manja
-
TS: ప్రాణాలు తీస్తున్న పతంగులు!
హైదరాబాద్, సాక్షి: పతంగి దారాలు పండుగ పూట ఉత్త పుణ్యానికి మనుషుల కుత్తుకలు కోస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడగా.. తాజాగా సోమవారం మరో ప్రాణం పోయింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గాలిపటాలు ఎగరేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. నిషేధిత చైనా మాంజా దారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి వేళ గాలి పటం సరదా ప్రాణాలు తీస్తోంది. బిల్డింగ్‌పై నుంచి పడి ఇద్దరు, విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మాంజా దారం తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన సంగతీ తెలిసిందే. అలా గడిచిన రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మరో మరణం సంభవించింది. విద్యుత్ తీగలకు తగిలిన పతంగి తీసే క్రమంలో 22 ఏళ్ల యువకుడికి షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆ యువకుడు కన్నుమూశాడు. ఝరాసంగం మండలం పొట్పల్లిలో ఇది జరిగింది. వరుస ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు గాలి పటం ఎగరేసేలా చూడాలని కోరుతున్నారు. బిల్డింగ్‌లపై కాకుండా మైదానాల్లో పతంగులు ఎగరేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో.. మాంజాదారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్లా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి దుకాణాల్ని సీజ్ చేస్తున్నాయి. సరదా పేరిట పతంగులు ఎగరేస్తూ పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడ్డా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
HYD: తండ్రితో బైక్‌పై వెళ్తుండగా.. చైనా మాంజా కోసుకుపోయి..
చైతన్యపురి/మన్సూరాబాద్: తండ్రితో బైక్‌పై వెళుతున్న బాలిక మెడకు పతంగి మాంజా తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మదుసూధన్ తెలిపిన మేరకు.. వనస్థలిపురం కమలానగర్ కాలనీలో నివాసముంటున్న వినయ్‌కుమార్, స్నేహలత దంపతులు నివాసముంటున్నారు. వీరి కూతురు కీర్తి (6) ఫస్ట్ క్లాస్ చదువుతుంది. శుక్రవారం సాయంత్రం వినయ్‌కుమార్ కూతురు కీర్తిని తీసుకుని బైక్‌పై నాగోలు మెట్రో స్టేషన్‌కు వెళుతున్నాడు. నాగోలు ఫ్లై ఓవర్‌ప పై నుంచి ఉప్పల్ వైపు వెళుతుండగా గాలిపటం మాంజా కీర్తికి మెడకు, విన్‌కుమార్ ముక్కుకు తగిలింది. దీంతో బైక్‌పై నుంచి ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. స్థానికులు సమీపంలోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి చింతల్‌కుంట రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ మదుసూధన్ ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినయ్‌కుమార్ ఇచి్చన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రాణం తీసిన పతంగి దారం.. బైకర్ గొంతు తెగి..
సూరత్: గాలిపటం ఎగరేసే దారం మెడకు చుట్టుకొని ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. మాంజా చాలా పదునుగా ఉంటడంతో అతని గొంతు తెగి చనిపోయాడు. గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు బల్వంత్ పటేల్(52). కమ్రేజ్‌లోని నవగామ్‌లోని నివాసముంటాడు. వజ్రాల పరిశ్రమలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శంకర్ నగర్లో ఓ పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను ఎలాగోలా బైక్‌ను ఆపి కిందపడిపోయాడు. మెడ తెగి రక్తం కారుతున్న అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వైద్యులు బల్వంత్ చనిపోయాడని సోమవారం రాత్రి ప్రకటించారు. మాంజా పదునుగా ఉండటంతో గొంతు లోతుగా తెగిందని, ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో.. -
ప్రాణం తీసిన చైనా మాంజా.. మంచిర్యాలలో విషాదం
సాక్షి, మంచిర్యాల: సంక్రాంతిపూట గాలిపటాల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో యువతి.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో శనివారం గాలిపటంలోని చైనా మాంజా 20 ఏళ్ల యువతి గొంతు కోయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఉజ్జయినిలోని మాధవ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. -
ఇలా అయితే పక్షులు బతకడం కష్టం
నల్లగండ్ల చెరువు.. నగర శివారు ప్రాంతం.. చుట్టూ జనావాసాలు తక్కువే. ఉదయం ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులకు చెరువు మధ్యలోని ఓ వెదురుచెట్టుపై ఓ కొంగ వేలాడుతూ కనిపించింది. వెంటనే నెట్లో వెతికి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి ఫోన్ చేసి సమాచారామిచ్చారు. ఆ సంస్థకు చెందిన సంజీవ్ వర్మ, బాలాజీలు వచ్చి థర్మాకోల్ తెప్ప సాయంతో నీటిలో ప్రయాణించారు. పొడవాటి ముళ్లతో ఉన్న ఆ చెట్టుకొమ్మపై అతి కష్టమ్మీద నిలబడి గాయాలను లెక్కచేయకుండా ఐదు గంటలు యత్నించి కొంగను కాపాడారు. జనావాసాలకు దూరంగా ఉన్నప్పటికీ దారం గాలికి కొట్టుకొచ్చి చెట్టుకు చిక్కుకుంది. అది ఆ కొమ్మమీదకు వచ్చే పక్షుల ప్రాణాలను హరిస్తోంది. ఇలా ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో పక్షులు చనిపోగా, పక్షి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరో రెండు మూడు వందల పక్షులను కాపాడారు. సాక్షి, హైదరాబాద్: జనవరి సమీపిస్తోందంటే చాలు వినీలాకాశం మరిన్ని రంగులనద్దుకుంటుంది. రంగురంగుల పతంగులతో కొత్త శోభను సంతరించుకుంటుంది. గాలిపటాలు ఎగరేయటం సరదానే. కానీ, పక్షులకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. ఎదుటివారి గాలిపటాన్ని తెంపే ఉద్దేశంతో దానికి కొంతమేర వరకు మాంజా కడుతున్నారు. పతంగి తెగినప్పుడు గాలివాటానికి కొట్టుకుపోయి ఏ చెట్టు కొమ్మకో, సెల్టవర్కో చిక్కుకుంటోంది. ఆ విషయం గుర్తించని పక్షులు దానికి చేరువగా ఎగిరినప్పుడు వాటి రెక్కలకు దారం చుట్టుకుపోతోంది. విడిపించుకునే తొందరలో అటు, ఇటు ఎగిరేసరికి రెక్కలు తెగిపోయో, శరీరం కోసుకుపోయో పక్షులు చనిపోతున్నాయి. కొన్ని దారాలకే వేలాడుతూ తిండిలేక మరణిస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో పక్షులు చనిపోతుండటంతో ప్రభుత్వం మాంజాను నిషేధించింది. కానీ, దాన్ని పట్టించుకోకుండా చాలామంది మాంజాను వాడుతూ పక్షుల మృతికి కారణమవుతున్నారు. ఏ చెట్టుకు చూసినా... ప్రస్తుతం నగరంలో ఏ చెట్టుకు చూసినా మాంజా దారపు పోగులు వేలాడుతున్నాయి. నిత్యం వాటికి పక్షులు చిక్కి విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాంజా ఫ్రీ నగరం చేసేందుకు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కార్యాచరణ చేపడుతోంది. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక విభాగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంల చేయూతతో పక్షి ప్రేమికులను ఏకం చేస్తోంది. ఇందుకోసం సామాజిక వేదికల ద్వారా ప్రచారం ప్రారంభించింది. వారి వారి ఇళ్ల వద్ద ఉన్న చెట్లకు వేలాడుతున్న దారాలను తొలగించాలని కోరుతోంది. చెట్టు ఎక్కలేని పరిస్థితి ఉన్నా, సెల్‌టవర్లకు దారాలున్నా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారం ఇచ్చేందుకు కూడా సామాజిక మాధ్యమం ద్వారా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. దారం వేలాడుతున్న ప్రాంతాల వివరాలు, ఫొటోలు అందులో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది. డిజాస్టర్ రెస్పాన్స్ టీం, అగ్నిమాపక విభాగం సహకారం చాలా ప్రాంతాల్లో ఎత్తుగా ఉన్న చెట్లపైన పక్షులు దారాలకు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. చిటారు కొమ్మల వరకు చేరుకోవటం కష్టంగా ఉండటంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, అగ్నిమాపక విభాగం బృందాలు నిచ్చెనల సాయంతో రక్షిస్తున్నారు. ఈ విషయంలో ఆ రెండు విభాగాలు చాలా సహకరిస్తున్నాయని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన అమర్నాథ్ పేర్కొన్నారు. -
పావురం కోసం క్రేన్‌తో రంగంలోకి..
