పనులు ఇప్పటికిప్పుడు ఆపలేం
కాళేశ్వరంపై పిటిషనర్లకు స్పష్టం చేసిన హరిత ట్రిబ్యునల్
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపేలా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) స్పష్టం చేసింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్‌జీటీలో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం పూర్తిగా సాగునీటి ప్రాజెక్టని, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రభుత్వం నిర్మాణ పనులు ప్రారంభించిందన్నారు. పర్యావరణ అనుమతులు లేని ఈ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ కల్పించుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం జనవరిలో ప్రారంభిస్తే.. ఇప్పుడొచ్చి పనులు ఆపమనడం ఏమిటని ప్రశ్నించారు.
‘మీరు కోరినట్టు పనులు ఆపేలా ఆదేశాలిస్తాం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణ చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటే.. పనులు నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని మీరు భరిస్తారా?’అని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడైతే ప్రాజెక్టు పనులు ఆపేలా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే వివరణ చెల్లుబాటు కాకుంటే.. అప్పుడు పనులు ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై విచారణ జరుపుతామని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ట్రిబ్యునల్.. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.