
జూబ్లీహిల్స్: మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసినా ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర్‌రావు ఆరోపించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆయన బైఠాయించి తన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ... చంద్రబాబుకి సింగిల్ గన్‌మెన్ ఉన్నప్పటి నుంచి ఆయనతో తిరిగానని అయినా తనను పట్టించుకోవడం లేదన్నారు. ఆరు నెలలుగా ప్రయత్నిస్తుంటే కలవడానికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. పార్టీకి పని చేసి తాను సర్వస్వం కోల్పోయానని వాపోయారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయానని గుర్తుచేశారు. (బాబు ఇంటి ముందు టీడీపీ నేత ఆందోళన)
చంద్రబాబు నివాసం వద్ద బైఠాయించిన ఆకుల వెంకటేశ్వర్‌రావు
కార్పొరేటర్‌గా ఓడిపోయిన తర్వాత వైజాగ్‌కు వెళ్లిపోయానని అప్పటి నుంచి కూడా టీడీపీతోనే ఉన్నానని కానీ ఇప్పుడు తనకు కష్టమొచ్చిందంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబును కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని లోకేష్‌బాబుకు ఫోన్ చేస్తే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టమంటాడని, వాట్సాప్‌లో మెసేజ్ పెడితే తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ రాజగోపాల్ తనను చంద్రబాబును కలవనివ్వడం లేదని ఆరోపించారు. నెల రోజులుగా అపాయింట్‌మెంట్ అడుగుతుంటే ఇవాళ రమ్మన్నారని... ప్రస్తుతం మూడు నెలల తర్వాత రావాలంటూ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.