-
‘శభాష్ పోలీస్’.. నెటిజన్ల ప్రశంసలు
లక్నో: చైనా మాంజాతో పక్షుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో చైనా మాంజ ఎంత ప్రమాదకారో తెలుపుతోంది. సరదాగా గాలిపటాలు ఎగరేయడానికి వాడే ఈ డ్రాగన్ దేశపు మాంజ పక్షులకు ఎన్ని ‘చిక్కులు’ తెచ్చిపెడతాయో చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చైనా మాంజలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఓ పావురాన్ని పోలీసులు రక్షించారు. మాంజలో చిక్కుకుని ప్రాణాపాయంలో పడిన పావురాన్ని గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు క్రేన్‌ను రప్పించి పావురాన్ని మాంజ నుంచి విడిపించారు. దానికి స్వల్ప గాయాలు కాగా దగ్గరుండి చికిత్స చేయించి వదిలేశారు. దీంతో స్థానికులు పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ రమేశ్ పాండే మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో ‘శభాష్! పోలీస్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (వైరల్: అచ్చంగా వాటిలాగానే కేకులు!) -
కపోత విలాపం
గాంధీఆస్పత్రి: ప్రాణాపాయంలో ఉన్న రోగుల్నే కాదు మాంజాతో చిటారు కొమ్మకు చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటున్న కపోతాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది. వివరాలు.. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్టు కొమ్మకు గాలిపటం మాంజాకు చిక్కుకుని వేలాడుతున్న పావురాన్ని బుధవారం సాయంత్రం జనరల్ సర్జరీ వైద్యుడు శ్రీనివాసగౌడ్ గుర్తించారు. ప్రాణాపాయంలో అరుస్తూ మాంజాతో గాలిలో ఊగుతున్న కపోతాన్ని చూసి చలించిపోయారు. వెంటనే ఆస్పత్రి పేషీలో పనిచేసే గణేష్‌కు సమాచారం అందించారు. గణేష్‌తో పాటు ఆస్పత్రి సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ద్విచక్ర వాహనం పైకి ఎక్కి పెద్దకర్ర సాయంతో సుమారు గంట పాటు శ్రమించి కపోతాన్ని కాపాడారు. నీళ్లు తాగించారు. రెక్కకు తగిలిన స్వల్ప గాయానికి ప్రాథమిక చికిత్స చేసి వదిలిపెట్టడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. పావురం ప్రాణాలు కాపాడిన గాంధీ వైద్యులు, సిబ్బందికి ఆస్పత్రి అధికారులు అభినందించారు. -
మాంజా పంజా
సాక్షి, చెన్నై : రాజధాని నగరంలో ‘మాంజా’దారం పంజా విసిరింది. ఎక్కడి నుంచో గాలి పటం ద్వారా వచ్చిన ఆ దారం ఓ బాలుడి గొంతు కోసింది. తల్లిదండ్రులతో ఆనందంగా మోటార్ సైకిల్ మీద వెళ్తున్న మూడేళ్ల ఆ బాలుడు సంఘటనా స్థలంలోనే విగత జీవి అయ్యాడు. కళ్లెదుటే ఒక్కగానొక బిడ్డను మాంజా బలికొనడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. ఇక, ఏదేని ఘటన జరిగినప్పుడే తాము మేల్కొంటామని మరో మారు పోలీసులు, అధికారులు నిరూపించుకున్నారు. గాలి పటాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు. గాలి పటాలు ఎగర వేయడం అంటే అందరికీ సరదా. కొన్ని సార్లు ఈ సరదా ప్రాణాలును బలితీసుకుంటోంది. గాజు పెంకులను పొడి చేసి, వాటిని జిగురు(గమ్)లో కలిపి, దారానికి పూసి ఎండ బెట్టి మరీ విక్రయిస్తున్నారు. వీటి వల్ల ఆస్పత్రి పాలయ్యే వాళ్లు ఎక్కువే. 2006లో ఈ మాంజా రూపంలో తొలి మరణం చోటు చేసుకోవడం, ఆ తదుపరి క్రమంగా మరణాల సంఖ్య పెరగడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. మాంజా దారాలను నిషేధించాల్సిందేని కోర్టు ఆదేశించినా, అమలు పరిచే వారు లేకపోయారు. దీంతో చాప కింద నీరులా మాంజా దారాల విక్రయాలు సాగుతూ వస్తున్నాయి. ఏదేనా సంఘటన జరిగినప్పుడే తాము మేల్కొంటామన్న చందంగా ప్రస్తుతం ఘటన చోటు చేసుకోవడంతో మాంజా దారాల విక్రయదారుల పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. చిన్నారిని మింగిన మాంజా రాజస్థాన్ నుంచి ఉద్యోగ నిమిత్తం చెన్నైకు వచ్చిన గోపాల్ కొండితోపులో భార్య సుమిత్ర, కుమారుడు అభినేష్(3)తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం బంధువుల ఇంటికి మోటారు సైకిల్ మీద బయలు దేరారు. తల్లిదండ్రులతో ఆనందంగా వెళ్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో మాంజా మృత్యు పంజాగా మారింది. కొరుక్కుపేట మీనాంబాల్‌నగర్ వంతెన మీద మోటారు సైకిల్ పయనిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన మాంజా దారం ఆ బాలుడి గొంతు కోసింది. క్షణాల్లో బాలుడు తూలి పడటంతో తండ్రి గోపాల్ అప్రమత్తమైన మోటారు సైకిల్‌ను పక్కగా ఆపేశాడు. ఏమి జరిగిందో అన్నది తెలియని పరిస్థితి. తనయుడి గొంతు తెగి రక్తం దారాల పారడంతో ఆందోళనకు లోనయ్యాడు. అక్కడున్న వాళ్లు సాయంతో, ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా, అప్పటికే బాలుడు మరణించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. మూడేళ్ల బాలుడి బలితో మాంజాదారం నిషేధం పోలీసులకు గుర్తుకొచ్చినట్టుంది. ఎక్కడ కోర్టు చేత అక్షింతలు వేయించుకోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో పడ్డ పోలీసులు పరుగులు తీసే పనిలో పడ్డారు. 11 మంది పిల్లల బలి.. 2006 నుంచి ఇప్పటి వరకూ మాంజా దారం రూపంలో 11 మంది పిల్లలు బలి అయ్యారు. వీరిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో మోటార్ సైకిల్ మీద వెళ్లున్నప్పుడు గొంతు కోయబడి మరణించిన వారే. అభినేష్ మరణంతో రాజస్థానీయుల్లో ఆగ్రహం రేగింది. అర్థరాత్రి పోలీసు స్టేషన్‌ను ముట్టడించడంతో తొలుత మెతక వైఖరి అనుసరించినా, ఆర్కేనగర్ పోలీసులు సోమవారం ఉదయాన్నే మాంజా మీద కొరడా ఝుళిపించే విధంగా దూకుడు పెంచారు. కొరుక్కుపేట కామరాజర్ నగర్‌కు చెందిన నాగరాజ్, 15 ఏళ్ల బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మాంజాను నిల్వ ఉంచిన ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంతో పాటుగా ఉత్తర చెన్నై పరిధిలోని అన్ని దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరైనా మంజా విక్రయించినా, వాటితో గాలిపటాలు ఎగరేసినా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. -
ఈ ఫోటో చూస్తే మరో పక్షిరాజు వస్తాడేమో..!
న్యూఢిల్లీ : సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసు, గాలిపటాలు. ఎక్కెడెక్కడో ఉన్న వారంతా పల్లేలకు చేరుకుని సంతోషంగా గడుపుతారు. కానీ మన సంతోషం పక్షుల పాలిట యమపాశమవుతోంది. గాలిపటాల పేరుతో పక్షులకు ఉరితాళ్లు బిగిస్తున్నాం. గాలిపటం మంజా తగిలి మృతి చెందిన ఓ రామచిలుక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బిదితా బాగ్ అనే ట్విటర్ యూజర్ ఒకరు.. మంజా తగిలి చనిపోయిన రామ చిలుక ఫోటోను ట్వీట్ చేశారు. ‘కాయ్‌పో చీ’ అనే క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్ చేయడమే కాక.. ‘వందలాది పక్షులు ఈ కైట్ ఫెస్టివల్ మూలంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. దయచేసి చైనీస్ మంజా వాడకాన్ని నిలిపివేయండి’ అంటూ ట్వీట్ చేశారు. చైనీస్ మంజా దారానికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన రామచిలుక ఎంత విలవిలలాడి ఉంటుందోనని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ‘ఫోటోకు తగ్గ క్యాప్షనే పెట్టారు నిజంగానే రామ చిలుక కాయ్‌పో చీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. We hang our head in shame. This hard hitting image has been shared by Bhavik Thaker, titled "kaypo che?". Thanks for aptly showcasing the plight of these beautiful creatures. Unfortunately, hundreds of birds loose their life during kite festival. stop using chinese/manja threads. pic.twitter.com/TcJlTVJXAw — Bidita Bag (@biditabag) January 15, 2019 ‘కాయ్‌పో చీ’ అనేది గుజరాతి పదం. గాలిపటాల ఎగరేసేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. అవతలి వారి గాలిపటాన్ని కట్ చేస్తే కాయ్‌పో చీ అంటారు. నిషేధిత చైనా మంజా వల్ల పక్షులే కాక మనుషులు కూడా మృత్యువాత పడ్డారు. మంజా వల్ల గొంతు తెగి ఓ ఎనిమిదేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. -
ప్రాణాలు తీసిన మాంజా
అహ్మదాబాద్: పతంగులు ఎగురవేస్తూ వాటి పదునైన దారాలు లోతుగా గీరుకుపోవడంతో గొంతు తెగి ఓ బాలుడు(8)సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో ఉత్తరాయణ్ పండగ సందర్భంగా సోమవారం ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మెహ్సనా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెహజీబ్ ఖాన్(8) సైకిల్‌పై వెళుతుండగా పతంగు దారం మెడకు గీసుకుపోయి చనిపోయాడు. అహ్మదాబాద్ జిల్లా ఢోల్కా సమీపంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న అశోక్ పంచాల్(45) కూడా పతంగు దారం గొంతుకు గీరుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడు. ఆనంద్ జిల్లా కత్తానా గ్రామ సమీపంలో పతంగు ఎగురవేస్తూ మెడకు దారం గీరుకుని గాయపడ్డాడు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరా జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు పతంగులు ఎగురవేసే క్రమంలో ఇళ్లపై నుంచి పడి 117 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. -
సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం అమలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసినపుడు తెగిపోకుండా ఉండేందుకు నిషేధిత సింథటిక్, నైలాన్ మాంజాలను ఉపయోగించకుండా కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పర్యాటక, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నైలాన్, సింథటిక్ మాంజా తయారీ, అమ్మకం, నిల్వ చేయడం, కొనడం, ఉపయోగించడాన్ని 2016 డిసెంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 17న జారీచేసిన ఉత్తర్వులను తప్పకుండా పాటించాలని సూచించింది. ఇనుప, గాజు రజను వంటివి లేకుండా తయారు చేసిన దారాన్ని ఉపయోగించేలా చూడాలని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఐదేళ్ల వరకు జైలుశిక్ష,లక్ష రుపాయల వరకు జరిమానా లేదా రెండింటిని విధించవచ్చని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. -
డేంజర్ మాంజా
