డేంజర్‌ మాంజా | China Manja ban In Hyderabad | Sakshi
Sakshi News home page

డేంజర్‌ మాంజా

Published Fri, Jan 11 2019 9:23 AM | Last Updated on Mon, Mar 11 2019 11:12 AM

China Manja ban In Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: సంక్రాంతి అంటే నగరంలో పతంగులే గుర్తుకు వస్తాయి. ఈ పండగకు వారంరోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్‌ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా(సగ్గుబియ్యం), గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ప్రమాదకరమైన‘చైనా మాంజా’ రాజ్యమేలుతోంది. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండేళ్ల క్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ నగర మార్కెట్‌లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గురువారం ‘సాక్షి’ ప్రతినిధి పలు మార్కెట్లలో చైనా మాంజా నిషేధం అమలుపై ఆరా తీయగా అమలు చేయడం లేదని తేలింది.  

విచ్చలవిడిగా అమ్మకాలు..  
నగరంలోని పంజేషా, ధూల్‌పేట్‌తో పాటు పంగతులు అమ్మే వివిధ ప్రాంతాల్లో చైనా మంజా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి చైనా మాంజా ఖరీదు చేయడానికి ప్రయత్నించగా చైనా మాంజా నిషేధించారని, తమ వద్ద లేదని వ్యాపారులు చెప్పారు. తర్వాత వారే డబ్బులు ఎక్కువగా చెల్లిస్తే గోదాం తెచ్చి ఇస్తామన్నారు. గీటీకి రూ.150 అవుతుందన్నారు. బేరం కుదరగానే రహస్యంగా పేపర్‌లో చుట్టి మంజా ఇచ్చారు.  

హెచ్చరికలు బేఖాతరు..
గతంలో చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయ్యేది. రెండేళ్ల నుంచి ప్రభుత్వ నిషేధంతో దీన్ని దిగుమతికి వ్యాపారులు జంకుతున్నా రహస్యంగా తెచ్చి విక్రయిస్తున్నారు. చైనా మాంజా విక్రయం లాభసాటిగా ఉండడంతో పాటు బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు నైలాన్‌ దారంతోనే పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు. చైనా మాంజాపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, పక్షుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

పక్షులకు గాయాలు
పతంగులను ఎగురవేసే సమయంలో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడానికి (కైంచీ) చైనా మాంజాను వినియోగిస్తున్నారు. ఈ మాంజా తంగూŠస(ప్లాస్టిక్‌ దారం)కు గాజుపొడి అద్ది తయారు చేస్తారు. అయితే, ఈ మాంజా వల్ల గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతున్నాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్‌ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి.  

స్థానికంగా తయారు చేసినా..  
కొన్నేళ్ల క్రితం కైట్స్‌ ఫెస్టివల్‌ సందర్భంగా చైనా నుంచి మాంజా దేశానికి వచ్చింది. దాని పనితీరును చూసిన ఇక్కడి వ్యాపారులు సొంతంగా సింథటిక్‌ దారానికి గాజుపొడి అద్ది మాంజాను తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ నగరాల్లో స్థానికంగా తయారు చేస్తున్నప్పటికీ పేరు మాత్రం చైనా మాంజాగానే మనుగడలో ఉంది. ఈ మాంజా కారణంగా పక్షులు, జంతువులే కాదు.. ఓ ద్విచక్ర వాహనదారుడికి గొంతు తెగిపోయి ఆస్పత్రి పాలైన ఉదంతమూ ఉంది. ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి కుమారుడికి సైతం ఇలాంటి ప్రమాదం జరగడంతో అతడు కోర్టును ఆశ్రయించి ప్రమాదానికి కారణాలను కోర్టు ముందు ఉంచాడు. దీంతో ప్రమాదానికి కారణాలను గుర్తించిన కోర్టు మాంజా నిషేధించాలని ప్రభుత్వానికి సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement