నాన్న లేడు... | Son Leavs Father Out Of Village In MAdhira | Sakshi
Sakshi News home page

నాన్న లేడు...

Published Wed, Apr 18 2018 11:44 AM | Last Updated on Wed, Apr 18 2018 11:44 AM

Son Leavs Father Out Of Village In MAdhira - Sakshi

వెంకటేశ్వరరావు మృతదేహం వద్ద అధికారులు

అమ్మ–నాన్న..ఈ సృష్టికి మూలం వీరిద్దరే..!వీరిద్దరూ లేకపోతే..మనమెవరమూ లేము.కన్నీళ్లు.. కష్టాలు దిగమింగి..బిడ్డల కోసమే జీవితాన్ని ధారపోసి..అంత్య దశకు చేరిన ఆ ఇద్దరూ..ఇప్పడు మనకు ‘బిడ్డలు’..‘చంటి పిల్లల్లాంటి’ వాళ్లు..!!పిల్లలు.. ‘దేవుళ్ల’తో సమానం..‘పిల్లల్లా’ మారిన వీరిద్దరూ..నిజంగానే మనకు దేవుళ్లు..!!!ఆ ‘దేవుడి’ని ఊరవతలకువిసిరేశాడు..   ఆకలిదప్పులతోప్రాణం పోయేలా చేశాడు.. 

మధిర: అతడి పేరు యలమందల వెంకటేశ్వరరావు(70). మధిర పట్టణంలోని ముస్లిం కాలనీలో నివాసముంటున్న యలమందల లక్ష్మీనారాయణను కని పెంచిన తండ్రి.
వెంకటేశ్వరరావుకు ఈ కొడుకుతోపాటు కూతురు విజయలక్ష్మి కూడా ఉంది. వీరిద్దరూ వివాహితులే. కోడలి పేరు సుధారాణి. అల్లుడి పేరు లంకెమళ్ల శ్రీనివాసరావు.
కొడుకు–కోడలు (లక్ష్మీనారాయణ–సుధారాణి), మధిర పట్టణంలోని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కూతురు–అల్లుడు (విజయలక్ష్మి–శ్రీనివాసరావు), బిడుగుపాడు గ్రామంలో ఉంటున్నారు.
వృద్ధుడైన వెంకటేశ్వరరావు, సుమారు ఏడేళ్ల నుంచి తన కుమార్తె–అల్లుడి వద్దనే ఉంటున్నాడు.
ఇతడు ఇటీవల తీవ్రంగా అస్వస్థుడయ్యా డు. కూతురు–అల్లుడి ఇంటి పక్కన ఉంటున్న కుటుంబంలో కొద్ది రోజుల్లో శుభకార్యం జరగాల్సుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వరరావుకు ఏదైనా జరిగితే...? శుభకార్యం ఆగిపోతుందేమో..! ఆ పక్కనున్న కుటుంబం లోని వచ్చిన సందేహమిది. వారు తమ సందేహాన్ని, భయాన్ని విజయలక్ష్మి చెవిన పడేశారు.
విజయలక్ష్మికి కూడా ‘అవును కదా..’ అనిపించింది. ‘‘ఆ ఇంట శుభకార్యం పూర్తయ్యేంత వరకు మా నాన్నను నా సోదరుడి ఇంటికి పంపించు. ఆ తరువాత తీసుకొద్దాం’’ అని, భర్త శ్రీనివాసరావుతో చెప్పింది. ఆమె భర్త సరేనన్నాడు.
ఆదివారం ఉదయం. తన మామను వెంటబెట్టుకుని బావమరిది లక్ష్మీనారాయణ ఇంటికి శ్రీనివాసరావు వెళ్లాడు. విషయమంతా వివరించి చెప్పాడు. వెంకటేశ్వరరావును అక్కడ అప్పగించి తిరుగు ప్రయాణమవుతున్నాడు.
ఇంతలోనే... ‘‘ఇన్నేళ్లపాటు ఉంచుకున్నావు. అనారోగ్యంతో బాధపడుతున్న ‘ముసలోడిని’ నా దగ్గర వదిలేసి వెళ్తావా..?’’ అంటూ, బావ శ్రీనివాసరావును లక్ష్మీనారాయణ దూషిం చాడట.
అదే రోజు (ఆదివారం) సాయంత్రం, తాను నివసిస్తున్న ముస్లిం కాలనీ సమీపంలోగల తన సొంత ఖాళీ స్థలంలోగల చెట్టు కిందకు  తండ్రి వెంకటేశ్వరరావును కొడుకు లక్ష్మీనారాయణ తీసుకెళ్లాడు. అక్కడే వదిలేసి వచ్చాడు.
తింటానికి తిండి లేదు. తాగేందుకు నీళ్లు లేవు. లేచేందుకు శక్తి లేదు. ఆ రోజంతా ఆ వృద్ధుడు అక్కడే ఒంటరిగా పడుకున్నాడు.
దీనిపై ‘అయ్యో నాన్న..’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఇది కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ దృష్టికి వెళ్లింది. ఆయన తీవ్రంగా స్పందించారు. మధిర తహసీల్దార్‌ మంగీలాల్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో తహసీల్దార్‌ మంగీలాల్, టౌన్‌ ఎస్సై బెంద్రం తిరుపతిరెడ్డి కలిసి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లారు.
ప్చ్‌.. ఆ వృద్ధుడు ‘లేడు’.. సజీవంగా లేడు..! తీవ్ర అనారోగ్యం.. మండుటెండ.. కలిదప్పులు.. వడదెబ్బతో ప్రాణాలొదిలాడు. ఆకలిదప్పులు తీర్చి ఆదుకుందామని అధికారులు వెళ్లేసరికి.. విగతుడిగా కనిపించాడు.
కన్న తండ్రన్న కనికరం కూడా లేకుండా ఆ వృద్ధుడిని చెట్టు కింద వదిలేసి, ప్రాణాలు పోవడానికి కారణమైన కొడుకు లక్ష్మీనారాయణపై, కోడలు సుధారాణిపై కేసును ఎస్సై నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.
‘అయ్యో పాపం’.. ఈ దీన గాథను తెలుసు కున్న పట్టణ వాసులంతా ఇలా అనుకోకుండా ఉండలేకపోయారు. ‘మానవత్వం మంటగలిసింది. అనుబంధం అపహాస్యంగా మారింది. ఆప్యాయతానురాగం అదృశ్యమైంది’... ఇలా, ప్రతి ఒక్కరి మది మూగగా రోదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement