హైదరాబాద్, సాక్షి: పతంగి దారాలు పండుగ పూట ఉత్త పుణ్యానికి మనుషుల కుత్తుకలు కోస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడగా.. తాజాగా సోమవారం మరో ప్రాణం పోయింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గాలిపటాలు ఎగరేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. నిషేధిత చైనా మాంజా దారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
సంక్రాంతి వేళ గాలి పటం సరదా ప్రాణాలు తీస్తోంది. బిల్డింగ్‌పై నుంచి పడి ఇద్దరు, విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మాంజా దారం తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన సంగతీ తెలిసిందే. అలా గడిచిన రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మరో మరణం సంభవించింది. విద్యుత్ తీగలకు తగిలిన పతంగి తీసే క్రమంలో 22 ఏళ్ల యువకుడికి షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆ యువకుడు కన్నుమూశాడు. ఝరాసంగం మండలం పొట్‌పల్లిలో ఇది జరిగింది.
వరుస ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు గాలి పటం ఎగరేసేలా చూడాలని కోరుతున్నారు. బిల్డింగ్‌లపై కాకుండా మైదానాల్లో పతంగులు ఎగరేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో.. మాంజాదారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్లా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి దుకాణాల్ని సీజ్ చేస్తున్నాయి. సరదా పేరిట పతంగులు ఎగరేస్తూ పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడ్డా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment