సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా చైనా నైలాన్ మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ళు జైలు శిక్ష, రూ.లక్ష దాకా జరిమానా విధిస్తామని పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా హెచ్చరించారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే కారకులకు 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ఉంటుందని తెలిపారు. శుక్రవారం అరణ్యభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి వేడుకల్లో గాలిపటాల కోసం చైనా మాంజా వాడకం వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయన్నారు. గ్లాస్ కోటింగ్‌తో ఉన్న నైలాన్, సింథటిక్ దారం వాడటం వల్ల పండుగ తర్వాత ఎక్కడికక్కడ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులతో పాటు మనుషులకు హాని జరుగుతోందన్నారు. ఈ దారం కారణంగా గాయాలై హైదరాబాద్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు చనిపోయారని.. అలాగే పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారని తెలిపారు.
2017 జూలై నుంచే నిషేధం..
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 2017 జూలై 11 నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించినట్టు పీకే ఝా చెప్పారు. రాష్ట్రంలో పోలీస్, ఇతర శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో మాంజా వాడకాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్జీవో సంస్థలతో కూడా సమావేశమైనట్టు చెప్పారు. గత మూడేళ్లలో 900 కిలోల దాకా నైలాన్ మాంజా సీజ్ చేసి, 123 కేసులు నమోదు చేశామన్నారు. చైనా దారం దిగుమతితో స్థానికంగా కొందరు ఉపాధి కోల్పోతున్నారన్నారు. చైనా దారం అమ్మకాల గురించి వివరాలు తెలిస్తే.. అటవీశాఖకు 040–23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సమాచారం అందించవచ్చునని అటవీ శాఖ ఓఎస్డీ శంకరన్ వెల్లడించారు. సమావేశంలో అధికారులు పృథ్వీరాజ్, మునీంద్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చైనా మాంజాతో చిక్కులే!
Published Sat, Jan 5 2019 2:15 AM | Last Updated on Sat, Jan 5 2019 2:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment