తిరువనంతపురం: కేరళలోని అన్నైకట్టి ప్రాంతంలో అడవిజంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్యమృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అన్నైకట్టిలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగుచూసింది. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన భారీ ఏనుగు మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ ఇంటి సమీపంలో ఘీంకరించింది. ఆ చప్పుడు విన్న బాలామణి అనే మహిళ ఏం జరిగిందో తెలుసుకుందామని తన తమ్ముడి కూతురిని కూడా వెంటేసుకుని పరుగున బయటకు వచ్చింది.
ఒక్కసారిగా ఏనుగు వారివైపు తిరిగి.. ఆమెను కింద పడేసింది. బాలామణికి కొద్దిదూరంలోనే ఆ పసిపాప కూడా ఉంది. అది గనుక దాడిచేస్తే క్షణాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవే! అయితే, అదృష్టవశాత్తూ బాలామణి ప్రమాదం నుంచి బయటపడింది. భయానక ఘటనతో వణికిపోయిన ఆ పసిపాప బిగ్గరగా ఏడ్చింది. అది చూసిన ఆ ఏనుగు బాలామణికి హాని తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అన్నైకట్టి కొండ ప్రాంతం. అయితే, అక్కడి వన్యప్రాణులకు తాగేందుకు సరిపడా నీరులేకపోవంతో అవి జనావాసాల్లోకి చొరబడి దాడులు చేయడం మామూలైపోయింది. ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
షాక్ తిన్నా! తర్వాత ఏమైందో తెలియదు
‘భారీ శబ్దం వినిపిస్తే ఏమైందో చూద్దామని బయటికి వెళ్లాను. నాతోపాటు నా తమ్ముడి కూతురు కూడా ఉంది. ఏనుగును చూసి అక్కడ నుంచి పరుగెత్తుకెళ్దామనే లోపే అది తన తొండంతో నన్ను కిందకు తోసేసింది. ఒక్కసారిగా షాక్ తిన్నా! తర్వాత ఏమైందో స్పృహ లేదు. కాసేపటికి మా చిన్నదాని ఏడుపు విని మెలకువ వచ్చింది. ఆ దేవుడే మమ్మల్ని రక్షించాడు’ అని బాలామణి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment