చండీయాగానికి వై-ఫై సేవలు
- ప్రైవేటు టెలికం సంస్థల కసరత్తు
- మొబైల్ టవర్ ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్
- సిద్ధమవుతున్న సంచార మరుగుదొడ్లు
- మూడో రోజు పనులను పరిశీలించిన సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న అయుత చండీయాగానికి వై-పై సేవలు అందించడానికి టెలికాం సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రిలయన్స్ ఆధ్వర్యంలో 4జీ సేవలు అందించడానికి కసరత్తు జరుగుతోంది. బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే యాగశాల వద్ద మొబైల్ టవర్‌ను ఏర్పాటుచేసి వై-పై సేవలు అందిస్తుండగా.. మిగిలిన ప్రైవేట్ సంస్థలన్నీ 3జీ సేవలు అందించడానికి పనులు చేపట్టాయి. ఇక, యాగానికి వచ్చే వారి కోసం సంచార మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రెండు రోజులుగా ఫాంహౌ్‌సలోనే ఉండి పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. శనివారం కూడా యాగశాలకు వచ్చి పనులను చూశారు. పనులను మరింత వేగంగా చేయాలని సూచించారు.
21 నుంచి ఎర్రవల్లిలోనే కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (ఈ నెల 21) నుంచి మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌ్‌సలోనే ఉండనున్నారు. వ్యక్తిగత హోదాలో 23 నుంచి 27 వరకు ఆయన అక్కడ అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఎర్రవల్లికి వెళ్లిన కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన క్రిస్‌మస్ విందులో పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం మళ్లీ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సకు వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే రోజు ఆయన అక్కడ అయుత చండీయాగం ప్రారంభానికి ముందు నిర్వహించే కొన్ని పూజాదికాల్లో పాల్గొంటారని సమాచారం. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న అయుత చండీయాగం ముగియనుండగా, ఆ తర్వాతనే సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తారని తెలిసింది.