- ప్రయాణికులకు 5జీ సేవలు
- త్వరలో ఎంజీబీఎస్, జేబీఎస్‌లలోఅందుబాటులోకి..
- మొదటి 15 నిమిషాలు ఉచితం
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు వైఫై సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. 5జీ సామర్ధ్యం కలిగిన వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్‌లలో త్వరలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. దీంతో మొదటి 15 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. ఆ తరువాత నెట్‌వర్క్‌ను కొనసాగించదలుచుకున్న వారు కూపన్లు కొనుగోలు చేసుకోవచ్చు.
దీంతో ఎంజీబీఎస్‌లో నిత్యం సుమారు లక్షా 25 వేల మందికి... జేబీఎస్‌లో మరో 40 వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న వారు నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రాష్ర్ట రాజధానిలోని ప్రధాన బస్‌స్టేషన్‌లకే పరిమితమైన వైఫై సేవలను దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాలకు... అక్కడి ప్రధాన బస్‌స్టేషన్‌లకు విస్తరించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 5జీ సామర్ధ్యం కలిగిన సేవలను ఆర్టీసీయే మొట్టమొదట వినియోగంలోకి తె స్తోందని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో బస్‌స్టేషన్‌లను అనుసంధానం చేయనున్నారు.
పటిష్టంగా భద్రత...
మరోవైపు బస్‌స్టేషన్‌లలో ప్రయాణికుల భద్రతకు మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ప్రస్తుతం 15 సీసీ కెమెరాలు ఉన్నాయి. త్వరలో మరో 40 ఏర్పాటు చేయనున్నారు. జేబీఎస్‌లోనూ ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీంతో బస్‌స్టేషన్లలోని అన్ని వైపులా నిఘా మరింత కట్టుదిట్టం కానుంది.
హై..హై..వైఫై
Published Sun, Sep 6 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement