నల్లగండ్ల చెరువు.. నగర శివారు ప్రాంతం.. చుట్టూ జనావాసాలు తక్కువే. ఉదయం ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులకు చెరువు మధ్యలోని ఓ వెదురుచెట్టుపై ఓ కొంగ వేలాడుతూ కనిపించింది. వెంటనే నెట్‌లో వెతికి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి ఫోన్ చేసి సమాచారామిచ్చారు. ఆ సంస్థకు చెందిన సంజీవ్ వర్మ, బాలాజీలు వచ్చి థర్మాకోల్ తెప్ప సాయంతో నీటిలో ప్రయాణించారు. పొడవాటి ముళ్లతో ఉన్న ఆ చెట్టుకొమ్మపై అతి కష్టమ్మీద నిలబడి గాయాలను లెక్కచేయకుండా ఐదు గంటలు యత్నించి కొంగను కాపాడారు. జనావాసాలకు దూరంగా ఉన్నప్పటికీ దారం గాలికి కొట్టుకొచ్చి చెట్టుకు చిక్కుకుంది. అది ఆ కొమ్మమీదకు వచ్చే పక్షుల ప్రాణాలను హరిస్తోంది. ఇలా ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో పక్షులు చనిపోగా, పక్షి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరో రెండు మూడు వందల పక్షులను కాపాడారు.
సాక్షి, హైదరాబాద్: జనవరి సమీపిస్తోందంటే చాలు వినీలాకాశం మరిన్ని రంగులనద్దుకుంటుంది. రంగురంగుల పతంగులతో కొత్త శోభను సంతరించుకుంటుంది. గాలిపటాలు ఎగరేయటం సరదానే. కానీ, పక్షులకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. ఎదుటివారి గాలిపటాన్ని తెంపే ఉద్దేశంతో దానికి కొంతమేర వరకు మాంజా కడుతున్నారు. పతంగి తెగినప్పుడు గాలివాటానికి కొట్టుకుపోయి ఏ చెట్టు కొమ్మకో, సెల్‌టవర్‌కో చిక్కుకుంటోంది. ఆ విషయం గుర్తించని పక్షులు దానికి చేరువగా ఎగిరినప్పుడు వాటి రెక్కలకు దారం చుట్టుకుపోతోంది. విడిపించుకునే తొందరలో అటు, ఇటు ఎగిరేసరికి రెక్కలు తెగిపోయో, శరీరం కోసుకుపోయో పక్షులు చనిపోతున్నాయి. కొన్ని దారాలకే వేలాడుతూ తిండిలేక మరణిస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో పక్షులు చనిపోతుండటంతో ప్రభుత్వం మాంజాను నిషేధించింది. కానీ, దాన్ని పట్టించుకోకుండా చాలామంది మాంజాను వాడుతూ పక్షుల మృతికి కారణమవుతున్నారు.
ఏ చెట్టుకు చూసినా...
ప్రస్తుతం నగరంలో ఏ చెట్టుకు చూసినా మాంజా దారపు పోగులు వేలాడుతున్నాయి. నిత్యం వాటికి పక్షులు చిక్కి విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాంజా ఫ్రీ నగరం చేసేందుకు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కార్యాచరణ చేపడుతోంది. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక విభాగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంల చేయూతతో పక్షి ప్రేమికులను ఏకం చేస్తోంది. ఇందుకోసం సామాజిక వేదికల ద్వారా ప్రచారం ప్రారంభించింది. వారి వారి ఇళ్ల వద్ద ఉన్న చెట్లకు వేలాడుతున్న దారాలను తొలగించాలని కోరుతోంది. చెట్టు ఎక్కలేని పరిస్థితి ఉన్నా, సెల్‌టవర్లకు దారాలున్నా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారం ఇచ్చేందుకు కూడా సామాజిక మాధ్యమం ద్వారా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. దారం వేలాడుతున్న ప్రాంతాల వివరాలు, ఫొటోలు అందులో అప్‌లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది.
డిజాస్టర్ రెస్పాన్స్ టీం, అగ్నిమాపక విభాగం సహకారం
చాలా ప్రాంతాల్లో ఎత్తుగా ఉన్న చెట్లపైన పక్షులు దారాలకు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. చిటారు కొమ్మల వరకు చేరుకోవటం కష్టంగా ఉండటంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, అగ్నిమాపక విభాగం బృందాలు నిచ్చెనల సాయంతో రక్షిస్తున్నారు. ఈ విషయంలో ఆ రెండు విభాగాలు చాలా సహకరిస్తున్నాయని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన అమర్‌నాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment