PETA india
-
చిరుతిండి వ్యాపారికి పెటా అవార్డు
సూరత్: గుజరాత్‌కు చెందిన చిరుతిండ్లు అమ్ముకునే చేతన్ పటేల్‌కు పెటా ఇండియా హీరో టు యానిమల్స్ అవార్డును ప్రకటించింది. చిన్న వ్యాపారైనా పెద్ద మనసుతో పక్షుల సంరక్షణకు చేతన్ కృషి చేశాడని కొనియాడింది. గాలిపటాల్లో వాడే మాంజా(నైలాన్ దారం) కారణంగా పక్షుల ప్రాణాలు పోతున్నాయని చేతన్ పలువురికి నచ్చజెప్పేవారు. అంతేకాకుండా ఉత్తరాయణ పండుగ అనంతరం బజార్లో పడేసిన కిలో మంజాను ఎవరు తెచ్చిఇచ్చినా వారికి కిలో చిరుతిండి ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో రోడ్లపై అడ్డదిడ్డంగా ఈ దారాలు పడిపోకుండా పక్షులకు ఇబ్బంది కలగకుండా చేతన్ యత్నించారని పెటా తెలిపింది. ఈ మేరకు చేతన్‌కు సర్టిఫికెట్‌ను అందించింది. మంజా దారం చాలా పదునుగా ఉంటుంది. దీనివల్ల పక్షుల కాళ్లు రెక్కలు తెగిపోతూఉంటాయి. -
రాకుమారుడికి కుర్తా...రాణిగారికి చీర
ముంబై : బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో మనదేశానికి చెందిన బాలీవుడ్ నటి ప్రియాంరా చోప్రాతో పాటు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మైనా మహిళా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా హాజరయ్యారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంటకు వివిధ దేశాల నుంచి బహుమతులు అందుతుండగా, వాటిలో మన దేశానికి చెందినవి కూడా ఉన్నాయ. ఈ రాయల్ వెడ్డింగ్‌కు మన దేశం నుంచి ముంబైకి చెందిన డబ్బావాలాలు, భారతీయ ‘పెటా’ సంస్థ బహుమతులు పంపారు. చీరను పంపిన డబ్బా వాలాలు.... ముంబైకి చెందిన డబ్బావాలలతో బ్రిటన్ రాజ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2003 భారతదేశ పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్‌కు తొలిసారి డబ్బావాలలతో పరిచయం ఏర్పడింది. డబ్బావాలాల పనితీరు, సమయ పాలన, నిబద్థత ప్రిన్స్ చార్లెస్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి. వారి పనితీరును మెచ్చుకోవడమే కాక తన వివాహ వేడుకకు డబ్బావాలాలను కూడా ఆహ్వానించాడు చార్లెస్. నాటినుంచి డబ్బావాలాలకు రాజకుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అయితే ప్రస్తుతం జరిగిన మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి వీరిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ ప్రిన్స్ చార్లెస్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా నిన్న జరిగిన ప్రిన్స్ హ్యారీ వివాహానికి డబ్బావాలాల తరుపున వీరు ప్రత్యేక బహుమతులు పంపారు. రాకుమారుడు హ్యారీ కోసం కుర్తా, తలపాగాను, మేఘనా మార్కల్ కోసం పసుపు, ఆకుపచ్చ రంగుల కలయికలో ఉన్న ‘పైథానీ’ చీరను బహుమతిగా పంపారు. అంతేకాక వివాహ వేడుక సందర్భంగా ముంబై ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల కుటుంబాలకు మిఠాయిలు పంచారు. ఈ విషయం గురించి డబ్బావాలా అసోసియేషన్ ప్రతినిధి సుభాష్ తాలేకర్ ‘గతంలో ప్రిన్స్ చార్లెస్ వివాహానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ వేడకకు హాజరయిన మమ్మల్ని సాదరంగా ఆదరించిడమే కాక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకే ప్రిన్స్ హ్యారీ వివాహా వేడుకకు మమ్మల్ని ఆహ్వానించనప్పటికి, మేము మా సంతోషాన్ని తెలపాలనుకున్నాం. అందుకే ఇలా మా తరఫున బహుమతులు పంపామ’న్నారు. పెటా బహుమతి ‘మెర్రి’... డబ్బావాలాలతో పాటు ‘పెటా’(పిపుల్ ఫర్ ద ఎథికల్ ట్రిట్మెంట్ ఆఫ్ ద అనిమల్స్) కూడా మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి బహుమతి పంపింది. వీరి వివాహానికి గుర్తుగా ‘పెటా’ ఒక ఎద్దుకు వీరిద్దరి పేర్లు