మాంజాను నిషేధించండి
ఎన్జీటీలో పెటా పిటిషన్
న్యూఢిల్లీ: గాలిపటాలను ఎగురవేసేందుకు గాజుపూత పూసిన మాంజాను వినియోగించడంపై నిషేధం విధించాలని కోరుతూ జీవకారుణ్య సంస్థ-పెటా జాతీయ హరిత ధర్మాసనానికి(ఎన్జీటీ) ఫిర్యాదు చేసింది. ప్రత్యేకించి చైనా నుంచి భారీగా దిగుమతి అవుతున్న గాజుపూత పూసిన మాంజా వల్ల పక్షులతోపాటు మనుషులు కూడా గాయపడడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కొంది. కాటన్ దారాలకు బదులుగా నైలాన్ దారాలను వాడుతున్నారని, అవి ఎంతకూ తెగకపోవడం, వాటికి అడ్డొచ్చిన పక్షులు, మనుషులు గాయపడడం వంటి సంఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయని తెలిపింది.
ఇక దేశీయంగా మాంజాను తయారుచేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికారక రసాయనాలవల్ల పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్తరప్రదేశ్ అంతటా గతేడాది నుంచి చైనా మాంజాను నిషేధించారని తెలిపిన పెటా... దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించింది.