దేశీయ ప్రయాణికులకు ఇంటర్‌నెట్
2025 జనవరి 1 నుంచి అందుబాటులోకి తెచ్చిన ఎయిర్ ఇండియా
దేశంలో మొట్టమొదటిసారి
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్‌నెట్... సెల్‌ఫోన్‌ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్‌నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.
దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్‌లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్‌ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ సదుపాయం అందిస్తోంది.
ఎయిర్ ఇండియా వైఫై ఇలా..
ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్‌లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్‌వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్‌కు వెళ్లాక పీఎన్‌ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్‌నెట్ సేవలు వాడుకోవచ్చు.
ఏయే విమానాల్లో..?
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్‌బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలు
విమానంలో నెట్ ఎలా?
భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్‌టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్‌నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్‌స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్‌లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్‌లా మారిపోతుంది.
సెల్ టవర్ సిగ్నల్స్
ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్‌నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.
శాటిలైట్ సిగ్నల్స్
సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్‌తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్‌టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.
ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్‌కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్‌కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్‌కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.
ఏటీజీ – శాటిలైట్
ఏటీజీ ద్వారా ఇంటర్‌నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్‌నెట్‌లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.
2003లో మొదటిసారిగా...
⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్‌నెట్ అందించింది.
⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్‌నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.
⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్‌నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్‌లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్, ఫిజి ఎయిర్‌వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్, డెల్టా ఎయిర్‌వేస్, మొదలైనవి.
‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్‌నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా
Comments
Please login to add a commentAdd a comment