కలిసేలా ‘మెర్రి’(మేఘన్లో మె, హ్యారీలో రి కలిపి మెర్రి) అనే పేరును పెట్టి, ఆ ఎద్దు ఫోటో తీసి దానితో పాటు ఒక సందేశాన్ని కూడా పంపారు. ‘మెర్’రి(ఎద్దు) ని పూలమాలతో అలంకరించి ఫోటో తీసారు. ఫోటోతో పాటు పంపిన సందేశంలో మెర్రి కథను తెలియజేసారు. ఆ సందేశంలో ‘కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలో గాయలతో, ఒంటరితనంతో బాధపడుతున్న మెర్రిని చూడటం జరిగింది. పాపం అది తన జీవిత కాలమంతా బరువులను మోస్తూ సేవ చేసింది. వయసు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న మెర్రిని ఇప్పుడిలా ఒంటరిగా వదిలేసారు. మేము ‘మెర్రి’ బాధ్యతను తీసుకుని, దానికి వైద్యం చేయించి ఒక సంరక్షణా కేంద్రానికి తరలించాము. ప్రస్తుతం ‘మెర్రి’ సంరక్షణా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటూ తన మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంద’ని తెలిపారు. ‘ఈ రాయల్ వెడ్డింగ్ సందర్భంగా జనాలకు మూగ జీవుల పట్ల దయగా వ్యవహరించాలనే సందేశాన్ని ప్రచారం చేయాలని భావించాము...అందుకే మెర్రి(ఎద్దు) ఫొటోను బహుకరించామ’ని పెటా అసోసియేట్ డైరెక్టర్ సచిన్ బంగోరా తెలిపారు. -
మాంజాను నిషేధించండి
ఎన్జీటీలో పెటా పిటిషన్ న్యూఢిల్లీ: గాలిపటాలను ఎగురవేసేందుకు గాజుపూత పూసిన మాంజాను వినియోగించడంపై నిషేధం విధించాలని కోరుతూ జీవకారుణ్య సంస్థ-పెటా జాతీయ హరిత ధర్మాసనానికి(ఎన్జీటీ) ఫిర్యాదు చేసింది. ప్రత్యేకించి చైనా నుంచి భారీగా దిగుమతి అవుతున్న గాజుపూత పూసిన మాంజా వల్ల పక్షులతోపాటు మనుషులు కూడా గాయపడడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారని పిటిషన్లో పేర్కొంది. కాటన్ దారాలకు బదులుగా నైలాన్ దారాలను వాడుతున్నారని, అవి ఎంతకూ తెగకపోవడం, వాటికి అడ్డొచ్చిన పక్షులు, మనుషులు గాయపడడం వంటి సంఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. ఇక దేశీయంగా మాంజాను తయారుచేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికారక రసాయనాలవల్ల పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్తరప్రదేశ్ అంతటా గతేడాది నుంచి చైనా మాంజాను నిషేధించారని తెలిపిన పెటా... దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో అభ్యర్థించింది. -
హాటెస్ట్ వెజిటేరియన్లు వీళ్లే!
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ అనుష్కా శర్మ.. వీళ్లిద్దరినీ 2015 సంవత్సరానికి గాను హాటెస్ట్ వెజిటేరియన్లగా పెటా ఎంపిక చేసింది. అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, ఆర్. మాధవన్, ధనుష్.. ఇలా ఎంతోమంది ఈ టైటిల్ కోసం పోటీపడినా, వాళ్లందరినీ తోసిరాజని ఆమిర్, అనుష్క గెలుచుకున్నారు. పెటాఇండియా.కామ్ వెబ్సైట్ చూసేవాళ్లందరినీ తమకు బాగా నచ్చిన వెజిటేరియన్లకు ఓట్లు వేయాల్సిందిగా కోరారు. తాను పూర్తి 'వెగన్'గా మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే ప్రకటించాడు. అంటే పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, తేనె, తోలు, ఫర్, పట్టు, ఊలు, కాస్మొటిక్స్, పశు ఉత్పత్తుల నుంచి తయారుచేసిన సోపులు కూడా వాడరన్నమాట. వెగన్స్ అంటే నాన్ వెజిటేరియన్లు, వెజిటేరియన్ల కంటే కూడా ఎక్కువని తాను కన్విన్స్ అయినట్లు ఆమిర్ చెప్పాడు. అలాగే.. మనం ఏం తింటున్నామన్నది చాలా ముఖ్యమని, తగినన్ని కాయగూరలు తినడం, తగినంత నీళ్లు తాగడం అవసరమని, తాను ఎప్పుడూ అలాగే చేస్తానని అనుష్కాశర్మ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆమిర్.. అనుష్క.. వీళ్లిద్దరూ వెజిటేరియన్లకు సరైన ఉదాహరణ అని పెటా ఇండియా మేనేజర్ సచిన్ బంగెరా అన్నారు.