
దక్షిణ అమెరికా దేశమైన పెరులో పురాతనమైన క్రిస్మస్ సంత ఏటా డిసెంబర్ 24న ప్రారంభమవుతుంది. ఈ సంత దాదాపు ఐదువందల ఏళ్లకు పైగా కొనసాగుతోంది. పెరులోని కుస్కో నగరంలో ఏర్పాటు చేసే ఈ సంతకు దేశం నలుమూలలకు చెందిన హస్తకళా నిపుణులు తాము తయారు చేసిన బొమ్మలు, చిత్రపటాలు, ఇతర కళాఖండాలతో చేరుకుంటారు. క్రిస్మస్ రోజు అర్ధరాత్రి వరకు ఈ సంత కొనసాగుతుంది. ‘శాంచురాంటికై’ పేరుతో ఈ సంతను ఏర్పాటు చేయడాన్ని పెరు ప్రజలు పండుగలాగా జరుపుకొంటారు.
వీథుల్లో నృత్యగానాలతో ఊరేగింపులు జరుపుతూ సందడి చేస్తారు. ఈ సంతలో రకరకాల పరిమాణాల్లో తయారు చేసిన బాల ఏసు బొమ్మలు, ఏసుక్రీస్తు జన్మించిన పశువులపాక నమూనా బొమ్మలు, ఉయ్యాలలోని ఏసు బొమ్మలు, బాల ఏసును తిలకించడానికి వచ్చిన దేవదూతల బొమ్మలు వంటివి అమ్ముతారు. వెదురు, కలప, పింగాణి, వెండి వస్తువులను, సంప్రదాయకరమైన ఆభరణాలను, క్రిస్మస్ అలంకరణల కోసం ఉపయోగించే ఆలివ్ కొమ్మలు, అడవి మొక్కలు వంటివి కూడా అమ్ముతారు. పెరులో జరిగే ఈ సంతను యూనిసెఫ్ ప్రపంచ వారసత్వ వేడుకగా గుర్తించింది.
(చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)