వదనం మధురం...
ఉడిపి ఉత్సవాలు
ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో రోజూ వేకువజామున జరిగే పూజలు నయనానందకరంగా సాగుతాయి. అలాగే స్వామివారికి ఏటా జరిపే శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మకరసంక్రాంతి, రథసప్తమి, మాధవి నవమి, హనుమజయంతి, నవరాత్రి మహోత్సవాలు, నరకచతుర్దశి, దీపావళి, గీతాజయంతి.. మొదలైన ఉత్సవాలు ఇక్కడ వేడుకగా జరుపుతారు.
లోకానికి ఇది మంచి, ఇది చెడు అని హద్దులు గీసి మరీ నిర్ణయించి చూపిన గీతాచార్యుడు ఆయన. మనిషి జన్మ మాయ చుట్టూ పరిభ్రమిస్తుందని విశ్వాన్ని కళ్లకు కట్టిన జగన్మోహనుడు ఆయన. ధర్మసంస్థాపన కోసం ధరించిన అవతారాలలో ఆయనది పరిపూర్ణ అవతారం. ఆయనే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఉడిపి దివ్యక్షే త్రంలో కొలువుదీరి భక్తుల కొంగుబంగారమై అలరారుతున్నాడు కృష్ణభగవానుడు.
దేశంలో విరాజిల్లుతున్న అతి సుందర దివ్యమందిరాలలో ఉడిపి కృష్ణ మందిరం ఒకటి. మధుర, బృందావనం, ద్వారక... ఆపైన ఉడిపి ఈ మందిరాలన్నీ అతి సుందరం. బెంగుళూరుకు సుమారు 500 కి.మీ దూరంలో ఉడిపి క్షేత్రం ఉంది. ఎత్తై కొండలు, ఆకాశంతో ఊసులాడుతున్నట్టు ఎత్తై పచ్చని చెట్లు, మెల్లగా, సన్నగా సవ్వడి చేస్తూ నురుగలతో ఎగిసిపడే సముద్రం... ఉడిపికి వెళ్లేదారిలోనే మనసు పులకించిపోతుంది.
స్వాగత ద్వారం
ఈ పచ్చని సుందర దృశ్యాలను తిలకిస్తూ ఈ దారి గుండా వెళుతుంటే మొదటగా రమణీయమైన స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఇక్కడి నుంచి కృష్ణ నామం వినిపిస్తూ మనసంతా ఆనందంతో పరవశించిపోతుంది. పేరు వింటేనే ఇంత ఆనందపరవశులయితే ఇక ఆయన దివ్యమంగళ రూపం చూస్తే.. ఎంత ఆకర్షణకు లోనవుతామో..! అసలు కృష్ణ అంటేనే ఆకర్షణ అని అర్థం. ఆయన రూపానికి తగిన విధంగానే ఆలయమూ మన మనసులను దోచుకుంటుంది.
ప్రధాన ద్వారం
కంటికింపైన రంగులతో దేవతామూర్తులతో భక్తుల చూపులను కట్టిపడేస్తుంది ప్రధాన ద్వారం. ముందుగా లక్ష్మీదేవి, ఆ పైన ఆదిశేషుడు తలపై కిరీటంలా భాసిల్లుతుండగా కృష్ణపరమాత్ముడు అభయముద్రలో కనిపిస్తాడు. ఇరువైపులా హనుమంతుడు, గరుత్మంతుడు జోతలు అర్పిస్తూ కనిపిస్తారు. ఇది వైష్ణవాలయం అయినప్పటికీ శైవ చిత్రాలూ ఉండి శివకేశవ భేదం లేదనిపిస్తుంది. ఈ రాజద్వారం దాటి లోపలికి వె ళ్లిన భక్తులకు అద్భుతమైన ఆనందపరవశం కలుగుతుంది. ఇదే గర్భమందిరమేమో అనిపిస్తుంది. ఈ ముఖద్వార అద్భుతాలను వీక్షిస్తూ లోపలికి విచ్చేస్తారు భక్తజనం.
కిటికీ గుండా దర్శనం
ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవద్వారం వస్తుంది. పీఠాధిపతులకు తప్పితే దీని ద్వారా గర్భగుడిలో అన్యులకు ప్రవేశం ఉండదు. చెన్నకేశవస్వామి ద్వారం నుండి ముందుకు వెళితే శ్రీకృష్ణ దర్శనానికి వెండితో తాపడం చేసిన నవరంధ్రాల కిటికీని చేరుకోవచ్చు. నేరుగా కాకుండా కిటికీ గుండానే స్వామిని దర్శించే మహత్తర క్షేత్రం లోకంలో ఉడిపి మాత్రమే. మనిషి శరీరంలోని నవరంధ్రాలకు ఈ కిటికీ ప్రతీక అని చెబుతారు. ఈ కిటికీ గుండా చూపులను లోపలికి సారిస్తే గుండె డోలాయమానం అవుతుంది. బాలకృష్ణుడి దివ్యమంగళరూపం... చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. అలనాటి యశోద ముంగిట ముద్దుగారే ముత్యంలా.. ఒక చేత తాడు, మరో చేత కవ్వము ధరించిన శ్రీకృష్ణ జగన్మోహనాకార రూపం క్షణకాలం ఆనందలోకాలకు తీసుకెళుతుంది.
శ్రీకృష్ణుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. అందులో వృద్ధులైన తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు ఉంటారు. వారిని వెంట తీసుకెళ్లి, ఆ మంగళస్వరూపుని దర్శనభాగం కల్పిస్తే పెద్దల ఆశీస్సులు తద్వారా ఆ భగవానుని కృప మన వెన్నంటే ఉంటుంది.
సందర్శనీయ స్థలాలు
ఉడిపిని సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు తగిన సమయం. కృష్ణమందిరం, మణిపాల్, చంద్రమౌళీశ్వర మందిరం, మల్పే బీచ్, దరియా బహదుర్గాద్ కోట, సెయింట్ మేరీస్ ఐల్యాండ్... మొదలైనవి ఈ చుట్టుపక్కల దర్శనీయ స్థలాలు.
ఇలా చేరుకోవచ్చు
బెంగుళూరు నుంచి ఉడిపి 500 కిలోమీటర్ల దూరం. మంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి రోడ్డు ద్వారా అయితే సుమారు 913 కి.మీ. దూరం. రైలు ద్వారా అయితే 1500 కి.మీ దూరం. విమానం ద్వారా అయితే మంగళూరుకు చేరుకొని అక్కడ నుంచి ఉడిపికి చేరుకోవచ్చు.
బస్సు: హైదరాబాద్ నుంచి ఉడిపికి దాదాపు 13-15 గంటల లోపు చేరుకోవచ్చు. సుమారు రూ.1000 నుంచి 1300 వరకు ప్రైవేట్ బస్సుల టికెట్ల ధరలు ఉన్నాయి.
రైలు: హైదరాబాద్ (కాచిగూడ) స్టేషన్ నుంచి మంగళూరు ఎక్స్ప్రెస్ ఉంది.
విమానాశ్రయం: ‘బాజ్పె ఎయిర్పోర్ట్’ మంగళూర్లో ఉంది. ఇది ఉడిపికి 60 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నాన్స్టాప్ కాకుండా కనెక్టింగ్ ఫ్లయిట్స్ ఉన్నాయి. చెల్లించే డబ్బుని బట్టి ఒన్ స్టాప్ టూ స్టాప్స్ ఫ్లయిట్స్ ఉన్నాయి.
- ఎన్.ఆర్
800 ఏళ్ల క్రితం ప్రతిష్ఠాపన
ఈ మందిరంలో సుందరమైన శ్రీకృష్ణభగవానుడి విగ్రహాన్ని సుమారు 800 ఏళ్ల క్రితం ద్వైతమత స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది. మధ్వాచార్యులు ఎనిమిది మంది బ్రహ్మచారి శిష్యులకు సన్యాస దీక్షనందించి, వారి ద్వారా శ్రీకృష్ణుడికి పూజాదికాలు నిర్వహించే ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన మఠాల నుంచి ఎంపికైన వారే రెండేళ్ల కొకసారి దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భక్తుడికి అనుగ్రహం...
వాదిరాజు పాలనలో కనకదాస అనే భక్తుడు ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని తహతహలాడుతుండేవాడు. కాని, అతను కడజాతి వాడు అని పూజారులు గుడిలోకి అనుమతించలేదు. అప్పుడు అనుగ్రహించిన కృష్ణుడు తన విగ్రహం వెనుకవైపున గోడకు కన్నం ఏర్పాటు చేసి వెనుకకు తిరిగి భక్తుడైన కనకదాసకు దర్శనమిచ్చి కరుణించాడు. అప్పటి నుంచి ఈ కిటికీకి ’కనకనకిండి’ అనే పేరు వచ్చింది. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్లి దక్షిణ మార్గంవైపు వెళితే ఎడమభాగాన మధ్వాచార్యుల మంటపం కనిపిస్తుంది.
నలుపురంగు, సాలిగ్రామ శిలతో తయారుచేసిన ఇక్కడి కృష్ణ విగ్రహం నయనమనోహరంగా ఉంటుంది. ఆలయం కుడివైపు భాగంలో దేవస్థానం సత్రాలు బిర్లా, శృంగేరీ, కృష్ణ, గీతాసత్రాలలోని గదుల్లో విడిది చేయవచ్చు. ఉడిపి దేవస్థానంలో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఉడిపిలో అత్యాధునిక వసతిసదుపాయాలు గల హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. కిందటేడాది అక్టోబర్లో వృద్ధుల అత్యవసర సాయం కోసం కర్ణాటక ప్రభుత్వం 1090 హెల్ప్లైన్ను ప్రారంభించింది. దీని ప్రధాన కేంద్రం బెంగళూరు