మరణం అంచులకు తీసుకెళ్లిన మాంజా!
అహ్మదాబాద్: సంక్రాంతికి మరోపేరు పతంగుల పండుగ. గాలిపటాలు ఎగరేయడం చాలా మందికి సరదా. అదో వినోదం. ఈ క్రమంలో ప్రమాదాలబారిన పడి మరణించినవారు, తృటిలో తప్పించుకున్నవారు చాలామందే వున్నారు. అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి అనూహ్యంగా మాంజా బారిన పడి దాదాపు మరణం అంచుల వరకూ వెళ్లాడు. గొంతు, చెవులు, ముఖం నుంచి తలవరకూ 200 కుట్లతో బతికి బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళితే గురువారం ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న జిగ్నేష్ టక్కర్ (36) ని దురదృష్టం వెంటాడింది. బైక్ పై వస్తుండగా పతంగ్ దారం (మాంజా) తనకు అడ్డురావడాన్ని గమనించాడు. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పి బండిమీదినుంచి కిందపడడంతో భుజం విరిగిపోయింది మరోవైపు అప్పటికే మాంజా అతని గొంతును, కుడిచెవిని లోతుగా చీల్చుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం గొంతు మీద 150, చెవిపైన 50 కుట్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని జిగ్నేష్ బంధువు తెలిపారు.