టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.
వైడ్ బాడీ విమానాలు లేవు..
‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.
ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!
ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలు
ఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment