సేవలు నిలిచిపోయినట్లు నిర్వాహకులకు వచ్చిన మెసేజ్
- జిల్లాలో కేంద్రాల మూసివేత
- సాంకేతిక సమస్యలే కారణం
- ఆందోళనలో వినియోగదారులు
- అడ్మిషన్లకు చివరి తేదీ కావడంతో విద్యార్థుల హైరానా..
జోగిపేట: సాంకేతిక కారణాలతో జిల్లాలో మీ సేవలు శనివారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాలలో టీఎస్ ఆన్‌లైన్ లాగిన్ కాకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచే మీ సేవ కేంద్రాల వద్ద వారంతా వేచి ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఓకే అవుతుందని నిర్వాహకులు చెప్పినా సాయంత్రం 5.30 వరకు కూడా ఓకే కాలేదు. వినియోగదారులు కేంద్రాల వద్దనే పడిగాపులుకాశారు.
ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలలో అడ్మిషన్లు పొందేందుకు శనివారమే చివరి తేదీ కావడంతో విద్యార్థులు ఉదయమే మీ సేవ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ వారిలో ఆందోళన వ్యక్తం అయ్యింది. కొన్ని కేంద్రాలలో విద్యార్థులు నిర్వాహకులతో గొడవలకు దిగారు. పనిచేయకుంటే ఎందుకు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలోని 280 కేంద్రాలలో సేవలు పనిచేయలేదు. రాష్ర్ట వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నట్లు టీఎస్ ఆన్‌లైన్ జిల్లా మేనేజర్ ప్రదీప్ తెలిపారు. డాటా బేస్ సమస్య కారణంగా పనిచేయలేకపోయాయన్నారు. సమస్యను తొలగించేందుకు ప్రయత్రాలు జరుగుతున్నాయన్నారు. అనుకోకుండా సాంకేతిక పరమైన సమస్య వచ్చిందని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. 5 ఏళ్లలో ఇంత పెద్ద సమస్య రాలేదని, సర్వర్ డౌన్ కారణంగా అడపాదడపా ఇబ్బందులు వచ్చినా మొత్తానికి సేవలు నిలిపివేసే సమస్య రాలేదని నిర్వాహకులు తెలిపారు.