ఆ దేశాల్లో న్యూ ఈయర్‌కి ఎలా స్వాగతం పలుకుతారో తెలుసా..! | New Year 2025: New Year's Eve Traditions In Different Countries | Sakshi
Sakshi News home page

New Year 2025: ఆ దేశాల్లో న్యూ ఈయర్‌కి ఎలా స్వాగతం పలుకుతారో తెలుసా..!

Published Sat, Dec 28 2024 11:58 AM | Last Updated on Sat, Dec 28 2024 12:07 PM

New Year 2025: New Year's Eve Traditions In Different Countries

కొత్త సంవత్సరం వేడుకలను కోలాహలంగా జరుపుకోవడం చాలాకాలంగా కొనసాగుతోంది. సంవత్సర ఆరంభ దినాన పాత అలవాట్లను వదిలేస్తామని కొత్తగా తీర్మానాలు చేసుకోవడం, కొత్త డైరీలను ప్రారంభించడం, కొత్త సంవత్సరం సందర్భంగా కేకు కోసి, బంధుమిత్రులతో పంచుకోవడం, ఆత్మీయులతో కలసి విందు వినోదాలు జరుపుకోవడం, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం వంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతులే! కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా పాటించే ప్రత్యేక ఆచారాలు, పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవి కొంత వింతగా ఉంటాయి. ఇలాంటి వింత ఆచారాల గురించి, కొత్త సంవత్సరం ముచ్చట్లు గురించి తెలుసుకుందాం.

టమాలీల కానుక
ఆత్మీయులకు ఇంట్లో వండిన టమాలీలను కానుకగా ఇవ్వడం మెక్సికన్ల ఆచారం. టమాలీ స్పానిష్‌ సంప్రదాయ వంటకం. టమాలీల తయారీలో మొక్కజొన్న పిండితో పాటు కూరగాయల ముక్కలు, మాంసం, సుగంధద్రవ్యాలు ఉపయోగిస్తారు. కొత్త సంవత్సరం జరుపుకొనే విందు కార్యక్రమాల్లో ఈ టమాలీలను స్థానికంగా ‘మెనుడో’ అని పిలుచుకునే సూప్‌తో కలిపి వడ్డిస్తారు. మెక్సికన్లు టమాలీలను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. 

పన్నెండు ద్రాక్షలు
డిసెంబర్‌ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలు కొడుతుండగా, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ఒక్కొక్కరు పన్నెండు ద్రాక్షలను ఆరగించడం స్పానిష్‌ ఆచారం. స్పెయిన్‌లో మాత్రమే కాదు, స్పానిష్‌ ప్రజలు ఎక్కువగా నివసించే లాటిన్‌ అమెరికా దేశాల్లోను, కరీబియన్‌ దీవుల్లోను ఈ ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. పన్నెండు ద్రాక్షలను కొత్త సంవత్సరంలోని పన్నెండు నెలలకు సంకేతంగా భావిస్తారు. 

స్పెయిన్‌లోని అలకాంటీ ప్రాంతానికి చెందిన ద్రాక్షతోటల యజమానులు 1895లో ఈ ఆచారాన్ని ప్రారంభించారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఈ ఆచారం స్పానిష్‌ ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి గడియారం పన్నెండు గంటలు కొడుతుండగా, ఒక్కో గంటకు ఒక్కో ద్రాక్ష చొప్పున పన్నెండు ద్రాక్షలు తినే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. స్పానిష్‌ ప్రజలు ఈ తంతు తర్వాతనే కేకు కోయడం, బాణసంచా కాల్చడం వంటి సంబరాలు జరుపుకుంటారు.

ద్వారానికి ఉల్లిపాయలు
కొత్త సంవత్సరం సందర్భంగా గ్రీకు ప్రజలు చర్చిలలో ప్రార్థనలు జరిపి, ఇళ్లకు చేరుకున్న తర్వాత, ఇళ్ల ప్రవేశ ద్వారాలకు, గుమ్మాలకు ఉల్లిపాయలను వేలాడదీస్తారు. ఉల్లిపాయలను ఇలా వేలాడదీయడం వల్ల ఇంట్లోని వారికి ఆయురారోగ్య వృద్ధి, వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇలా వేలాడదీసిన ఉల్లి΄పాయలను మరునాడు వేకువ జామునే తొలగిస్తారు. ద్వారాల నుంచి తొలగించిన ఉల్లిపాయలతో ఇంట్లో నిద్రిస్తున్న పిల్లల నుదుటికి తట్టి, వారిని నిద్రలేపుతారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దృష్టిదోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం.

సోబా నూడుల్స్‌తో ప్రారంభం
కొత్త సంవత్సరం రోజున జపాన్‌లో వేడి వేడి సోబా నూడుల్స్‌ తింటారు. ఈ ఆచారాన్ని జపానీస్‌ ప్రజలు పన్నెండో శతాబ్ది నుంచి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పొడవాటి ఈ నూడుల్స్‌ను కొరికి తినడం వల్ల పాత ఏడాదిలోని చెడును కొరికి పారేసినట్లేనని జపానీస్‌ ప్రజలు భావిస్తారు. వేడి వేడి సూప్‌లో ఉడికించిన సోబా నూడుల్స్‌ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని, శీతకాలంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని పురాతన జపానీస్‌ పాకశాస్త్ర గ్రంథాలు చెబుతుండటం విశేషం.

అన్నీ గుండ్రమైనవే
కొత్త సంవత్సరం సందర్భంగా ఫిలిప్పీన్స్‌ ప్రజలు గుండ్రని వస్తువులను సేకరించడాన్ని, గుండ్రని డిజైన్లు ఉన్న దుస్తులు ధరించడాన్ని, గుండ్రని పండ్లు, ఆహార పదార్థాలు తినడాన్ని శుభప్రదంగా భావిస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా గుండ్రంగా ఉండే పుచ్చకాయలు, యాపిల్, ద్రాక్ష, కివీ, దానిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లను, గుండ్రంగా ఉండే డోనట్స్, కుకీస్, గుడ్లు తింటారు. 

అలాగే, గుండ్రంగా ఉండే నాణేలను సేకరించి దాచుకుంటారు. గుండ్రంగా ఉండే లాకెట్లను ధరిస్తారు. గుండ్రమైన వస్తువులను పరిపూర్ణమైన జీవితానికి సంకేతంగా భావిస్తారు. కొత్త సంవత్సరం రోజున అన్నీ గుండ్రంగా ఉండేటట్లు చూసుకుంటే జీవితంలో పరిపూర్ణత సాధించగలుగుతామని వీరి విశ్వాసం.

కొత్త సంవత్సరం కానుకలు
కొత్త సంవత్సరం సందర్భంగా ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం చాలా చోట్ల ఉన్న పద్ధతే అయినా, జర్మనీలో మాత్రం దీనిని తప్పనిసరి ఆచారంగా పాటిస్తారు. జర్మన్లు కొత్త సంవత్సర వేడుకలకు హాజరైన తమ ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కానుకల్లో పుస్తకాలు, పెన్నులు వంటి సర్వసాధారణమైన వస్తువుల నుంచి ఖరీదైన వజ్రాభరణాల వంటివి కూడా ఉంటాయి. 

జర్మన్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూనే, షాంపేన్‌ లేదా స్పార్మింగ్‌ వైన్‌ను రుచి చూస్తారు. దీనివల్ల సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని వారి నమ్మకం. జర్మన్లకు మరో వింత ఆచారం కూడా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా చిన్న చిన్న సీసపు విగ్రహాలను కరిగించి, కరిగిన సీసాన్ని నీట్లోకి పోస్తారు. నీటిలో ఆ సీసం సంతరించుకునే ఆకారాన్ని బట్టి, కొత్త సంవత్సరంలో జీవితం ఎలా ఉండబోతుందో జోస్యం చెబుతారు. 

ధవళవస్త్ర ధారణ
కొత్త సంవత్సరం వేడుకల్లో బ్రెజిల్‌ ప్రజలు ధవళవస్త్రాలను ధరిస్తారు. బ్రెజిల్‌లో జరిగే కొత్త సంవత్సరం వేడుకల్లో ఎక్కడ చూసినా, తెలుపు దుస్తులు ధరించిన జనాలే కనిపిస్తారు. సంవత్సర ప్రారంభ దినాన తెలుపు దుస్తులను ధరించడం వల్ల సంతవ్సరమంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడుస్తుందని బ్రెజిలియన్ల నమ్మకం. తెలుపు దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ్ర΄ార్థనలు జరుపుతారు. అనంతరం కొత్త సంవత్సరం వేడుకలను విందు వినోదాలతో ఆర్భాటంగా జరుపుకుంటారు.

దిష్టిబొమ్మల దహనం
ఆఫ్రికన్‌ దేశమైన ఈక్వడార్‌లో కొత్త సంవత్సరం సందర్భంగా ఇళ్ల ముందు వీథుల్లో దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పాత కాగితాలు, కట్టెల పొట్టు, చిరిగిన దుస్తులు నింపి, మానవాకారాల్లో దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ దిష్టిబొమ్మలను గడచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలకు, నష్టాలకు, దురదృష్టాలకు సంకేతంగా భావిస్తారు. వీటిని తగులబెట్టడం ద్వారా కొత్త సంవత్సరంలో అదృష్టం కలసివస్తుందని నమ్ముతారు. 

ఇంకొన్ని వింత ఆచారాలు
కొత్త సంవత్సరానికి సంబంధించి ఇంకొన్ని వింత ఆచారాలు కూడా ఉన్నాయి. ఐర్లండ్‌లో ప్రజలు బ్రెడ్‌ స్లైస్‌తో ఇంటి తలుపులను, కిటికీలను, గోడలను కొడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని నమ్ముతారు.  ఆచార సంప్రదాయాలు ఎలా ఉన్నా, కొత్త సంవత్సరం అంటేనే ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త సంరంభం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్‌ హ్యాపీస్‌ 2025

పాత్రల మోతతో స్వాగతం
కొత్త సంవత్సరానికి ఇంగ్లండ్, ఐర్లండ్‌లలోని కొన్ని ప్రాంతాల ప్రజలు విచిత్రంగా స్వాగతం పలుకుతారు. ఇంట్లోని గిన్నెలు, మూకుళ్లు, తపేలాలు వంటి వంటపాత్రలపై గరిటెలతో మోత మోగిస్తూ చేసే చప్పుళ్లతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. వంట΄ాత్రలను మోగిస్తూ రణగొణ ధ్వనులను చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని వారి నమ్మకం. తొలుత ఈ ఆచారం ఐర్లండ్‌లో ప్రారంభమైందని చెబుతారు. తర్వాతి కాలంలో ఐర్లండ్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు కూడా ఈ ఆచారం వ్యాపించింది.

గుమ్మడి సూప్‌ స్వేచ్ఛా చిహ్నం
హైతీలో కొత్త సంవత్సరాన్ని గుమ్మడి సూప్‌ సేవించడంతో రంభిస్తారు. వీరికి జనవరి1 స్వాతంత్య్ర దినోత్సవం కూడా! గుమ్మడి సూప్‌ను హైతీయన్లు ‘సూప్‌ జోమో’ అంటారు. స్వాతంత్య్రానికి ముందు హైతీని పాలించిన స్పానిష్, ఫ్రెంచ్‌ వలస పాలకుల హయాంలో గుమ్మడి సూప్‌ను రుచి చూడటానికి స్థానిక నల్లజాతి ప్రజలకు అనుమతి లేదు. అందుకే స్వాతంత్య్రం పొందిన తర్వాత హైతీయన్లు స్వేచ్ఛా చిహ్నంగా గుమ్మడి సూప్‌ సేవనంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం ఆచారంగా మార్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement