సిటీ బస్సుల్లో ఉచిత వైఫై
- ఏసీ బస్సులో మొదటి 30 నిమిషాలు ఫ్రీ వైఫై అందిస్తామన్న ఆర్టీసీ ఈడీ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో భాగంగా నగర పౌరులకు అత్యుత్తమ సేవలు అందించాలని భావిస్తోన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ రూట్లలో నడిచే సిటీ బస్సు సర్వీసుల్లో వైఫై సేవలు ప్రారంభించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తం మంగళవారం మీడియాకు తెలిపారు. అయితే మొదటి విడతగా ఏసీ బస్సుల్లో మాత్రమే వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వివిధ రూట్లల్లో తిరిగే 80 మెట్రో లగ్జరీ బస్సులు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 29 పుష్పక్ లతో కలిపి మొత్తం వందకు పైగా ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై అందిస్తామని, ఇందుకోసం సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఉప్పల్ నుంచి వేవ్‌రాక్ వరకు త్వరలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈడీ పురుషోత్తం వివరించారు. ఈ రెండు మార్గాల్లోని ఫలితాలను పరిశీలించిన అనంతరం అన్ని ఏసీ బస్సులకు వైఫై సేవలను విస్తరిస్తామని తెలిపారు.
భవిష్యత్తులో మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పిన ఈడీ.. తొలిదశలో మొదటి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు అందిస్తామని, ఆ తరువాత చార్జీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ‘గో రూరల్ ఇండియా’ అనే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. వివిధ మార్గాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సుల్లోనూ, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనూ ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రయాణికులను పెంచుకొనేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.