national green tribunal and environmental permits
-
చైనా మాంజాతో చిక్కులే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా చైనా నైలాన్ మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ళు జైలు శిక్ష, రూ.లక్ష దాకా జరిమానా విధిస్తామని పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా హెచ్చరించారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే కారకులకు 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ఉంటుందని తెలిపారు. శుక్రవారం అరణ్యభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి వేడుకల్లో గాలిపటాల కోసం చైనా మాంజా వాడకం వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయన్నారు. గ్లాస్ కోటింగ్‌తో ఉన్న నైలాన్, సింథటిక్ దారం వాడటం వల్ల పండుగ తర్వాత ఎక్కడికక్కడ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులతో పాటు మనుషులకు హాని జరుగుతోందన్నారు. ఈ దారం కారణంగా గాయాలై హైదరాబాద్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు చనిపోయారని.. అలాగే పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారని తెలిపారు. 2017 జూలై నుంచే నిషేధం.. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 2017 జూలై 11 నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించినట్టు పీకే ఝా చెప్పారు. రాష్ట్రంలో పోలీస్, ఇతర శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో మాంజా వాడకాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్జీవో సంస్థలతో కూడా సమావేశమైనట్టు చెప్పారు. గత మూడేళ్లలో 900 కిలోల దాకా నైలాన్ మాంజా సీజ్ చేసి, 123 కేసులు నమోదు చేశామన్నారు. చైనా దారం దిగుమతితో స్థానికంగా కొందరు ఉపాధి కోల్పోతున్నారన్నారు. చైనా దారం అమ్మకాల గురించి వివరాలు తెలిస్తే.. అటవీశాఖకు 040–23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సమాచారం అందించవచ్చునని అటవీ శాఖ ఓఎస్డీ శంకరన్ వెల్లడించారు. సమావేశంలో అధికారులు పృథ్వీరాజ్, మునీంద్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పనులు ఇప్పటికిప్పుడు ఆపలేం
కాళేశ్వరంపై పిటిషనర్లకు స్పష్టం చేసిన హరిత ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపేలా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేసింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం పూర్తిగా సాగునీటి ప్రాజెక్టని, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రభుత్వం నిర్మాణ పనులు ప్రారంభించిందన్నారు. పర్యావరణ అనుమతులు లేని ఈ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ కల్పించుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం జనవరిలో ప్రారంభిస్తే.. ఇప్పుడొచ్చి పనులు ఆపమనడం ఏమిటని ప్రశ్నించారు. ‘మీరు కోరినట్టు పనులు ఆపేలా ఆదేశాలిస్తాం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణ చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటే.. పనులు నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని మీరు భరిస్తారా?’అని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడైతే ప్రాజెక్టు పనులు ఆపేలా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే వివరణ చెల్లుబాటు కాకుంటే.. అప్పుడు పనులు ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై విచారణ జరుపుతామని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ట్రిబ్యునల్.. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.