సాక్షి,సిటీబ్యూరో: సంక్రాంతి అంటే నగరంలో పతంగులే గుర్తుకు వస్తాయి. ఈ పండగకు వారంరోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా(సగ్గుబియ్యం), గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ప్రమాదకరమైన‘చైనా మాంజా’ రాజ్యమేలుతోంది. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండేళ్ల క్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ నగర మార్కెట్లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గురువారం ‘సాక్షి’ ప్రతినిధి పలు మార్కెట్లలో చైనా మాంజా నిషేధం అమలుపై ఆరా తీయగా అమలు చేయడం లేదని తేలింది. విచ్చలవిడిగా అమ్మకాలు.. నగరంలోని పంజేషా, ధూల్‌పేట్‌తో పాటు పంగతులు అమ్మే వివిధ ప్రాంతాల్లో చైనా మంజా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి చైనా మాంజా ఖరీదు చేయడానికి ప్రయత్నించగా చైనా మాంజా నిషేధించారని, తమ వద్ద లేదని వ్యాపారులు చెప్పారు. తర్వాత వారే డబ్బులు ఎక్కువగా చెల్లిస్తే గోదాం తెచ్చి ఇస్తామన్నారు. గీటీకి రూ.150 అవుతుందన్నారు. బేరం కుదరగానే రహస్యంగా పేపర్లో చుట్టి మంజా ఇచ్చారు. హెచ్చరికలు బేఖాతరు.. గతంలో చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయ్యేది. రెండేళ్ల నుంచి ప్రభుత్వ నిషేధంతో దీన్ని దిగుమతికి వ్యాపారులు జంకుతున్నా రహస్యంగా తెచ్చి విక్రయిస్తున్నారు. చైనా మాంజా విక్రయం లాభసాటిగా ఉండడంతో పాటు బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు నైలాన్ దారంతోనే పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు. చైనా మాంజాపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, పక్షుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పక్షులకు గాయాలు పతంగులను ఎగురవేసే సమయంలో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడానికి (కైంచీ) చైనా మాంజాను వినియోగిస్తున్నారు. ఈ మాంజా తంగూŠస(ప్లాస్టిక్ దారం)కు గాజుపొడి అద్ది తయారు చేస్తారు. అయితే, ఈ మాంజా వల్ల గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతున్నాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. స్థానికంగా తయారు చేసినా.. కొన్నేళ్ల క్రితం కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా చైనా నుంచి మాంజా దేశానికి వచ్చింది. దాని పనితీరును చూసిన ఇక్కడి వ్యాపారులు సొంతంగా సింథటిక్ దారానికి గాజుపొడి అద్ది మాంజాను తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ నగరాల్లో స్థానికంగా తయారు చేస్తున్నప్పటికీ పేరు మాత్రం చైనా మాంజాగానే మనుగడలో ఉంది. ఈ మాంజా కారణంగా పక్షులు, జంతువులే కాదు.. ఓ ద్విచక్ర వాహనదారుడికి గొంతు తెగిపోయి ఆస్పత్రి పాలైన ఉదంతమూ ఉంది. ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి కుమారుడికి సైతం ఇలాంటి ప్రమాదం జరగడంతో అతడు కోర్టును ఆశ్రయించి ప్రమాదానికి కారణాలను కోర్టు ముందు ఉంచాడు. దీంతో ప్రమాదానికి కారణాలను గుర్తించిన కోర్టు మాంజా నిషేధించాలని ప్రభుత్వానికి సూచించింది. -
చైనా మాంజాతో చిక్కులే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా చైనా నైలాన్ మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ళు జైలు శిక్ష, రూ.లక్ష దాకా జరిమానా విధిస్తామని పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా హెచ్చరించారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే కారకులకు 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ఉంటుందని తెలిపారు. శుక్రవారం అరణ్యభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి వేడుకల్లో గాలిపటాల కోసం చైనా మాంజా వాడకం వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయన్నారు. గ్లాస్ కోటింగ్‌తో ఉన్న నైలాన్, సింథటిక్ దారం వాడటం వల్ల పండుగ తర్వాత ఎక్కడికక్కడ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులతో పాటు మనుషులకు హాని జరుగుతోందన్నారు. ఈ దారం కారణంగా గాయాలై హైదరాబాద్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు చనిపోయారని.. అలాగే పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారని తెలిపారు. 2017 జూలై నుంచే నిషేధం.. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 2017 జూలై 11 నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించినట్టు పీకే ఝా చెప్పారు. రాష్ట్రంలో పోలీస్, ఇతర శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో మాంజా వాడకాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్జీవో సంస్థలతో కూడా సమావేశమైనట్టు చెప్పారు. గత మూడేళ్లలో 900 కిలోల దాకా నైలాన్ మాంజా సీజ్ చేసి, 123 కేసులు నమోదు చేశామన్నారు. చైనా దారం దిగుమతితో స్థానికంగా కొందరు ఉపాధి కోల్పోతున్నారన్నారు. చైనా దారం అమ్మకాల గురించి వివరాలు తెలిస్తే.. అటవీశాఖకు 040–23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సమాచారం అందించవచ్చునని అటవీ శాఖ ఓఎస్డీ శంకరన్ వెల్లడించారు. సమావేశంలో అధికారులు పృథ్వీరాజ్, మునీంద్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దారమే కదా అనుకుంటే.. పీక తెగ్గోస్తోంది!
ఇక్కడి మాంజా... కోల్‌కతాలో పంజా.. సిటీ నుంచి భారీగా స్మగ్లింగ్ తక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యాపారులు.. పతంగ్‌లకు వాడుతున్న అక్కడి యువత ఎగరేస్తుండటంతో పలువురికి గాయాలు.. కట్టడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు హైదరాబాద్‌లో తయారవుతున్న గాజు రజనుతో కూడిన మాంజా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పంజా విసురుతోంది. అక్కడి కరయ ప్రాంతంలో ఉన్న మా ఫ్లైఓవర్ వద్ద దీన్ని వినియోగించి అనేక మంది పతంగులు ఎగరేస్తున్నారు. ఫలితంగా ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తున్న వాహనచోదకులు గాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 46 మంది మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కరయ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోపక్క హైదరాబాద్ నుంచి అక్రమ రవాణా అవుతున్న మాంజాను అడ్డుకోవడానికీ దాడులు ప్రారంభించారు. – సాక్షి, హైదరాబాద్ ఆ ఫ్లైఓవర్ వద్ద దారుణంగా.. ఈ అక్రమ మాంజా వినియోగిస్తుండటం కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్స్‌గా మార్చేసింది. ప్రధా నంగా కరయ–టాప్సియ ప్రాంతాల మధ్య ఉన్న మా ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి మరీ దారుణం. ఈ ఫ్లైఓవర్ చుట్టు పక్కల ఉన్న నివాస ప్రాంతాల్లోని ఇళ్ల పైకి ఎక్కు తున్న యువత ప్రమాదకరమైన మాంజాతో గాలి పటాలు ఎగరేస్తున్నారు. అనేక సందర్భాల్లో దీనితో ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనచోదకులు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ మధ్య ఓ వైద్యుడి పీక కోసుకుపోయినంత పనైంది. ఇలా దాదాపు 46 మంది తీవ్రంగా గాయపడటంతో కరయ పోలీసులు అప్రమత్తమయ్యారు. పతంగులను ఎగరవేసే వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృం దాలను రంగంలోకి దింపారు. ఒక్కోటీమ్‌లో ఏఎస్సై, కానిస్టేబుల్, వాలంటీర్ గ్రీన్ పోలీసు కూడా ఉంటున్నారు. 38 మందిని పట్టుకున్న బృందాలు.. ఈ ప్రత్యేక బృందాలు గడిచిన నెల రోజుల్లో మా ఫ్లైఓవర్ చుట్టు పక్కల పతంగులు ఎగరేస్తున్న 38 మందిని పట్టుకున్నారు. వీరంతా 13 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులే కావడంతో వారిని గుర్తించినా ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. పోలీసుస్టేషన్లకు తరలించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు హెచ్చరికలు జారీ చేసి విడిచిపెట్టారు. మరోపక్క ఈ తరహా మాంజాలు విక్రయిస్తున్న దుకాణాల పైనా కోల్‌కతా పోలీసులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా మాంజా తయారీని ఆపాలని కోరుతూ కోల్‌కతా పోలీసులు లేఖ రాయాలనీ అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ తగ్గిన బెడద... నగరంలో ఏటా జరిగే సంక్రాంతి వేడుకల్లో జరిగే పతంగుల ఎగురవేత పోటీలు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. దాదాపు ప్రతీ వ్యక్తీ తన పతంగే ఎక్కువ ఎత్తుకు వెళ్లాలని ఆశించడంతో పాటు ఎదుటి వారి గాలిపటాలకు చెందిన దారాలు తెంపాలని యత్నిస్తుంటారు. దీనికోసం గతంలో గాజు రజనుతో కూడిన మాంజాలు వాడేవారు. ఇవి కరెంటు వైర్లు, చెట్లకు చుట్టుకుపోవడంతో పాటు రోడ్ల పైనా ఎగురుతూ ఉండేవి. ఫలితంగా వాహనచోదకులు, పక్షులు తీవ్రంగా గాయపడిన ఉదంతాలు నమోదయ్యాయి.దీంతో పెద్ద స్థాయిలో దుమారం రేగి ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా ఇక్కడ ఈ మాంజా వాడకం గణనీయంగా తగ్గినా తయారీ మాత్రం ఆగలేదు. ఈ మాంజాకే డిమాండ్ ఎక్కువ.. కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో లభిస్తున్న సురక్షిత మాంజా కంటే హైదరాబాద్ నుంచి తరలుతున్న మాంజాకే డిమాండ్ ఎక్కువ. అక్కడి మాంజా కట్ట ఖరీదు రూ.70 నుంచి రూ.100 వరకు ఉంటోంది. హైదరాబాద్ నుంచి అక్రమ రవాణా చేసింది కేవలం రూ.25 నుంచి రూ.35లకే విక్రయిస్తున్నారు. దీంతో యువత దీనిపైనే మక్కువ చూపుతున్నారు. కోల్‌కతాకు ఢిల్లీ, సూరత్, బెంగళూరుల నుంచీ మాంజా స్మగ్లింగ్ అవుతున్నప్పటికీ హైదరాబాద్ నుంచి వెళ్తున్నది నైలాన్ తాడుకు పై పూతగా గాజు, లోహపు రజను ఉంటోంది. ఫలితంగా ఇది అత్యంత ప్రమాదకరమైందిగా మారుతోంది. ఈ తరహా మాంజాల క్రయవిక్రయాలపై కోల్‌కతాలో నిషేధం విధించినా రైళ్లు, బస్సులతో పాటు పార్సిళ్ల ద్వారా అక్రమంగా తరలి వెళ్తుండటంతో అక్కడ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. -
మాంజాను నిషేధించండి
ఎన్జీటీలో పెటా పిటిషన్ న్యూఢిల్లీ: గాలిపటాలను ఎగురవేసేందుకు గాజుపూత పూసిన మాంజాను వినియోగించడంపై నిషేధం విధించాలని కోరుతూ జీవకారుణ్య సంస్థ-పెటా జాతీయ హరిత ధర్మాసనానికి(ఎన్జీటీ) ఫిర్యాదు చేసింది. ప్రత్యేకించి చైనా నుంచి భారీగా దిగుమతి అవుతున్న గాజుపూత పూసిన మాంజా వల్ల పక్షులతోపాటు మనుషులు కూడా గాయపడడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారని పిటిషన్లో పేర్కొంది. కాటన్ దారాలకు బదులుగా నైలాన్ దారాలను వాడుతున్నారని, అవి ఎంతకూ తెగకపోవడం, వాటికి అడ్డొచ్చిన పక్షులు, మనుషులు గాయపడడం వంటి సంఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. ఇక దేశీయంగా మాంజాను తయారుచేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికారక రసాయనాలవల్ల పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్తరప్రదేశ్ అంతటా గతేడాది నుంచి చైనా మాంజాను నిషేధించారని తెలిపిన పెటా... దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో అభ్యర్థించింది. -
మరణం అంచులకు తీసుకెళ్లిన మాంజా!
అహ్మదాబాద్: సంక్రాంతికి మరోపేరు పతంగుల పండుగ. గాలిపటాలు ఎగరేయడం చాలా మందికి సరదా. అదో వినోదం. ఈ క్రమంలో ప్రమాదాలబారిన పడి మరణించినవారు, తృటిలో తప్పించుకున్నవారు చాలామందే వున్నారు. అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి అనూహ్యంగా మాంజా బారిన పడి దాదాపు మరణం అంచుల వరకూ వెళ్లాడు. గొంతు, చెవులు, ముఖం నుంచి తలవరకూ 200 కుట్లతో బతికి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే గురువారం ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న జిగ్నేష్ టక్కర్ (36) ని దురదృష్టం వెంటాడింది. బైక్ పై వస్తుండగా పతంగ్ దారం (మాంజా) తనకు అడ్డురావడాన్ని గమనించాడు. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పి బండిమీదినుంచి కిందపడడంతో భుజం విరిగిపోయింది మరోవైపు అప్పటికే మాంజా అతని గొంతును, కుడిచెవిని లోతుగా చీల్చుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం గొంతు మీద 150, చెవిపైన 50 కుట్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని జిగ్నేష్ బంధువు తెలిపారు.