సోమవారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇక్కడి దూది పింజ పొడవు దేశంలో కెల్లా పొడవుగా వస్తోందని, గట్టితనం కూడా ఎక్కువని పేర్కొన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో చర్చించాలని సూచించారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తిని శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం వంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు.
తెలంగాణలో వ్యవసాయ విస్తరణపై ప్రగతిభవన్‌లో సోమవారం సీఎం సమీక్షించారు. ‘దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. పత్తికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. సాగునీటి ద్వారా సాగు చేసే భూముల్లో పంట మరింత బాగా వస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుంది’అని సీఎం అన్నారు. ‘పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది.
తెలంగాణ ఏర్పడక ముందు జిన్నింగ్ మిల్లుల సంఖ్య 60 మాత్రమే ఉంటే, వాటిని 300కు పెంచేలా చర్యలు తీసుకుంది. పత్తి ఎక్కువ పండే ప్రాంతా ల్లో జిన్నింగ్ మిల్లులు నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది’అని వివరించారు. ‘పత్తి సాగులో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. కొత్త వంగడాలు కూడా వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే విత్తనాలు వస్తున్నాయి. వాటిని తెలంగాణలో పండించాలి’అని సీఎం సూచించారు. ‘రైతులు లాభసాటి పంటలనే పండిం చేలా చర్యలు ప్రారంభించాం. రైతులు కూడా ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం. మార్కెట్లో పత్తికి, నూనె గింజలకు, పప్పులకు డిమాండ్ ఉంది. కూరగాయలకు కూడా మంచి ధర వస్తుంది. వాటిని ఎక్కువగా పండించాలి. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలి. ఆయిల్ పామ్ విస్తీర్ణం 8 లక్షలకు పెరగాలి’అని కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థకు ‘అగ్రికల్చర్ టుడే’అవార్డులు వచ్చినందుకు ఆ సంస్థ ఎండీ కేశవులును ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.
రూ. 4,800 కోట్లతో ఆయిల్ పామ్ సాగు ప్రణాళిక
రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఆమోదించారు. రైతులకు 50% సబ్సిడీ ఇచ్చి ఆయిల్ పామ్ సాగు చేయించనున్నట్లు సీఎం వెల్లడించారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయాన్ని రైతులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సీఎం వెల్లడించారు.
ఆయిల్ పామ్ సాగు–ముఖ్యాంశాలు
► దేశానికి 22 మిలియన్ టన్నుల ఆయిల్ కావాలి. కానీ దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. ఏటా 15 మిలియన్ టన్నుల నూనె దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ఏటా రూ.70 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
► దేశంలో 8 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి.
► రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు, నిరం తర విద్యుత్ సరఫరా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయిల్ పామ్ సాగు చేయడానికి రాష్ట్రం అనువైందిగా గుర్తించాయి.
► రాష్ట్రంలోని నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచి ర్యా ల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్లగొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించారు.
► మూడేళ్ల పాటు అంతర పంట వేసుకోవచ్చు. నాలుగో ఏడాది నుంచి ఆయిల్ పామ్ పంట వస్తుంది. 30 ఏళ్ల పాటు పంట వస్తుంది. ఆయిల్ పామ్ పంటలో అంతర పంటగా కొకొవా కూడా పండించవచ్చు. తోట చుట్టూ టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం సాగు చేయొచ్చు.
► ఎకరానికి 10–12 టన్నుల గెలలు వస్తాయి.
► ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుంది.
► ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12,800 ఉంది.
► రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సొంత ఖర్చులతో నర్స రీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టబోతున్నాయి. ప్రతీ కంపెనీకి సాగు చేసే ప్రాంతాలను జోన్లుగా విభజించి, వారికి అప్పగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment