పందెం గెలిచిన బాలు.. ఇక కృష్ణయ్య బాధ్యత తనదే | Annual Guruvayur Temple Anayottam elephant race, Balu wins | Sakshi
Sakshi News home page

పందెం గెలిచిన బాలు.. ఇక కృష్ణయ్య బాధ్యత తనదే

Published Mon, Mar 17 2025 2:54 PM | Last Updated on Mon, Mar 17 2025 2:54 PM

Annual Guruvayur Temple Anayottam elephant race, Balu wins

మడుగులో నీటికోసం దిగిన తనను మొసలి అమాంతం పట్టుకుని లోపలి ఈడ్చుకెళ్ళిపోతూ తనను హరించేస్తున్న తరుణంలో కన్నీటి పర్యంతమవుతూనే  సర్వ శక్తులు ఒడ్డుతూ పోరాడుతోంది. మరోవైపు మొసలికి స్థానబలం ఎక్కువగా ఉండే మడుగులో దాన్ని ఓడించడం గజేంద్రుడికి సాధ్యం కావడం లేదు... దీంతో

మొసలితో పోరాడలేక.. దాన్ని ఓడించలేక.. తనను తానూ కాపాడుకోలేక ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని అర్థం చేసుకుని తనను రక్షించేది ఈ భూలోకంలో శ్రీహరి ఒక్కడేనని అర్థం చేసుకుని విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఈ విధంగా మ్రెక్కింది.

కలఁ డందురు దీనులయెడఁ,
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను,
గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో

అని ప్రార్థించగా ఆ క్షణాన శ్రీదేవితో పాలసముద్రంలో శేషతల్పం మీద పయనిస్తున్న శ్రీహరి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఉన్న ఫలాన భూలోకానివచ్చి సుదర్శన చక్రంతో మొసలి కంఠాన్ని ఖండించి గజేంద్రుడిని కాపాడాడు. అప్పట్నుంచి గజేంద్రుడు శ్రీ హరి సేవలో ఉంటూ పునీతుడైనాడు. ఇక దక్షిణభారత దేశంలోనే ప్రముఖమైన గురువాయూర్ కృష్ణ మందిరంలో సోమవారం మొదలైన ప్రత్యేక ఉత్సవాలకు రంగం సిద్ధం చేసారు. గురువాయూర్ అంటేనే ఏనుగులకు ప్రసిద్ధి.. సువిశాలమైన కృష్ణ మందిరంలో అంతెత్తున గజరాజులు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటాయి.  అయితే ఈ ఉత్సవాల సందర్భంగా కృష్ణయ్యను మోసే బాధ్యత కూడా ఆ గజరాజులదే.. కృష్ణయ్య సదరు గజరాజుపై అధిరోహించి ఊరేగింపుగా వెళ్తారు. అయితే ఆలయంలో అన్నీ ఉత్తమోత్తమ జాతికి చెందిన గజరాజులే .. అందులో ఎవరికీ ఈ మహాద్భాగ్యం దక్కుతుంది.. అందుకే ఏటా మాదిరిగానే ఆలయంలో ఒక పోటీ పెట్టారు.

దేవి, దేవదాస్, చెంతమరాక్షన్, నందన్.. బాలు అనే కరిరాజుల మధ్య పరుగుపందెం నిర్వహించారు. మొత్తం 12 ఏనుగులను ఈ పోటీకి పరిశీలించగా అందులో బాలుతోబాటు ఐదు ఏనుగులను మాత్రమే ఫైనల్ పోటీకి నిలిపారు. ముందుగా వాటిని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయించి వాటి కంఠాన గణగణమని మోగే గంటలను అలంకరించి ముందుగా దేనికి సంబంధించిన మావటి దాను ముందుగా ఉరుకుతుంటే వారివెనుకనే కరిరాజులు పరుగెత్తాయి. ఈ పందెం చూసేవాళ్లకు కన్నులపంట కాగా వినేవాళ్లకు వీనులవిందు అవుతుంది. ఈ పందెంలో బాలు అనే గజరాజు విజయం సాధించాడు. విజయం తర్వాత, బాలు ఒలింపిక్ పతకం సాధించిన విజేత మాదిరి అందర్నీ విజయగర్వంతో పరికించి చూసి.. తొండం అభివాదం చేసాడు. తరువాత తూర్పు గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి, గురువాయురప్పన్‌కు భక్తితో ఏడు ప్రదక్షిణాలు చేసాడు. ఆ తరువాత ఈ ఉత్సవాల్లో స్వామిని మోసే బాధ్యత ఈ బాలుకు మాత్రమే దక్కుతుందన్నమాట..

ఈ సందర్భంగా నిర్వహించే పోటీలకు ముందు గజరాజులు వెటర్నరీ డాక్టర్లు ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు. అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే కాసిన్ని ఏనుగులను రంగంలోకి దించి పూర్తి భద్రతనడుమ ఈ పరుగుపందెం నిర్వహిస్తారు. జనం అల్లరికి ఏనుగులు బెదిరిపోయి జనంలోకి వెళ్లే ఇంకేదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ పోటీలు నిర్వహిస్తారు.. 

:::సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement