కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..! | PETA Anoushka Shankar To Gift Mechanical Elephant To Kerala Temple | Sakshi
Sakshi News home page

కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!

Published Wed, Feb 5 2025 4:13 PM | Last Updated on Wed, Feb 5 2025 4:35 PM

PETA Anoushka Shankar To Gift Mechanical Elephant To Kerala Temple

దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..

గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. 

అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. 

ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్‌ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్‌(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్‌.

ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్‌ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

(చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement