్సులో మొదటి 30 నిమిషాలు ఫ్రీ వైఫై అందిస్తామన్న ఆర్టీసీ ఈడీ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో భాగంగా నగర పౌరులకు అత్యుత్తమ సేవలు అందించాలని భావిస్తోన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ రూట్లలో నడిచే సిటీ బస్సు సర్వీసుల్లో వైఫై సేవలు ప్రారంభించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తం మంగళవారం మీడియాకు తెలిపారు. అయితే మొదటి విడతగా ఏసీ బస్సుల్లో మాత్రమే వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. వివిధ రూట్లల్లో తిరిగే 80 మెట్రో లగ్జరీ బస్సులు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 29 పుష్పక్ లతో కలిపి మొత్తం వందకు పైగా ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై అందిస్తామని, ఇందుకోసం సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఉప్పల్ నుంచి వేవ్‌రాక్ వరకు త్వరలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈడీ పురుషోత్తం వివరించారు. ఈ రెండు మార్గాల్లోని ఫలితాలను పరిశీలించిన అనంతరం అన్ని ఏసీ బస్సులకు వైఫై సేవలను విస్తరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పిన ఈడీ.. తొలిదశలో మొదటి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు అందిస్తామని, ఆ తరువాత చార్జీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ‘గో రూరల్ ఇండియా’ అనే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. వివిధ మార్గాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సుల్లోనూ, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనూ ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రయాణికులను పెంచుకొనేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. -
చండీయాగానికి వై-ఫై సేవలు
- ప్రైవేటు టెలికం సంస్థల కసరత్తు - మొబైల్ టవర్ ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ - సిద్ధమవుతున్న సంచార మరుగుదొడ్లు - మూడో రోజు పనులను పరిశీలించిన సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న అయుత చండీయాగానికి వై-పై సేవలు అందించడానికి టెలికాం సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రిలయన్స్ ఆధ్వర్యంలో 4జీ సేవలు అందించడానికి కసరత్తు జరుగుతోంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే యాగశాల వద్ద మొబైల్ టవర్‌ను ఏర్పాటుచేసి వై-పై సేవలు అందిస్తుండగా.. మిగిలిన ప్రైవేట్ సంస్థలన్నీ 3జీ సేవలు అందించడానికి పనులు చేపట్టాయి. ఇక, యాగానికి వచ్చే వారి కోసం సంచార మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రెండు రోజులుగా ఫాంహౌ్‌సలోనే ఉండి పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. శనివారం కూడా యాగశాలకు వచ్చి పనులను చూశారు. పనులను మరింత వేగంగా చేయాలని సూచించారు. 21 నుంచి ఎర్రవల్లిలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (ఈ నెల 21) నుంచి మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌ్‌సలోనే ఉండనున్నారు. వ్యక్తిగత హోదాలో 23 నుంచి 27 వరకు ఆయన అక్కడ అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఎర్రవల్లికి వెళ్లిన కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన క్రిస్మస్ విందులో పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం మళ్లీ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సకు వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే రోజు ఆయన అక్కడ అయుత చండీయాగం ప్రారంభానికి ముందు నిర్వహించే కొన్ని పూజాదికాల్లో పాల్గొంటారని సమాచారం. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న అయుత చండీయాగం ముగియనుండగా, ఆ తర్వాతనే సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తారని తెలిసింది. -
హై..హై..వైఫై
- ప్రయాణికులకు 5జీ సేవలు - త్వరలో ఎంజీబీఎస్, జేబీఎస్లలోఅందుబాటులోకి.. - మొదటి 15 నిమిషాలు ఉచితం సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు వైఫై సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. 5జీ సామర్ధ్యం కలిగిన వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లలో త్వరలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. దీంతో మొదటి 15 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. ఆ తరువాత నెట్‌వర్క్‌ను కొనసాగించదలుచుకున్న వారు కూపన్లు కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో ఎంజీబీఎస్‌లో నిత్యం సుమారు లక్షా 25 వేల మందికి... జేబీఎస్లో మరో 40 వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. స్మార్ట్ఫోన్లు ఉన్న వారు నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రాష్ర్ట రాజధానిలోని ప్రధాన బస్స్టేషన్లకే పరిమితమైన వైఫై సేవలను దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాలకు... అక్కడి ప్రధాన బస్స్టేషన్లకు విస్తరించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 5జీ సామర్ధ్యం కలిగిన సేవలను ఆర్టీసీయే మొట్టమొదట వినియోగంలోకి తె స్తోందని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో బస్స్టేషన్లను అనుసంధానం చేయనున్నారు. పటిష్టంగా భద్రత... మరోవైపు బస్స్టేషన్లలో ప్రయాణికుల భద్రతకు మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ప్రస్తుతం 15 సీసీ కెమెరాలు ఉన్నాయి. త్వరలో మరో 40 ఏర్పాటు చేయనున్నారు. జేబీఎస్‌లోనూ ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీంతో బస్స్టేషన్లలోని అన్ని వైపులా నిఘా మరింత కట్టుదిట్టం కానుంది. -
మెట్రో ఇంట ‘వైఫై’ పంట
అన్ని స్టేషన్లు, రైల్వే బోగీల్లో పూర్తి స్థాయి వైఫై సేవలు న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోని ‘వైఫై’మయం చేయడానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలోని అన్నీ మెట్రో స్టేషన్లు, రైల్వే బోగీల్లో వైఫై సేవల్ని విస్తరించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. అందుకోసం ‘దయచేసి ప్రతిపాదనలు పంపించండి’ అని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, ప్రయాణికులను అభ్యర్థిస్తున్నారు. దీంతో చాలా కాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు మార్గం సుగమమయింది. ప్రజల నుంచి వచ్చే ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 193 కిలోమీటర్లు వ్యాపించిన వైఫై సేవల్ని శరవేగంగా విస్తరిస్తోన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అనుగుణంగా పెంచాలని నిర్ణయించింది. ‘మెట్రోలో వైఫై సేవల్ని విస్తరించడాని మొబైల్ వినియోగదారుల నుంచి ప్రతిపాదనలు పంపించమని కోరాం. వారి నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అన్ని స్టేషన్లలో వైఫై సేవల్ని మే నెలాఖరు నాటికి విస్తరింపజే యాలని కంపెనీలకు స్పష్టం చేశాం.’ అని మెట్రో అధికారి తెలిపారు. మెట్రో అధికారులు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం వినూత్నమైన కార్యక్రమం ప్రవేశపెట్టారు. వినియోగదారులకు క్రెడిట్ పాయింట్లు ఇవ్వడం ద్వారా రిచార్జ్ స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. దీని ద్వారా ప్రయాణికులు మెట్రోరైళ్లపై మరింత ఆసక్తి పెరుగుతోందని అధికారులు వివరించారు. -
నష్టాల్లో మెట్రో రైలు!
సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో రైల్వేకు మొదటి మూడు నెలల్లో రూ.57 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆడిట్లో వెల్లడైంది. ప్రస్తుతం వడాల-చెంబూర్ మధ్య నడుస్తున్న మోనో రైలు కూడా నష్టాల బాటలో నడుస్తోంది. దీని జాబితాలో మెట్రో కూడా చేరిపోయింది. ఘాట్కోపర్-అంధేరి- వర్సోవా మెట్రో సేవలు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చాయి. అందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) రూ.4,500 కోట్లు ఖర్చు చేసింది. కాని అత్యంత ఖరీదైన సేవలు అతి తక్కువ చార్జీలతో అందించడం గిట్టుబాటు కావడం లేదు. అదేవిధంగా మెట్రో రైళ్లకు, ప్రయాణికులకు కల్పిస్తున్న భద్రత, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమరాలు, పెద్ద సంఖ్యలో నియమించిన సిబ్బంది, మెట్రో రైళ్ల నిర్వహణ, బ్యాగ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇస్తున్న రాయితీ తదితర కారణాలవల్ల మెట్రోకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో స్పష్టమైంది. ప్రారంభంలో కేవలం రూ.10 ల చార్జీతో ఎక్కడికైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పించింది. దీంతో ముంబైకర్లు పూర్తి ఆనందాన్ని ఆస్వాదించారు. మొదటి రెండు, మూడు నెలలు ప్రతీరోజు 2.40 లక్షల మంది ప్రయాణించారు. ఆ తర్వాత ఈ సంఖ్య మూడు లక్షలకు చేరింది. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో రెట్టింపు అయింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ కార్డులు, సీజన్ పాస్‌లు జారీచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో వైఫై సేవలు కూడా ప్రారంభించింది. కాని టికెటు చార్జీలు మాత్రం సేవలకు తగ్గట్టుగా పెంచలేదు. కనీస చార్జీ రూ.10 ఉండగా ఆ తర్వాత దూరాన్ని బట్టి రూ.20, రూ.30 నిర్ణయించింది. కాని అనేక మంది ఉద్యోగులు స్మార్ట్ కార్డు, సీజన్ పాస్‌లు వినియోగిస్తున్నారు. దీంతో ఆదాయం మరింత పెరిగింది. కాని ప్రారంభంలో ఈ సౌకర్యాలు అందుబాటులో లేకున్నప్పటికీ సరదా కోసం ప్రయాణంచే వారి సంఖ్య ఎక్కువ ఉండేది. దీంతో వివిధ నిర్వహణ భారాలు, సిబ్బంది ఖర్చుల భారం ఎమ్మెమ్మార్డీయేపై విపరీతంగా పడింది. ప్రారంభంలో మోనోతో పోలిస్తే మెట్రో లాభాల బాటలో నడుస్తోందని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. కాని ఇదికూడా నష్టాల బాటలో నడుస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో స్పష్టమైంది.