చైనా మాంజాపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
పక్షులు, ప్రజల భద్రతకు చర్యలు చేపట్టండి
సంక్రాంతి నేపథ్యంలో ఈ చర్యలు తప్పనిసరి
‘మాంజా’పై పిటిషన్‌లో జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు
తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: పక్షులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. 2017లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని చెప్పింది. అంతేకాదు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ఆదేశాలను కూడా అమలు చేయాలని పేర్కొంది.
ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. చైనా మాంజా వినియోగంపై 2017లో ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులు పాటించేలా పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కాచిగూడకు చెందిన సంజయ్ నారాయణ్ పంజరి హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు.
సింథటిక్ నైలాన్ దారానికి గ్లాస్ పౌడర్ లేదా మెటల్ వంటి రాపిడి పదార్థాలతో కోటింగ్ వేసి మాంజా తయారు చేస్తున్నారు.. ఇది వన్యప్రాణుల, ప్రజాభద్రతతో పాటు పర్యావరణానికి పెనుముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఎన్‌జీటీ నిషేధం విధించినా సంక్రాంతి పండుగ సందర్భంగా విరివిగా మార్కెట్‌లో విక్రయం చేస్తున్నారని వెల్లడించారు. విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్నారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ.. ‘సంక్రాంతిని దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేయడం పండుగలో అంతర్భాగంగా వస్తోంది. కాటన్ దారాలతో గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉండేది. పోటీ పెరగడంతో కాలక్రమేణా సింథటిక్, గాజు పూతతో కూడిన మాంజాలు విస్తృతంగా వినియోగిస్తున్నారు.
స్తంభాలు, చెట్లతోపాటు పలుచోట్ల చిక్కుకున్న మాంజా గాలిలో వేలాడుతూ ఉండటం పక్షులు, మనుషుల మరణాలకు దారితీస్తోంది. మాంజాతో మనుషులు తీవ్రంగా గాయపడిన, చనిపోయిన సంఘటనలున్నాయి. బీఎన్‌ఎస్ సెక్షన్ 223 ప్రకారం చైనీస్ మాంజా వాడితే రూ.5 వేల జరిమానా కూడా విధించవచ్చు’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్‌జీటీ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.
మాంజాపై 2017లోనే నిషేధం సాక్షి ఫ్లస్ (ఈ– పేపర్)లో
Comments
Please login to add a commentAdd a comment