‘నేను కృష్ణానదిలో దూకి చచ్చిపోతా... నా చావుకు మీరే బాధ్యులవుతారు’ అంటూ ఓ అర్చకుడు పోలీసులపై ఆగ్రహావేశాలు వెళ్ళగక్కాడు. కృష్ణా పుష్కరాలలో పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు గుర్తింపు కార్డుతో వచ్చిన ఓ అర్చకుడు ఘాట్‌ల వద్ద నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తున్నాడు. ఇటువైపు నుంచి వెళ్ళడానికి వీలు లేదని, లోనికి రావడానికి మాత్రమే ఇది దారి అంటూ పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులకు ఆ అర్చకుడు గుర్తింపు కార్డు చూపిస్తూ ఇది ఏమి రూలు, ఇది ఏమి ప్రభుత్వం అక్కడ ఆయన దేవుడి పూజలంటూనే పుష్కరాల పేరుతో ఆలయాలు కూలుస్తున్నాడు, నడిచే వారికి కూడా దారి లేదంటూనే పోలీసులు మాత్రం బైక్‌లపై తిరుగుతున్నారు, అర్చకులకు కనీసం షెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఇదేం న్యాయం అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పోలీసులు వారి భాషలో హెచ్చరించడంతో చిన్నబోయిన అర్చకుడు కృష్ణానదిలో దూకి చచ్చిపోతా, నా చావుకు మీరే బాధ్యులు అని చెప్పడంతో అతనిని అడ్డుకుని వెనక్కి పంపించారు. అర్చకుడి మాటలకు నివ్వెరపోయి చూడటం పోలీసుల వంతైంది.